పాపం ధుమాల్ ఢమాల్ అయ్యాడు

Submitted by arun on Tue, 12/19/2017 - 10:59
Prem Kumar Dhumal

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో బిజేపీ మెజార్టీ సీట్లు సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఎన్నికల ముందు హిమాచల్‌ ప్రదేశ్‌లో బిజేపీ సీఎం అభ్యర్థిగా ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌‌ను ప్రకటించారు. ఆయన కూడా తానే సీఎంనంటూ ప్రచారం నిర్వహించారు. డామిట్ కథ అడ్డం తిరిగింది. తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది. 

హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లింది భారతీయ జనతా పార్టీ. వీరభద్రసింగ్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో గెలుస్తామని బీజేపీ భావించింది. ప్రధాని మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు ప్రచారం నిర్వహించారు. అనుకున్నట్లే హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ మెజార్టీ సాధించింది. ధుమాల్ సైతం విరామం లేకుండా ప్రచారం నిర్వహించి పార్టీని గెలిపించారు కానీ తాను మాత్రం ఓటమి పాలయ్యారు. 

1993లో హిమాచల్ ప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా చేపట్టిన ధుమాల్ 1998లో బమ్సన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే ఏడాది హిమాచల్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2007లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. అదే ఏడాది ఎంపీ పదవికి రాజీనామా చేసి రెండో సారి హిమాచల్ ప్రదేశ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2012లో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లోనూ గెలిచి మూడో సారి ముఖ్యమంత్రి పీఠం కూర్చోవాలని ఆశించారు ధుమాల్. 

అయితే ఓటర్లు మాత్రం ఆయన్ను ఓడించి సీఎం కూర్చీపై కూర్చోకుండా చేశారు. పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించిన ధుమాల్‌ ఓటమిని ఆయన అనుచరులే కాదు బీజేపీ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. పాపం ధుమాల్ ఢమాల్ అయ్యాడు.

English Title
BJP sweep in Himachal Pradesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES