తెలంగాణ తమ్ముళ్లకు చంద్రబాబు షాక్

తెలంగాణ తమ్ముళ్లకు చంద్రబాబు షాక్
x
Highlights

తెలంగాణ తమ్ముళ్లకు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఏపీలో ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ ఉన్నందువల్ల తెలంగాణ పార్టీకి...

తెలంగాణ తమ్ముళ్లకు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఏపీలో ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ ఉన్నందువల్ల తెలంగాణ పార్టీకి సమయం వెచ్చించలేనని స్పష్టం చేసారు. ఇకపై ఇక్కడ పార్టీని మీరే బలోపేతం చేయాలని చెప్పారు. విభేదాలు పక్కనపెట్టి నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీటీడీపీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న బాబు..నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. మీ దారి మీరు చూసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ నేతలకు సూచించారు. ఏపీలో ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ ఉండటంతో తెలంగాణ పార్టీ కోసం టైమివ్వలేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఆటంకాలను దాటేందుకే సమయం చాలడం లేదని.. ఇక్కడి పార్టీకి సమయం కేటాయించే పరిస్థితి లేదన్నారు. అమరావతి నుంచి హైదరాబాద్‌లో పార్టీ పనితీరు పర్యవేక్షించడం కుదరదన్నారు. ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీపై ముప్పేట దాడి జరుగుతోందని..తెలంగాణ నేతలు, కార్యకర్తలు తన పరిస్థితి అర్ధం చేసుకోవాలని కోరారు.

తెలంగాణ టీడీపీ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు పార్టీ పనితీరును సమీక్షించారు. నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. పార్టీ కార్యక్రమాలను సైతం నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. నాయకులు, కార్యకర్తల వలసలను నిరోధించడంలో విఫలమయ్యారన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు నేతలంతా కలిసి పనిచేయాలని సూచించారు. ఈ నెల 24న జరిగే తెలంగాణ మహనాడు లోపు పార్టీ కమిటీల నియామకం జరగాలన్నారు. రెండు నెలల్లో వస్తున్న పంచాయితీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

పొత్తులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ నేతలను కోరారు. ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితులను బట్టి పొత్తులు పెట్టుకుందామన్నారు. ఎన్నికలకు ఏడాది సమయమే ఉన్నందున అలసత్వాన్ని వీడాలని హితోపదేశం చేసారు. కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారనే ప్రచారానికి బలం చేకూరుస్తూ ఇరు రాష్టాల్లో ఒకే పార్టీతో పొత్తులుంటాయని సంకేతాలిచ్చారు. టికెట్ల విషయాన్ని తనకొదిలి...ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగానికి అండగా నిలవాలన్నారు.

అయితే ఇంత కాలం మీకు అండగా ఉంటాను..కేసీఆర్ ప్రభుత్వంతో పోరాడండి అంటూ చెప్పిన చంద్రబాబు ఇప్పుడు సమయం ఇవ్వలేను.. మీదారి మీరు చూసుకోవాలని కుండ బద్దలు కొట్టడంతో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు సంకటంలో పడ్డారు. అధినేతే అండగా లేనప్పుడు అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ మరింత బలహీన పడుతుందని ఆందోళన చెందుతున్నారు. బాబు తన నిర్ణయం మార్చుకోకపోతే తెలంగాణలో పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందని ఆవేదన చెందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories