కాషాయ వ్యూహాలేంటి?

కాషాయ వ్యూహాలేంటి?
x
Highlights

2013 త్రిపుర ఎన్నికల్లో 59 స్థానాల్లో దాదాపు 49 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది బీజేపీ. కేవలం 1.5 శాతం ఓటు షేరు మాత్రమే సాధించింది. కానీ ఇప్పుడు...

2013 త్రిపుర ఎన్నికల్లో 59 స్థానాల్లో దాదాపు 49 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది బీజేపీ. కేవలం 1.5 శాతం ఓటు షేరు మాత్రమే సాధించింది. కానీ ఇప్పుడు చరిత్రను తిరగరాసింది. ఒక ఎన్టీఆర్, ఒక కేజ్రివాల్‌ లెవల్లో అనూహ్యంగా త్రిపురలో విజయఢంకా మోగించింది. అసలు జీరో నుంచి హీరోగా కాషాయదండు ఎలా అడుగులు వేసింది నార్త్ ఈస్ట్‌లో మోడీ మ్యాజిక్‌ ఎలా పని చేసింది బీజేపీ విజయానికి కారణాలేంటి అది అనుసరించిన వ్యూహాలేంటి త్రిపురలో విక్టరీ క్రెడిట్‌ కేవలం మోడీ, షాలదేనా...దీని వెనక ఇంకా ఎవరున్నారు?

కాషాయ వ్యూహాలేంటి?
నార్త్‌ ఈస్ట్‌లో పాగా వేయడానికి ఒక పకడ్బందీ వ్యూహంతో ముందుకెళుతోంది భారతీయ జనతా పార్టీ. మొదట కాంగ్రెస్‌ స్థానాన్ని లాగేసుకుని, భర్తీ చేస్తుంది. తర్వాత స్థానిక చిన్నాచితక పార్టీలతో జతకడుతుంది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉండటంతో, మరిన్ని నిధులు పారిస్తామని వాగ్దానం చేస్తుంది. అస్సాం, మణిపూర్‌లో ఈ ఫార్ములా వర్కౌటయ్యింది. అరుణాచల్‌లోనూ ఫలితమిచ్చింది. త్రిపుర,నాగాలాండ్, మేఘాలయాలోనూ రిజల్ట్‌ రాబట్టింది. కానీ కమ్యూనిస్టుల కంచుకోటయిన త్రిపురలో కేవలం ఇవే కాదు, అనేక వ్యహాలు వేసి, విజయఢంకా మోగించింది బీజేపీ.

త్రిపురలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ఖతం చేసిన బీజేపీ
త్రిపురలో అధికార పార్టీ సీపీఎం అయితే, కాంగ్రెస్ ప్రతిపక్షం. కానీ కాంగ్రెస్‌కు రీప్లేస్ కావాలనుకుంది బీజేపీ. సీపీఎం, కాంగ్రెస్‌ దొందూదొందేన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు మోడీ, అమిత్‌ షా. దీంతో సీపీఎంపై ఆగ్రహంగా ఉన్న ప్రజలు, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను చూడలేదు. బీజేపీ వైపే నిలిచారు. మణిపూర్, అస్సాంలోనూ అదే జరిగింది. అంటే ప్రత్యామ్నాయ, ప్రతిపక్ష పార్టీని టార్గెట్‌ చేస్తోంది బీజేపీ. కాంగ్రెస్‌ స్థానంలో వికసిస్తోంది కమలం.

మూడేళ్లుగా ఇంటింటికీ ఆరెస్సెస్ ప్రచారం
కానీ త్రిపురలో బీజేపీ విజయానికి మరో మూడు ముఖ్య కారణాల్లో ఒకటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ సహకారం. ఇంటింటికీ వెళ్లి మూడేళ్లుగా బీజేపీను ప్రజలకు చేరువ చేసింది ఆరెస్సెస్. మరోవైపు అమిత్‌ అక్కడే తిష్టవేసి బూత్‌లెవల్‌ కమిటీలను పటిష్టం చేశారు. సీపీఎం, కాంగ్రెస్‌లను నమ్ముకుంటే, అభివృద్ది అధోగతేనని ఆరెస్సెస్-బీజేపీలు ఇంటింటికీ వెళ్లి చాటించాయి.

ఏకకాలంలో పార్టీకి రెండు లక్షల కొత్త సభ్యత్వాలు
కాషాయదండు క్షేత్రస్థాయిలో ఎలా దూసుకెళ్లిందంటే, ఏకకాలంలో రెండు లక్షల మందికి కొత్తగా బీజేపీ సభ్యత్వాలను ఇప్పించింది. అలాగే మూడేళ్లుగా కేంద్రమంత్రులు కూడా అదే పనిగా త్రిపురలో పర్యటిస్తూ, అభివృద్ది కార్యక్రమాలకు పచ్చజెండా ఊపారు. అవకాశం దొరికినప్పుడల్లా మోడీ, అక్కడ శంకుస్థాపనలు చేసి, సీపీఎంపై చెలరేగిపోయారు. బీజేపీకి ఒక్క ఛాన్సివ్వండని పిలుపునిచ్చారు. మంత్రంలాంటి మోడీ మాటలు త్రిపుర జనంలో పని చేశాయనడానికి, ఫలితాలే నిదర్శనం.

