లెక్కేసుకుందాం రా!

x
Highlights

కేంద్ర బడ్జెట్ దరిమిలా ఆంధ్రా నాయకుల్లో అనుమాన బీజాలు నాటుకున్నాయా? బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ ఆందోళనలు జరిగినా మాట్లాడని చంద్రబాబు.. తాజాగా...

కేంద్ర బడ్జెట్ దరిమిలా ఆంధ్రా నాయకుల్లో అనుమాన బీజాలు నాటుకున్నాయా? బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ ఆందోళనలు జరిగినా మాట్లాడని చంద్రబాబు.. తాజాగా నోరు మెదిపారు. కేంద్రం మిగతా రాష్ట్రాలకు ఏమిచ్చింది, ఏపీకి ఎంతిచ్చిందో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సార్వభౌమాధికారం ఉన్న ప్రభుత్వాలు ఆయా చట్టసభలకే జవాబుదారీ అవుతాయి తప్ప... వ్యక్తులకు కాదన్నారు. కొందరి డ్రామాల కారణంగా.. మళ్లీ విభజన రోజులు రిపీట్ అవుతాయా అంటూ ఆందోళన చెందడం కొసమెరుపు.

కేంద్ర బడ్జెట్ మీద ఏపీలో తలెత్తిన రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరు మెదిపారు. ఏపీకి అన్యాయం జరిగిందంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ఆందోళనల క్రమంలో చంద్రబాబు అభిప్రాయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విభజన సందర్భంగా రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని బాబు డిమాండ్ చేశారు. అన్యాయం జరిగిందని గట్టిగా నిలదీయకపోతే నష్టపోతామంటూనే.. ఆవేశం అదుపు తప్పరాదని ప్రజలకు, పార్టీలకు హితవు పలికారు. ఏపీని ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన కల అని.. అందుకోసం ఎన్ని ఇబ్బందులైనా భరిస్తానన్నారు. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి చేయూతనిచ్చి అభివృద్ధి పథంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని, ఆ తరువాత దేశాభివృద్ధికి రాష్ట్రం కృషి చేస్తుందన్నారు. కేంద్రం బాధ్యతను గుర్తు చేసిన బాబు.. బీజేపీ నేతలు చూపిన లెక్కలపైనా స్పందించడం విశేషం. ఏ రాష్ట్రానికి ఎంతిచ్చారో, ఏపీకి ఎంతిచ్చారో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

పనిలో పనిగా పార్టీ పేరు గానీ, వ్యక్తుల పేర్లు గానీ ఉచ్చరించకుండానే.. పరోక్షంగా జగన్, పవన్ కల్యాణ్, బీజేపీ లను కూడా బాబు ఉటంకించడం విశేషం. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం, కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడటం సరికాదన్న బాబు సార్వభౌమాధికారం గల రాష్ట్రమైనా, దేశమైనా లెక్కలు ఆయా చట్టసభలకే చెబుతుంది తప్ప వ్యక్తులకు కాదని తాను అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు తలెత్తిన ఆందోళనకర పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయని బాబు ఆవేదన చెందారు. అన్యాయం జరిగినప్పుడు నిరుత్సాహపడరాదని, అదే సమయంలో అదుపు తప్పితే పంజాబ్, అస్సాం రాష్ట్రాల్లో ఏం జరిగిందో గ్రహించాలని ఏపీ ప్రజలకు, నేతలకు సూచించారు.

కేంద్రం వైఖరి మీద అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న బాబు.. హోదా అంశాన్ని గానీ, ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాటాన్ని గానీ ఊసెత్తకపోవడం విశేషం. ఎన్డీయే సర్కారు ఏర్పడ్డాక అన్ని బడ్జెట్లలోనూ ప్రత్యేక కేటాయింపులేమీ జరగలేదన్న అభిప్రాయాలుండగా.. ఈ బడ్జెట్లో అన్యాయం జరిగిందని బాబు పరిమితం చేస్తూ మాట్లాడడం చర్చాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories