ముగిసిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

Submitted by arun on Fri, 03/02/2018 - 16:42
Amaravati

అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విభజన హామీల సాధన డిమాండ్‌తో పార్లమెంటును స్తంభింపచేయాలని నిర్ణయించారు. విభజన హామీలు అమలయ్యే వరకు ఆందోళన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. పోరు ఉధృతం చేయాలని నిర్ణయించారు. పైగ పార్లమెంటులో దశల వారీగా పోరు ముమ్మరం చేయాలని ఇందుకు ఇతర పార్టీల సాయం తీసుకోవాలని కూడా నిర్ణయించినట్లు ఎంపీ కొనకళ్ళ నారాయణ చెప్పారు. ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. అటు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటామని ఎంపీ కేశినేని నాని తెలిపారు.  

సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాల నేపధ్యంలో చంద్రబాబు అమరావతిలోని తన నివాసంలో టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో విభజన హామీల సాధన, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూ‍హం చర్చించారు. నాలుగేళ్లయినా విభజన గాయాలు మానలేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడగొట్టి కాంగ్రెస్ అన్యాయం చేస్తే దానిని సరి చేయాల్సిన బీజేపీ కూడా అన్యాయంగా వ్యవహరిస్తోందంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా వద్దని ఎప్పుడూ చెప్పలేదన్న ముఖ్యమంత్రి హోదాకు సమానంగా ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చినందు వల్లే ప్యాకేజీకి అంగీకరించామని అన్నారు. ఇక ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఉండదని చెప్పిన కేంద్రం ఇప్పుడు కొనసాగించాలని అనుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్‌కు అదే పేరుతో ఇవ్వాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. 

టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో చంద్రబాబు ఒక్కో ఎంపీ నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఏపీ ప్రయోజనాల కోసం జాతీయస్థాయి పోరాటానికి సిద్ధం కావాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో నిర్ణయించారు. దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రంలోని అన్ని పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయించారు. విభజనచట్టం హామీలు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు హోదా-ప్యాకేజీ మతలబును లేఖలో వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌పై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీకి విశ్వసనీయత లేదన్న చంద్రబాబు ఆ పార్టీ నాటకాలు ఆడుతోందని విమర్శించారు.

English Title
TDP Parliamentary Party Meet Ends

MORE FROM AUTHOR

RELATED ARTICLES