ట్రైబల్‌ పార్టీలతో జట్టుకట్టిన కాషాయం
త్రిపురలో 20 స్థానాలు గిరిజనులవే. దీంతో ముందుగా ట్రైబల్ పార్టీలతో జట్టుకట్టింది కాషాయం. ఇండిజినెస్ పీపుల్స్ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర ఐపీఎఫ్‌టీతో జోడీ చేసింది. 20 ట్రైబల్ స్థానాల్లో, 2013లో 18 సీట్లు సీపీఎం గెలుచుకుంది. కాంగ్రెస్‌కు ఇక్కడ పెద్ద స్కోపులేదు. ipftతో జట్టుకట్టడంతో గిరిజన స్థానాల్లో అత్యధికం సొంతం చేసుకుంది బీజేపీ.

సామదాన దండోపాయాలు ప్రయోగించిన కమలం
కేవలం IPFTతో పొత్తుపెట్టుకోవడమే కాదు, కాంగ్రెస్‌ నేతలనూ సామదానబేద దండోపాయాలతో తనవైపు లాక్కుంది బీజేపీ. స్థానికంగా బలమైన నాయకులను చేర్చుకుని, నిలబెట్టింది. వారే అఖండ విజయం సాధించారు. వలసల వ్యూహం కూడా ఫలించింది.

త్రిపుర స్థానిక సమస్యలపైనే బీజేపీ ఫోకస్
దేశవ్యాప్తంగా బీజేపీ జాతీయవాదం, మతం వంటి ఇష్యులను ప్రచారాంశాలుగా తీసుకుంటే, త్రిపురలో మాత్రం స్థానిక సమస్యలను ఎత్తిపట్టుకుంది. అదేపనిగా మాణిక్‌ సర్కారు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. నిరుద్యోగిత, అవినీతిని అస్త్రాలుగా మలచుకుంది. లేబర్ బ్యూరో డేటా ప్రకారం, త్రిపురలో నిరుద్యోగితా శాతం 19.7. దేశంలోనే ఇది ఎక్కువ. మోడీ, అమిత్‌షాలు అదే పనిగా నిరుద్యోగాన్ని ప్రధాన అంశంగా తెరపైకి తెచ్చారు. మాణిక్ సర్కార్ నేతృత్వంలో నిరుద్యోగులు 25 వేల నుంచి ఏడున్నర లక్షలకు పెరిగారంటూ విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే, కేంద్రంలో ఉన్నది ఎలాగూ తామే కాబట్టి, ప్రత్యేక హోదా సహకారంతో మరిన్ని నిధులు ఇచ్చి, పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్ధానం చేశారు. నిరాశలో ఉన్న నిరుద్యోగులపై ఈ హామీ మంత్రంలా పనిచేసింది.

రోజ్‌ వ్యాలీ చిట్‌ఫండ్‌ స్కాంను ప్రస్తావించిన మోడీ
మాణిక్‌ సర్కార్‌పై వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు చేయకపోయినా, మంత్రులు, ప్రభుత్వం కరప్షన్‌లో జోగుతోందని మోడీ, అమిత్‌ షా, బీజేపీ శ్రేణులు హోరెత్తించారు. రోజ్‌ వ్యాలీ చిట్‌ఫండ్‌ను ప్రధానంగా ప్రస్తావించారు. ఇంకెందరు పేద ప్రజలు దోపిడీకి గురవ్వాలి ఇంకెందరు ఆత్మహత్యలకు పాల్పడాలి...ఇక వారు చేసిన అరాచకానికి తిరిగి బదులివ్వాల్సిన సమయం ఆసన్నమైందంటూ, భావోద్వేగ ప్రసంగాలు చేశారు మోడీ. ఆ మాటలు జనంలో ఆవేశాన్ని రగిలించాయి. ఓట్లతో కాషాయానికి వీరతిలకం దిద్దాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే అడ్వాంటేజ్‌ ఉంటుంది. దీన్ని బాగా ఉపయోగించుకుంది బీజేపీ. హైవేలు, ఇంటర్నెట్, రోడ్లు, విమానాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మోడీ హోరెత్తించారు. ఇలా సకల అస్త్రాలతో త్రిపురలో చెలరేగిపోయింది బీజేపీ. దానికి తగ్గట్టే విజయం సాధించింది. కానీ బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందో లేదో కానీ త్రిపుర జనం మాత్రం కాషాయాన్ని బలంగా నమ్మారు.

త్రిపుర అఖండ విజయం కేవలం మోడీ, అమిత్‌షాలదే కాదు
త్రిపుర అఖండ విజయం కేవలం మోడీ, అమిత్‌షాలదే కాదు. అస్సాం హెల్త్ మినిస్టర్ హిమంతా బిస్వా శర్మ, రామ్‌ మాధవ్, సునీల్ దియోధర్, బిప్లాబ్ దేబ్, వంటి కొందరు కీలక నాయకులు, అహోరాత్రులు బీజేపీ విజయానికి కష్టపడ్డారు. ముఖ్యంగా అస్సాంలో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరి, ఆరోగ్య శాఖామంత్రిగా ఉన్న హిమం బిస్వా శర్మ, త్రిపురలో తనకున్న స్టార్‌ ఇమేజ్‌ను ఉపయోగించుకున్నారు. రామ్‌మాధవ్‌ క్షేత్రస్థాయిలో సకల కుల సంఘాలు, మత సంఘాలను, చిన్నాచితక పార్టీలను ఏకం చేశారు. ఇలా సామదాన దండోపాయాలు, కేంద్రంలో అధికారంలో ఉండటం, సీపీఎం ప్రభుత్వంపై వ్యతిరేకత, హామీలు, మోడీ మ్యాజిక్, అమిత్‌ షా బూత్‌లెవల్ వ్యూహాలతో త్రిపురలో కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టింది కమలం.

Show Full Article
Print Article
Next Story
More Stories