ఛత్తీస్ గఢ్ లో కింగ్ మేకర్ ఏవరు.? ఎగ్జిట్ పోల్స్ ఎం చెబుతున్నాయ్..?

Submitted by chandram on Fri, 12/07/2018 - 21:14
chattisgarh

నువ్వా, నేనా అనే రీతిలో సాగిన ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో  కింగ్ మేకర్ గా అజిత్ జోగీ అవతరిస్తారన్నది జాతీయ ఛానెళ్ల ఎగ్జిట్ పోల్ సర్వే సారంశం. అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ హోరా హోరీగా తలపడిన ఈ ఎన్నికల్లో  ఇద్దరికీ బరాబరి సీట్లు వస్తాయన్నది ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనా. వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన రమణ్ సింగ్ ఈసారి మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొనక తప్పదంటున్నాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు రమణ్ సింగ్  ప్రభుత్వంపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ కు వరంగా మారే అవకాశాలున్నాయన్న సంకేతాలిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. అసలే నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడం కొన్ని మౌలిక వసతుల కల్పనలో రమణ్ సింగ్ విఫలమయ్యారన్న విమర్శలూ బిజెపి గెలుపు అవకాశాలను దెబ్బతీసే ఆస్కారముందంటున్నాయి సర్వేలు.

మొత్తం 90 స్థానాలున్న ఛత్తీస్ గఢ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఈసారి 55 నుంచి65 సీట్లు గెలవొచ్చని, బిజెపికి21నుంచి 31 సీట్లు వచ్చే ఆస్కారముందన్నది ఇండియాటుడే ఎగ్జిట్ పోల్ సర్వే సారాంశం. ఇక కాంగ్రెస్ నుంచి విడిపోయి ఛత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ పార్టీ పెట్టిన మాజీ సీఎం అజిత్ జోగీ,బీఎస్పీ కలసి 4 నుంచి8 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. ఇక టైమ్స్ నౌ పోల్ సర్వే కాంగ్రెస్ కు 35 సీట్లు , బిజెపికి46, బీఎస్పీ, అజిత్ జోగీ కూటమికి 7 సీట్లు, ఇతరులకు రెండు సీట్లు వస్తాయని సూచిస్తోంది. ఇండియా టీవీ సర్వే మాత్రం బిజెపికి 42 నుంచి 50 సీట్లు వచ్చే అవకాశముందని, కాంగ్రెస్ కు32 నుంచి 38 సీట్లు వస్తాయని తేల్చింది. అజిత్ జోగీ, మాయా కూటమికి 6 నుంచి 8 ఇతరులకు ఒకటినుంచి మూడు స్థానాలూ గెలుచుకునే అవకాశాలున్నాయని చెబుతోంది. రిపబ్లిక్ సీ ఓటర్ సర్వే బిజెపికి35నుంచి43, కాంగ్రెస్ కు 40-50, బీఎస్పీ ఇతరులకు 3-7 మధ్య సీట్లు వస్తాయని తేల్చింది. ఇండిపెండెంట్లు ఎవరూ గెలవరని ఈ సర్వే సూచిస్తోంది.

దాదాపు అన్ని ఛానెళ్లు ఛత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ పార్టీ పెట్టిన అజిత్ జోగీ, బీఎస్పీ పార్టీల కూటమికి దాదాపు 6 నుంచి 7 సీట్లు వస్తాయని తేల్చడంతో ఛత్తీస్ గఢ్ కొత్త ప్రభుత్వ ఏర్పాటులో  కింగ్ మేకర్ గా  జోగీ అవతరించబోతున్నారని తేలింది. జోగీ కూటమి ఏ పార్టీవైపు  మొగ్గితే ఆ పార్టీనే అధికారం వరించే అవకాశముంది. అజిత్ జోగి కాంగ్రెస్  పాత కాపే గనక ఆయన కాంగ్రెస్ వైపే మొగ్గే అవకాశాలు ఉన్నాయి. అంచనాలు నిజమే అయితే జోగీ ముఖ్యమంత్రి పదవి అడుగుతారా లేక, కీలక పదవులు చేజిక్కించుకుంటారా అన్నది ఇంకా తేలాలి.

English Title
chattisgarh exit poll survey 2018 elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES