పడిలేచే బంధం.. ఇప్పుడు చతికిలబడిందేమిటి?

పడిలేచే బంధం.. ఇప్పుడు చతికిలబడిందేమిటి?
x
Highlights

భారతీయ జనతా పార్టీ-తెలుగుదేశంల బంధం మొదటి నుంచి పడుతూ లేస్తూనే ఉంది. 1996లో వాజ్‌పేయి సర్కారును నిలబెట్టారు చంద్రబాబు. ఎన్డీయే కన్వీనర్‌గా...

భారతీయ జనతా పార్టీ-తెలుగుదేశంల బంధం మొదటి నుంచి పడుతూ లేస్తూనే ఉంది. 1996లో వాజ్‌పేయి సర్కారును నిలబెట్టారు చంద్రబాబు. ఎన్డీయే కన్వీనర్‌గా చక్రంతిప్పారు. కానీ 2004 ఎన్నికలకు ముందు, బీజేపీ మీద రకరకాల ఆరోపణలు చేస్తూ, బయటకు వచ్చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో మళ్లీ జట్టుకట్టారు చంద్రబాబు. మోడీతో కలిసి, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బాబు కేబినెట్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు, మోడీ మంత్రివర్గంలో ఇద్దరు టీడీపీ ఎంపీలు మంత్రి పదవులు పొందారు. కానీ మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం చేశారంటూ, మోడీతో చంద్రబాబు గిల్లికజ్జాలు మొదలయ్యాయి. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, రాజధానికి నిధులు, ఇలా అనేక విభజన హామీలకు మోడీ తిలోదకాలిచ్చాడని ఆరోపిస్తూ, మంత్రివర్గం నుంచే కాదు, ఎన్డీయే నుంచీ బయటకు వచ్చారు. నాటి నుంచి మొదలైంది, బీజేపీ, టీడీపీ ప్రత్యక్ష యుద్ధం.

నిధులు ఇవ్వడంలేదని టీడీపీ ఆరోపిస్తుంటే, ఇప్పటికే అనేకం ఇచ్చామని, కానీ చంద్రబాబు ప్రభుత్వం అబద్దలాడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. పోలవరంతో పాటు అనేక పనుల్లో అవినీతి జరిగిందని కూడా కాషాయ పార్టీ వేలెత్తుతోంది. పనిలో పనిగా ఓటుకు నోటు కుంభకోణాన్ని అప్పుడప్పుడు కదుపుతోంది. తాజాగా, ఏపీ మంత్రి భూమా అఖిలప్రియను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, దుర్మార్గాలపై ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వం ఖర్చుతో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడం దారుణమన్నారు కన్నా.

అటు చంద్రబాబు కూడా బీజేపీపై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ది పరుగులు పెట్టకపోవడానికి, రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం, ఇతర ప్రాజెక్టుల్లో వేగంలేకపోవడానికి కారణం, బీజేపీ ప్రభుత్వమేనని చంద్రబాబు తరచూ విమర్శిస్తున్నారు. ప్రజల ఎదుట బీజేపీని విలన్‌గా చిత్రీకరిస్తున్నారు. వైసీపీ, జనసేనలను బీజేపీ ఆడిస్తోందని, నిత్యం విమర్శిస్తూ, కాషాయ పార్టీ మీద యుద్ధం తీవ్రతరం చేశారు చంద్రబాబు. అటు మోడీ, అమిత్‌షాలు జీవీఎల్‌ నరసింహారావు, మాధవ్‌ను రంగంలోకి దించి, చంద్రబాబు సర్కారుపై విమర్శలు కురిపిస్తున్నారు. మొన్న శ్రీవారి ఆభరణాల మాయం, తాజాగా ఎయిర్‌ ఏషియా ముడుపుల బాగోతంలో బాబు, అశోక్‌లున్నారని ఎత్తిచూపుతోంది బీజేపీ. మలేషియా ఎయిర్‌లైన్స్‌ కంపెనీ ఈ రాయబేరాల కోసం ఒక సింగపూర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం మరింత అనుమానాలకు తావిస్తోందని కూడా వ్యాఖ్యానిస్తోంది. సీబీఐ ఎంక్వయిరీ వేగంగా సాగుతోందని, దోషులెవరైనా తప్పించుకోలేరని చంద్రబాబు లక్ష్యంగా ఆరోపిస్తోంది బీజేపీ. అటు విభజన హామీలు నెరవేర్చడంలేదని ఒకవైపు విమర్శిస్తున్న తెలుగుదేశం, నెలలో ఎన్డీయే ప్రభుత్వానికి సంబంధించిన స్కామ్‌లు బయటపెడతామని, మోడీ టార్గెట్‌గా చెలరేగిపోతోంది.

మొత్తానికి విడాకుల తర్వాత, పరస్పర విమర్శలు, ఆరోపణలు సంధించుకుంటున్న బీజేపీ, తెలుగుదేశం పార్టీలు, ఎయిర్‌ ఏషియా కుంభకోణం కేంద్రంగా కరప్షన్‌ ఛాలెంజ్‌లు విసురుకుంటున్నాయి. నిజంగా ఈ స్కామ్‌లను నిరూపిస్తారా? ఆరోపణలకు ఆధారాలు చూపుతారా? కేవలం నిందించుకోవడం వరకే పరిమితమవుతారా? కాలమే సమాధానం చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories