ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన తొలిదశ ఎన్నికల పోలింగ్‌

ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన తొలిదశ ఎన్నికల పోలింగ్‌
x
Highlights

ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 18 నియోజకవర్గాల్లో ఉదయం నుంచి ఓటింగ్ కొనసాగుతోంది. మావోయిస్టులకు కంచుకోట అయిన 8 జిల్లాల్లోని 18...

ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 18 నియోజకవర్గాల్లో ఉదయం నుంచి ఓటింగ్ కొనసాగుతోంది. మావోయిస్టులకు కంచుకోట అయిన 8 జిల్లాల్లోని 18 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల కోసం.. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 10 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. మిగతా 8 స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. దాదాపు 32 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.

తొలిదశ పోలింగ్ దృష్ట్యా ఛత్తీస్‌గఢ్‌ లోని 18 నియోజకవర్గాలు శత్రుదుర్భేద్యంగా మారాయి. పోలింగ్‌ను బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపు నిచ్చిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలను కలిపి లక్ష మందిని మోహరించారు. 650 కంపెనీలకు చెందిన 65 వేల భద్రతా సిబ్బందితో పాటు CRPF, BSF, ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసులతో పాటు ఇతర దళాలకు చెందిన భద్రతా బలగాలను మోహరించారు.

మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో 10 నియోజక వర్గాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ 10 నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో భద్రతను రెట్టింపు చేశారు. ఎన్నికల్లో తొలిసారి డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఓవైపు మావోయిస్టుల హెచ్చరికలు మరోవైపు పోలీసుల బూట్ల చప్పుడు నడుమ ఛత్తీస్‌గఢ్‌ 18 నియోజకవర్గాల్లో ఇవాళ జరుగుతున్న తొలిదశ పోలింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్ శాతంపై రాజకీయ పార్టీలు టెన్షన్ పడుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో పాల్గొనవద్దని మావోయిస్టులు ప్రతిసారి హెచ్చరికలు చేస్తూనే ఉన్నా ఆయా ప్రాంతాల్లో ప్రతిసారి పోలింగ్‌ శాతం పెరుగుతూ వస్తోంది. 2008లో 67.14 శాతం ఓటింగ్ నమోదవ్వగా..2013లో రికార్డు స్థాయిలో 75.93 శాతం ఓటింగ్‌ నమోదైంది. సీఎం రమణ్‌సింగ్, వాజ్‌పేయి అన్నకూతురు కరుణ శుక్లా సహా 190 మంది ఇవాల్టి ఓటింగ్‌‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండో దశలో నవంబరు 20న ఛత్తీస్‌గఢ్‌లో 72 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories