భావి భారతం... భవిష్యత్‌ పాఠం... ఉపఎన్నికలు ఏం చెబుతున్నాయి?

భావి భారతం... భవిష్యత్‌ పాఠం... ఉపఎన్నికలు ఏం చెబుతున్నాయి?
x
Highlights

నిజమే... దేశ రాజకీయాలను నరేంద్ర మోడీ మలుపు తిప్పారు. అంతకన్నా ముఖ్యంగా బీజేపీని దేశరాజకీయాల్లో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళారు. 2014 ఎన్నికల్లో ఆ...

నిజమే... దేశ రాజకీయాలను నరేంద్ర మోడీ మలుపు తిప్పారు. అంతకన్నా ముఖ్యంగా బీజేపీని దేశరాజకీయాల్లో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి ఘన విజయాన్ని అందించారు. మోడీ - అమిత్ షా జోడీ వ్యూహాలకు తిరుగులేదని చాటారు. కానీ... ఆ తరువాతనే పరిస్థితి మారింది. నాటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన అనేక ఉప ఎన్నికల్లో మరీ ముఖ్యంగా లోక్ సభ స్థానాలకు జరిగిన వాటిలో బీజేపీ పరాజయం పాలైంది. ఒక పార్టీ అధికారం చేపట్టిన తరువాత వివిధ కారణాలతో ఆ పార్టీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత చోటు చేసుకోవడం సహజమే. బీజేపీ విషయానికి వస్తే పెద్ద నోట్ల రద్దు వంటి చర్యలు మధ్యతరగతి ప్రజానీకాన్ని బాగా ఇబ్బంది పెట్టాయి. నిజానికి ఆ చర్యను సాధారణ ప్రజానీకం హర్షించారు. ప్రజల నమ్మకం వమ్ము కాకుండా తగు చర్యలు తీసుకోవడంలో మాత్రం ప్రభుత్వం వైఫల్యం చెందింది.

జాగా పెట్రోలు, డీజిల్ రేట్ల పెంపు కూడా ఈ ఉప ఎన్నికల్లో ప్రభావం చూపించి ఉండవచ్చు. పెట్రోలు రేట్ల తగ్గింపు పై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలు తప్పు పట్టి ఉండవచ్చు. అయితే వివిధ ఉప ఎన్నికల్లో బీజేపీ వరుస పరాజయాలకు ఇలాంటివి మాత్రమే కారణం కాదు. బీజేపీ అధికారం లోకి వచ్చిన తరువాత మరీ ముఖ్యంగా గత రెండేళ్ళ నుంచి కూడా బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కటవడం అధికమైపోయింది. విపక్షాలు గనుక విడివిడిగా రంగంలో ఉంటే బహుశా బీజేపీ ఇన్ని పరాజయాల భారం తప్పించుకొని ఉండేది. ఇక ఇప్పుడు బీజేపీతో పాటుగా అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న లు కొన్ని ఉన్నాయి. ఈ పరాజయాలకు ఎవరు బాధ్యత వహిస్తారు ? మోడీ-అమిత్ షా వ్యూహాలు ఎందుకు విఫలమయ్యాయి ? పార్టీలో ఇప్పటికిప్పుడు ఈ రెండు ప్రశ్నలను లేవనెత్తే ధైర్యం ఎవరూ చేయనప్పటికీ.... అవకాశం వస్తే పాత తరం అనుచరవర్గం సమీప భవిష్యత్తులో ఈ ప్రశ్నలను లేవనెత్తేందుకు సిద్ధంగా ఉంది. అలాంటిదే జరిగితే పరివార్ రంగంలోకి ఏదో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. సంస్థాగతంగా బలహీనంగా ఉన్న ప్రాంతాలతో పాటుగా బలంగా ఉన్న ప్రాంతాల్లో సైతం ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఎదుర్కొంటోంది. ఏదేమైనప్పటికీ, పరిస్థితులు ఇలానే కొనసాగితే మాత్రం గతంలో సాధించినన్ని సీట్లను బీజేపీ గెలవలేదోమోనన్న అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా ఉప ఎన్నికలను పెద్దగా సీరియస్ గా తీసుకోరు. తాజా ఉప ఎన్నికలు మాత్రం అలాంటివి కావు. నాలుగు లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలతో పాటుగా పది రాష్ర్టాల్లో కూడా 11 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. అంటే సుమారు 60 శాతం దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఉప ఎన్నికలు. అందుకే ఈ ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను చూస్తే.... మొత్తం నాలుగు లోక్ సభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలు. ఈ మూడింటిలోనూ ఒక్క స్థానాన్ని మాత్రమే బీజేపీ నిబెట్టుకోగలిగింది. అంటే మొత్తం మీద చూస్తే నాలుగు స్థానాలకు గాను ఒక్క చోట మాత్రమే బీజేపీ విజయం సాధించింది. మరో వైపున వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకు గాను పది స్థానాల్లో విపక్షాలు గెలిచాయి. ఒక్క చోట మాత్రమే బీజేపీ విజయం సాధించింది. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ మొత్తం 23 లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే అందులో నాలుగింటిలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది.

అధికారపక్షం బలం తమ అంచనాలకు మించి పెరిగినప్పుడు దాన్ని తగ్గించేందుకు లేదా కనీసం తటస్థీకరించేందుకు విపక్షాల మధ్య ఐక్యత ఏర్పడడం సహజమే. అయితే, దేశ రాజకీయాల్లో ఈ విధమైన ఐక్యత ఏర్పడిన సందర్భాలు అరుదుగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా సాధారణ ఎన్నికల సమయంలో. గతంలో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, ఆ తరువాత నేషనల్ ఫ్రంట్ ప్రయోగం జరిగినప్పుడు మాత్రమే అది సాధ్యమైంది. ఆ రెండు ప్రయోగాలు కూడా విఫలమయ్యాయి. అలాంటి ఐక్యత తిరిగి 2019 ఎన్నికల నాటికి వచ్చే అవకాశాలు కూడా తక్కువగానే కనిపిస్తున్నాయి. అందుకు కారణం బీజేపీ, కాంగ్రెస్ కూటములకు దీటుగా థర్డ్ ఫ్రంట్ ను ముందుకు తెచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అవి గనుక నిజమైతే విపక్షాల ఓట్లు బలంగా చీలిపోయే అవకాశం ఉంటుంది. థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ఇప్పుడు ప్రారంభస్థాయి లోనే ఉన్నప్పటికీ మునుముందు దాన్ని నిజం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో విపక్ష నాయకుల వ్యక్తిగత ఇగోల నేపథ్యంలో అది ఏర్పడకపోయేందుకు కూడా అవకాశాలు బలంగానే ఉన్నాయి. జాతీయ స్థాయిలో కాకుండా రాష్ట్రాల స్థాయిలోనే వివిధ పార్టీల మధ్య పొత్తులు కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వామపక్షాలు ఇప్పటికే ఈ తరహా సంకేతాలను అందిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories