ఆ రైతుకొచ్చిన కరెంట్ బిల్లు రూ.76.73 కోట్లు!

Submitted by lakshman on Mon, 09/25/2017 - 21:45

రాయ్‌పూర్: అతనో సాధారణ రైతు. ఎప్పటిలానే ఆ రైతు ఇంటికి కరెంట్ బిల్లు వచ్చింది. ఆ కరెంట్ బిల్లుపై ఉన్న ఫిగర్ చూసి రైతుకు మూర్ఛ వచ్చినంత పనైంది. వేలల్లో, లక్షల్లో కాదు కోట్లలో వచ్చిన ఆ బిల్లు చూసి ఆ రైతు కుటుంబం అవాక్కైంది. సెప్టెంబర్‌లో గృహావసరాలకు కరెంట్ వినియోగించినందుకు గానూ రూ.76 కోట్లు కట్టాలనేది ఆ బిల్లు సారాంశం. రెక్కలుముక్కలు చేసుకుని రేయింబవళ్లు కష్టపడ్డా ఆ బిల్లును తన జీవిత కాలంలో తీర్చలేనని బాధిత రైతు రామ్ ప్రసాద్ వాపోయాడు. ఈ విషయమై రామ్ ప్రసాద్ విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాడు. కరెంట్ బిల్లు చూసిన అధికారులకు అసలు విషయం అర్థమైంది. సిబ్బంది నిర్లక్ష్యమే బిల్లు ఇంత భారీ మొత్తంలో రావడానికి కారణంగా తేల్చారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారి తెలిపారు. ఆ రైతుకు వాస్తవంగా 1820 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది.

సాంకేతిక లోపం కారణంగా తప్పుగా బిల్లు వెళ్లిందని, సిబ్బంది చూసుకోకుండా అందించడమే ఈ వ్యవహారం మొత్తానికి కారణంగా అధికారులు స్పష్టం చేశారు. ఆగస్ట్ 4న రాంప్రసాద్ మీటర్‌ను మార్చారని, తప్పుగా చూపించిన రీడింగ్‌ను రాసుకుని, దానికి తగ్గట్టుగా బిల్లు తయారుచేయడంతో ఈ తప్పిదం జరిగిందని తేలింది. ఈ వ్యవహారంపై స్థానిక రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. వారి నిర్లక్ష్యంతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మహసమండ్ జిల్లాలో చాలామంది రైతులకు ఇలాంటి తప్పుడు బిల్లులే అందాయని, క్లర్కుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అని రైతు సంఘ నేతలు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, విద్యుత్ శాఖలో పనిచేసే క్లర్కులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇవాళ కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న సందర్భాలున్నాయి.

English Title
Chhattisgarh farmer gets electricity bill of Rs 76.73 crore for one month

MORE FROM AUTHOR

RELATED ARTICLES