అమెరికాలోనూ అంటరానితనం

Submitted by arun on Sat, 03/24/2018 - 11:02
discrimination

అంటరానితనం, కులవివక్షత, తక్కువ చేసిమాట్లాడటం...వంటి సామాజిక దుర్లక్షణాలు అమెరికాలో సైతం విస్తరిస్తున్నాయి. దక్షిణాసియా దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన తోటి భారతీయుల నుంచే దళితులు, ఆదివాసీలు...తీవ్రమైన కుల వివక్షను ఎదుర్కొంటున్నారు. వివాహాలు చేసుకోవాలంటే, దేవాలయాలకు వెళ్లాలంటే దళితులు, ఆదివాసీలు తమ కులపరమైన గుర్తింపు దాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచమంతా భావిస్తున్న అమెరికాలో సైతం కుల వివక్ష వేళ్లూనుకుంటోంది. ఈ సామాజిక దుర్లక్షణం అమెరికాలో ఏన్నో ఏళ్లుగా కొనసాగుతోందన్న విషయాన్ని 'ఈక్వాలిటీ ల్యాబ్స్‌' 2016 ఏడాది సర్వే తేల్చి చెప్పింది. 'క్యాస్ట్‌ ఇన్‌ ద యునైటెడ్‌ స్టేట్స్‌'  అనే పేరుతో నివేదికను విడుదల చేశారు. వెకిలిమాటలతో వెక్కిరించటం, భౌతికమైన, లైంగిక దాడులు మొదలైనవి అమెరికాలో స్థిరపడిన దక్షిణాసియా దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్నారు. 

అంతేకాకుండా, 'దక్షిణాసియా చరిత్ర'ను అమెరికాలోని పలు రాష్ట్రాల్లో హిందూత్వ కోణంలో చూడటం మొదలైంది. అమెరికాలో స్థిరపడ్డ దక్షిణాసియా వాసుల్లో నెలకొన్న 'అసమానత'ను ఈ అధ్యయనం గుర్తించింది. అయితే ఈ అసమానత కచ్చితంగా 'కుల వివక్ష'తో ముడిపడినదని అధ్యయనం తేల్చింది. 'నీది ఏ కులం ?' 'ఆచార వ్యవహారల్లో స్వచ్ఛత' 'తక్కువ కులం వాళ్లు' అన్నవి దక్షిణాసియాకు చెందిన అనేక సంస్థల్లో, దేవాలయాల్లో, వివాహాల్లో నాటుకుపోయాయి. ఇదే ఇక్కడి దళితులు, ఆదివాసీలపై కుల వివక్షకు దారితీసింది. 

ఈ కుల వివక్ష పోకడలు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి. బలవంతంగా తమ కుల గుర్తింపును సైతం దాచుకోవాల్సిన దుస్థితి వారికి ఏర్పడిందని ఈ నివేదిక సహ రచయితగా వ్యవహరించిన తెన్‌మోజీ సౌందర్యరాజన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 'డా.బీ.ఆర్‌.అంబేద్కర్‌' సాహిత్యంపై కేంబ్రిడ్జ్‌ వర్సిటీలో బోధిస్తున్న డా.కోర్నెల్‌ వెస్ట్‌ చేతుల మీదుగా ఈ నివేదిక తాజాగా విడుదలైంది.

English Title
Caste in the US: Dalits face discrimination in South Asian American institutions, says survey

MORE FROM AUTHOR

RELATED ARTICLES