హస్తినలో దూకుడు పెంచిన బీజేపీ...టీడీపీకి చెక్ పెట్టేందుకు పక్కా ప్లాన్

Submitted by arun on Tue, 03/20/2018 - 09:39

తెలుగుదేశం విమర్శలకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధమైంది.  మాటకు మాట సమాధానమిస్తూనే ఎదురు దాడి చేయాలని కాషాయా దళం నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం కార్యచరణ కూడా సిద్ధం చేసిన ముఖ్యనేతలు  సెంటిమెంట్‌ను ప్రయోగిస్తున్న సైకిల్ పార్టీకి చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రాలను బయటకు తీసేందుకు సిద్ధమయ్యారు.  

మిత్రపక్షం నుంచి విపక్షంగా మారి తమపై పూటకో ఆరోపణ, రోజుకో విమర్శ చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ధీటుగా సమాధానమివ్వాలని కమలనాధులు భావిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో అన్ని విషయాలు ముందే చెప్పినా నాలుగేళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఆరోపణలు చేయడం వెనక రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయని పార్టీ నేతలు నిర్దారణకు వచ్చారు. టీడీపీపై ఎదురు దాడి చేసే విష‍యంలో పక్కగా అడుగులు వేయాలని కాషాయ దళం భావిస్తోంది. టీడీపీ నేతలు తమపై చేస్తున్న విమర్శలకు తగిన సమాధానం చెప్పడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను అధిగమించడంతో పాటు  నాలుగేళ్లలో రాష్ట్ట్రానికి ఏమేమి చేశామో చెప్పడం ద్వారా సానుభూతిని పొందాలని ప్రణాళికలు రచిస్తున్నారు.  ఇదే సమయంలో టీడీపీ నాలుగేళ్ల పాలనలో వెలుగుచూసిన అవినీతి, కుటుంబ పాలన, మోసపూరిత వాగ్ధానాలపై  ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేసి ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. 

ఓ వైపు రాజకీయ విమర్శలు చేస్తూనే వైశ్రాయ్  నాటి ఘటనలను మరోసారి తెరపైకి తేవాలని బీజేపీ వ్యూహ దళం భావిస్తోంది. ఇందులో భాగంగానే ట్రబుల్ షూటర్ రాం మాధవ్ ద్వారా పావులు కదిపేందుకు సిద్ధమైంది. 2014 ఎన్నికల్లో తమ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వంపై నమ్మకంతోనే NDA పక్షాలకు ఓటు వేశారంటూ ప్రచారం చేయాలని నిర్ణ‍యించారు. నాడు వెంటబడి తమతో ఫోటోలు దిగిన చంద్రబాబు ఇప్పుడు టార్గెట్ ఎందుకు చేశారో చెప్పాలంటూ ప్రశ్నించడం ద్వారా టీడీపీ నేతలను ఆత్మర‍క్షణ ధోరణిలోకి నెట్టాలనే వ్యహం రచిస్తున్నట్టు ఢిల్లీ వర్గాల మాట. అయితే బీజేపీ వ్యూహాలకు టీడీపీ ఎలాంటి ప్రతి వ్యూహాలు అమలు చేస్తుందనేది రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తిగా మారింది.   

English Title
BJP Plan To Check TDP

MORE FROM AUTHOR

RELATED ARTICLES