ఉరకలేస్తున్న యువకెరటం.. పాగా పైలట్‌కే? యువనేతకు రాజస్థాన్‌ ఎన్నికల సారథ్యం

Submitted by chandram on Sun, 12/02/2018 - 15:34
sachin

నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో తుదిఘట్టంగా జరుగనున్న రాజస్థాన్ ఎన్నికల్లోయువనేత సచిన్ పైలట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారం చేజిక్కించుకోడానికి ఉరకలేస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కే పరిస్థితి అనుకూలంగా ఉందంటూ పలు సర్వేలు చెబుతున్నాయి. దీంతో హస్తం పార్టీ సరికొత్త ఉత్సాహంతో కమలనాథులకు సవాలు విసురుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకోడానికి తన విజయాలకు మెట్లుగా చేసుకోడానికి కాంగ్రెస్ పార్టీ యువనేత సచిన్ పైలట్ కు తమ పార్టీ ప్రచారబాధ్యతలను అప్పగించింది.

వసుంధర రాజే సింధియా నాయకత్వంలోని బీజెపీ ప్రభుత్వం పనితీరు పట్ల రాజస్థాన్ ప్రజలు అసంతృప్తితో ఉన్న సమయంలోనే యువనేత సచిన్ పైలట్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టడంతోనే హస్తం పార్టీ దశతిరిగింది. కేంద్ర మాజీ మంత్రి రాజేశ్ పైలట్ కుమారుడు, జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అల్లుడు గా గుర్తింపు ఉన్న సచిన్ పైలట్ చదువులోనే మిన్నగానే గుర్తింపు తెచ్చుకొన్నారు. జర్నలిస్టుగా, జనరల్ మోటార్స్ సంస్థ ఉద్యోగిగా, భారత టెరిటోరియల్ ఆర్మీలో అధికారిగా కూడా సచిన్ పైలట్ కు మంచిరికార్డే ఉంది. రాజస్థాన్ లో ప్రస్తుతం ప్రజాకర్షక నేతగా గుర్తింపు తెచ్చుకొన్న సచిన్ పైలట్ ముఖ్యమంత్రి రేస్ లో సీనియర్ నేత, రెండుసార్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ తో పోటీపడుతున్నారు.

రాజస్థాన్ లో ఇటీవలే ముగిసిన లోక్ సభ, శాసనసభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించడంలోసచిన్ పైలట్ ప్రధానపాత్ర వహించారు. బీజెపీ ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడే ఎండగడుతూ..
సచిన్ విమర్శల వర్షం కురిపించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను మరింతగా పెంచగలిగారు. రాజస్థాన్ రాజకీయ చరిత్రను ఓసారి తిరగేస్తే ప్రతి ఐదేళ్లకు ఓసారి ప్రభుత్వాలను మార్చడం అక్కడి ఓటర్లకు ఓ అలవాటుగా ఉంటూ వస్తోంది. ఈసారి అధికారం వంతు కాంగ్రెస్ పార్టీదేనని భావిస్తున్నారు. పైగా సర్వే ఫలితాలు సైతం కాంగ్రెస్ కే అనుకూలంగా వస్తున్నాయి. ఏదిఏమైనా అదృష్టం కలసి వస్తే కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల విరామం తర్వాత అధికారం చేపట్టడమే కాదు సచిన్ పైలట్ లాంటి యువనేతను ముఖ్యమంత్రి పదవి వరించినా ఆశ్చర్యం లేదు. భారత రాజకీయాలలో ఏదైనా సాధ్యమేనని ప్రత్యేకంగా చెప్పాలా మరి.
 

English Title
BJP VS Congress Speed Up Elections Campaign At Rajasthan

MORE FROM AUTHOR

RELATED ARTICLES