కారు ఓట్లు ట్రక్కుకు...పలుచోట్ల టీఆర్‌ఎస్ ఓటమికి ఈ గుర్తే కారణం?

కారు ఓట్లు ట్రక్కుకు...పలుచోట్ల టీఆర్‌ఎస్ ఓటమికి ఈ గుర్తే కారణం?
x
Highlights

తెలంగాణ ఎన్నికల్లో జెట్ స్పీడ్‌తో పరుగులు పెట్టిన కారుకు అనుకోని కష్టమొచ్చి పడింది. ప్రత్యర్ధులను ముచ్చెమటలు పట్టించిన కారు పార్టీకి అనుకోని స్పీడ్...

తెలంగాణ ఎన్నికల్లో జెట్ స్పీడ్‌తో పరుగులు పెట్టిన కారుకు అనుకోని కష్టమొచ్చి పడింది. ప్రత్యర్ధులను ముచ్చెమటలు పట్టించిన కారు పార్టీకి అనుకోని స్పీడ్ బ్రేకులు వచ్చి పడ్డాయి. కారు రూపంలో ఉన్న మరో గుర్తు టీఆర్ఎస్‌ అభ్యర్ధుల విజయాలతో పాటు మెజార్టీలను తీవ్రంగా ప్రభావితం చేసింది. సెంచరీ అందుకోవాలని భావించిన కారు ఆశలను అడియాసలు చేసింది.

అచ్చు కారును పోలి ఉన్న గుర్తు ఇది. ఊరు పేరు లేని సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన గుర్తు ఇది. ఇప్పుడీ గుర్తే టీఆర్ఎస్ సెంచరీ ఆశలకు బ్రేకులు వేసింది. పలు చోట్లు ట్రక్కు గుర్తును టీఆర్ఎస్‌ సింబల్‌గా భావించిన గ్రామీణులు, వృద్ధులు, నిరక్షరాస్యులు ఓట్లేసినట్టు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 స్ధానాల్లో ఈ గుర్తు ప్రభావం చూపినట్టు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి వేముల వీరేశంను ట్రక్కు పరాజయం పాల్జేసింది. ఇక్కడ సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్ధికి ఏకంగా 10 వేల 383 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్ధి వేముల వీరేశం 8 వేల 259 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇక తాండూరులోని మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇదే తరహాలో పరాజయం పాలయ్యారు.

ఇక పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ట్రక్కు ధాటికి కారు పార్టీ అభ్యర్ధులు గడగడలాడారు. ధర్మపురిలో అత్యంత స్వల్ప మెజారిటితో టీఆర్ఎస్ అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్ బయటపడ్డారు. సునాయాసంగా విజయం సాధిస్తానని భావించినా అతి కష్టం మీద ఆయన గెలవాల్సి వచ్చింది. ఇక్కడ ట్రక్కు గుర్తుతో పోటీ చేసిన కుంటాల నర్సయ్యకు ఏకంగా 13 వేల 114 ఓట్లు వచ్చి పడ్డాయి. ఇక మానకొండురు నియోజకవర్గంలోను ఇదే పరిస్దితి. కాంగ్రెస్‌పై 31వేల మెజారిటితో ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్ది రసమయి బాలకిషన్ గెలిచారు. అయితే ఇక్కడ కూడా కారును పోలి ఉన్న ట్రక్కు గుర్తుకు 13వేల ఓట్ల పైచిలుకు వచ్చి పడ్డాయి.

పెద్దపల్లి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్దితి. భారీ మెజార్టీ వస్తుందని భావించిన చోట ఎనిమిది వేలతో సరిపడి పెట్టుకోవాల్సి వచ్చింది. కరీంనగర్, కోరుట్లలలో కూడా అభ్యర్ధుల మెజార్టీని ట్రక్కు ప్రభావితం చేసింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓటమిపాలైన మంథనిలో కూడా ట్రక్కు మాయజాలం పని చేసింది. ఇక్కడ ట్రక్కు గుర్తుకు 5 వేల 457 ఓట్లు రావడంతో గెలవాల్సిన చోట టీఆర్ఎస్ ఓటమి పాలయ్యింది. మెజార్టీ, ఓటమి లెక్క లేసుకున్న టీఆర్ఎస్ ట్రక్కు వల్ల తమకు ఆరు స్ధానాల్లో విజయావకాశాలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. కారు గుర్తు కిందే ట్రక్కు ఉన్న చోట అధికంగా నష్టపోయినట్టు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories