12 ఏళ్లలోపు వారిని రేప్‌ చేస్తే మరణమే

12 ఏళ్లలోపు వారిని రేప్‌ చేస్తే మరణమే
x
Highlights

ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన అత్యాచారాలకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. పైగా చిన్నారులపై మృగాల్లా ప్రవర్తిస్తూ వారి జీవితాన్ని చిదిమేస్తున్నారు....

ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన అత్యాచారాలకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. పైగా చిన్నారులపై మృగాల్లా ప్రవర్తిస్తూ వారి జీవితాన్ని చిదిమేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలిక ఆసిఫాపై సామూహిక లైంగిక దాడి, ఉన్నవ్ ఘటనలో మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో.. కేంద్రంలో కదలిక వచ్చింది. దేశవ్యాప్తంగా చిన్నారులపై అఘాయిత్యాలు, దారుణ ఘటనలు పెరిగిపోతుడటంతో కఠిన చట్టాలు తెచ్చేందుకు కేంద్రం నడుం బిగించింది.

12 ఏళ్లలోపు వయసు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే మృగాలకు ఉరిశిక్ష విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు అనుగుణంగా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ చట్టానికి సవరణలు చేయబోతోంది. ఆర్డినెన్స్‌ స్థానే తేబోయే చట్టాన్ని పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. సుప్రీం కోర్టుకు కేంద్రం సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది. అలఖ్ అలోక్ శ్రీవాస్తవ అనే న్యాయవాది వేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, డీవై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేసింది.

కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య ఉదంతాలపై స్పందించిన కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ... చిన్నారులపై అత్యాచారాలు చేసేవారికి మరణశిక్ష చట్టాన్ని తీసుకురావాలని ప్రతిపాదించారు. దీనికి దేశవ్యాప్తంగా మద్దతు లభించడంతో కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేసే పనిలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories