ఏపీలో నిజంగానే యుద్ధం మొదలైందా..టీజీ ప్రకటించిన యుద్ధానికి చంద్రబాబు సై అంటారా?

x
Highlights

ఏపీ రాజకీయాల్లో యుద్ధం మొదలైందా? ఒకవేళ ఎన్డీయే మీద యుద్ధమే జరిగితే.. దానికి నాయకత్వం ఎవరు వహిస్తారు? హోదాను పక్కనపెట్టి, ప్యాకేజీకి ఎగనామం పెట్టి...

ఏపీ రాజకీయాల్లో యుద్ధం మొదలైందా? ఒకవేళ ఎన్డీయే మీద యుద్ధమే జరిగితే.. దానికి నాయకత్వం ఎవరు వహిస్తారు? హోదాను పక్కనపెట్టి, ప్యాకేజీకి ఎగనామం పెట్టి బడ్జెట్లో మొండిచేయి చూపిన మోడీ సర్కారును దారికి తెచ్చుకోవడమే ఇప్పుడు ఏపీ నాయకుల ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది. చంద్రబాబు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం, టీడీపీ ఎంపీలు యుద్ధానికి సై అనడం చూస్తుంటే.. ఏపీ రాజకీయాల్లో తుపాను ముందరి ప్రశాంతత లాగే కనిపిస్తోంది.

ఎన్డీయేలో ముసలం పుట్టింది. ఏపీలో రాజకీయ సమరానికి కావాల్సినంత ముడిసరుకును కూడా అందించేలా తయారైంది. టీడీపీ-బీజేపీ మధ్య పెరుగుతున్న దూరం.. రేపటి రాజకీయంపై ఇప్పుడే మాట్లాడుకునేంత తీవ్రరూపం దాలుస్తోంది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రాకు.. అసలు విషయం వదిలేసి కొసరు పడేసినట్టుగా మోడీ సర్కారు ప్రవర్తించడంతో ఏపీ నాయకుల్లోనే కాదు.. యావత్ ప్రజానీకంలో కూడా అసంతృప్తి రాజుకుంటోంది. విభజనకు ముందు 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా అని కబుర్లు చెప్పిన బీజేపీ నేతలు.. ఆ తరువాత ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ బుజ్జగించారు. ఇక ఎన్నికల ముందు ప్రవేశపెట్టే ఆఖరు పూర్తి బడ్జెట్లోనూ ప్యాకేజీల ఊసే లేకపోవడంతో.. ఎన్డీయే మీద ఉన్న ఆశల మేఘాలు తొలగిపోతున్నట్టు ఫీలవుతున్నారు.. ఆంధ్రా ప్రజానీకం.

జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన కాసేపటికే ఎంపీలతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏపీకి జరిగిన కేటాయింపులపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. అయితే ఎంపీలు, కేంద్ర మంత్రుల్లో వెల్లువెత్తిన ఆగ్రహాన్ని తాత్కాలికంగా అదుపు చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఇక మరుసటి రోజు ఏపీకి జరిగిన అన్యాయంపై రాజ్యసభలో విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ.. ప్లకార్డు పట్టుకోగా.. మిగతా సభ్యులు నిరసనగా గొంతు కలిపారు. ఢిల్లీలోనే ఉన్న టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్.. ఎన్డీయే మీద వార్ మొదలైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిలదీస్తామని, చంద్రబాబును లైట్ తీసుకోరాదని కూడా హెచ్చరించారు. మూడంచెల్లో జరిగే వార్ విషయంలో తుది నిర్ణయం చంద్రబాబే తీసుకుంటారని టీజీ ప్రకటించారు.

రాజ్యసభలో రాజుకున్న ఆందోళనతో చంద్రబాబు మరోసారి ఎంపీలతో, మంత్రులతో మాట్లాడారు. ఆదివారం భేటీ అయ్యాక అన్ని విషయాలూ మాట్లాడుకుని, ఓ నిర్ణయం తీసుకుందామన్నారు. ఎన్డీయే నుంచి బయటికొస్తే ఢిల్లీలో ఇక ప్రశ్నించేవారెవరు అంటూ వ్యాఖ్యానించడం గమనార్హంగా పేర్కొంటున్నారు విశ్లేషకులు. అటు ఆంధ్రా పీసీసీ చీఫ్ రఘువీరా.. ఏపీకి జరిగిన అన్యాయంపై ఎంపీలందరూ రాజీనామా చేయాలన్నారు.

కేంద్ర బడ్జెట్‌పై ఏపీ మంత్రులు మండిపడుతుంటే.. రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు అద్భుతంగా ఉందన్నారు. ఏపీ అభివృద్ధి కోసం ఎన్డీయే ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటుందన్నారు. కొంతమంది టీడీపీ నేతలు అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. టీడీపీ, బీజేపీ మైత్రి కొనసాగుతుందని చెప్పారు.

కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన కేటాయింపులపై వివిధ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో కేంద్ర పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మిత్రపక్షమైన టీడీపీ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? కాంగ్రెస్, వైసీపీల రియాక్షన్ ఎలా ఉంటుంది? అనే అంశాలే ఏపీలో రేపటి రాజకీయాలను మలుపు తిప్పే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories