కన్నవాళ్లనే కిరాతకంగా కాటేస్తున్నారెందుకు..?

x
Highlights

నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులు. బిడ్డల బంగారు భవిష్యత్‌ కోసం కొవ్వొత్తిలా కరిగే వెలుగు దీపాలు. అలాంటి వారిని ఆస్తిపాస్తులు, డబ్బుల కోసం...

నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులు. బిడ్డల బంగారు భవిష్యత్‌ కోసం కొవ్వొత్తిలా కరిగే వెలుగు దీపాలు. అలాంటి వారిని ఆస్తిపాస్తులు, డబ్బుల కోసం పాశవికంగా హతమారుస్తున్నారు కన్న బిడ్డలు. జల్సాలకు డబ్బులివ్వలేదని ఓ కొడుకు, ఆస్తి పంచలేదని మరో కొడుకు, తల్లికి సేవల చేయలేక ఇంకో ప్రబుద్ధుడు ఇలా చెప్పుకుంటూ వెళితే ఇటీవల జరిగిన అనేక పరణిమాలు సమాజంలో మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. మానవత్వమా నీవెక్కడ అంటున్నాయి.

ఆస్తి పంచడంలో కాలయాపన చేస్తోందని తండ్రి చనిపోయిన నెల రోజులకే తల్లిని ముట్టబెటమటాడో పచ్చి స్వార్థపరుడు...ఆస్తిలో వాటా ఇవ్వడం లేదని మద్యం మత్తులో తండ్రిని కొట్టిన మరో కొడుకు..చిట్టీల వ్యాపారం చేసి పరువు తీస్తోందని తల్లి తలపై రాడ్డుతో కొట్టి, గుండెలపై గుర్చుకుని పీకనొక్కి చంపేశాడు ఇంకొకడు...జల్సాలకు డబ్బు ఇవ్వలేదని తల్లిపై పెట్రోలు పోశాడో దుర్మార్గుడు...పక్షవాతంతో బాధపడుతున్న తల్లికి సేవ చేయాల్సింది పోయి పీక కొన్ని హతమార్చాడో కుర్రాడు...ఇలా ఇటీవల కాలంలో తల్లిదండ్రులపై అనేక దాడులు జరుగుతున్నాయి. నవమాసాలు కనీ పెంచి, పెద్ద చేసిన కన్నవారినే అతి కిరాతకంగా హతమారుస్తున్నారు. క్షణికావేశంలో జన్మనిచ్చిన అమ్మా నాన్నలనే పైలోకాలకు పంపిస్తున్నారు.

డబ్బు అనే జబ్బు చేసిన నేటి కాలంలో కొందరు పిల్లలు ఆ డబ్బు కోసం కన్నవారినే కడతేరుస్తున్నారు. కాసుల కోసం తల్లిదండ్రులపై బిడ్డలు దౌర్జన్యం చేస్తూ గుండెల్లో గుణపాలు దింపుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘోరాలు-నేరాలు అనేకం మన చుట్టూ ఉన్న సమాజంలో జరుతున్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాద్‌లో తన తల్లినే చంపేశాడు ఓ కసాయి కొడుకు.

హైదరాబాద్‌ ఎస్‌‌ఆర్‌నగర్‌ పరిధిలో బుధవారం అర్థరాత్రి ఓ హత్య జరిగింది. ఎల్లారెడ్డిగూడ కేవీఆర్‌ ఎన్‌క్లీవ్‌ అపార్ట్‌మెంట్‌లో గుంటి శ్రీనివాస్‌ యాదవ్‌, మమత దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాస్‌ ఇంటి అద్దెలు వసూలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు మమత చిట్టీల వ్యాపారం చేసేది. వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల పాలైంది. చిట్టీ కట్టిన వారు డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తుండటంతో గతంలో ఆమె ఓ సారి ఆత్మహత్యాయత్నాకి పాల్పడింది.

ఈ విషయమై మదన్‌ తల్లితో తరచూ గొడవ పడుతుండేవాడు. దీంతో మనస్తాపం చెందిన మమత 15 రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా కొత్తపేటలో ఉంటున్న తన సోదరుడు రమేష్‌ ఇంటికి వెళ్లింది. రమేష్‌ బుధవారం రాత్రి ఆమెను తీసుకువచ్చి ఎల్లారెడ్డిగూడలో వదిలి వెళ్లాడు. మమత వచ్చి రాగానే మదన్, శ్రీనివాస్‌ ఆమెతో గొడవకు దిగారు. రాత్రి 11.30 సమయంలో మాధవ్‌ తల్లిని అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌ పైకి లాక్కెళ్లి ఆమె తలపై కర్రతో మోది గొంతునులిమి హత్య చేశాడు. కిందకు వచ్చి అమ్మను చంపేశానని తండ్రి శ్రీనివాస్‌ యాదవ్‌కు తెలిపాడు. అయితే భర్త శ్రీనివాస్‌, కుమారుడు మదన్‌ తన కుమార్తెను హత్య చేశారండూ మమత తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో భర్త, కుమారుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంతానం కోసం కోటి పూజలు చేశాడు ఆ తండ్రి. కొడుకు పుడితే పున్నామ నరకం నుండి రక్షిస్తాడని అనుకున్నాడు. కానీ ఎంత వేచిచూసినా పిల్లలు లేకపోవడంతో బంధుల్లో ఓ యువకుడిని దత్తత తీసుకున్నాడు. పెంపుడు కొడుకుని సర్వస్వంగా భావించి ఉన్నత చదువులు చదివించారు. కానీ ఆ రాక్షస కొడుకు మాత్రం ఆస్తిపై కన్నేసి మృగంలా మారాడు.

నేటి సమాజంలో మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా ఉందా అన్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. మనుషులు నరరూప రాక్షసుల్లా మారి పేగు బంధంపై కూడా పగబడుతున్నారు. మమతాను రాగాలను మరచి పాశవికంగా తల్లిదండ్రులపై దాడులు జరుపుతున్నారు. ఇదంతా కేవలం డబ్బుల కోసమే, ఆస్తుల కోసమే.

ఆదిలాబాద్‌‌లో ఇటీవల ఎల్‌ఐసీ ఉద్యోగి గోవర్థన్‌ హత్యకు గురయ్యాడు. టీచర్‌ కాలనీలో నివాసముంటున్న గోవర్థన్‌కు సంతానం లేరు. ఈ క్రమంలో నితిన్‌ అనే కుర్రవాడిని దత్తత తీసుకుని సొంత కొడుకులా పెంచుకున్నాడు. అయితే కొంతకాలంగా దత్తపుత్రుడు నితిన్‌ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో తల్లిదండ్రులు, నితిన్‌కి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. చివరికి ఆస్తిని రాసివ్వాలని నితిన్‌ తల్లిదండ్రులను వేధించాడు. కానీ గోవర్థన్‌ మాత్రం దాన్ని తిరస్కరించాడు. అంతే తండ్రిపై పగ పెంచుకున్న దత్తపుత్రుడు తండ్రిని అంతమొందించాడు.

తండ్రి గోవర్థన్‌ ఆస్తికి అడ్డుపడుతున్నాడని వ్యూహాన్ని రచించాడు నితిన్‌. ఈ ప్రక్రియలో భాగంగా కిరాయి హంతకులతో రెండు లక్షల పదివేల రూపాయలతో ఒప్పందం చేసుకున్నాడు. పథకం ప్రకారం గోవర్థన్‌ను వైరుతో హతమార్చారు ఆరుగురు హంతకులు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించారు. సంతానం లేదని దత్తత తీసుకుని మరీ కొడుకును పెంచుకుంటే, యముడిలా తన భర్తను హతమార్చాడాని గోవర్థన్‌ భార్య కన్నీరుమున్నీరవుతుంది. పెంచి పెద్దచేసినందుకు ఇంతడి దారుణానికి ఒడిగడతాడని కలలో కూడా ఊహించలేదని గుండెలు అవిసేలా రోదిస్తున్నారు కుటుంబసభ్యులు.

డబ్బు వ్యామోహంలో మానవ సంబంధాలను మర్చిపోతున్నారు. అన్నిటికంటే అత్యంత బాధాకరం, మనిషిని మనిషిగా చూడలేకపోతున్న అంశం ఆస్థులు కోసం, డబ్బుల కోసం పిల్లలు కన్నవారిని కాటికి పంపించడం. తాము కొవ్వొత్తిలా కరిగిపోతూ, బిడ్డలకు బంగారు భవిష్యత్తునిచ్చే తల్లిదండ్రుల అంతు చూడాలనుకోవడం కట్లపాములా కాటేస్తున్న డబ్బుకి ఇచ్చే విలువ పిల్లలు బంధాలకి ఇవ్వలేకపోవడం ఈ దారుణాలన్నీ చూస్తుంటే సమసమాజంలో మానవత్వం ఉన్నదా అన్న ప్రశ్న తలెత్తుతోంది..? మానవత్వమా నీవెక్కడ అని ప్రశ్నించాల్సి వస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories