30 మందితో బీజేపీ తొలి జాబితా...

30 మందితో బీజేపీ తొలి జాబితా...
x
Highlights

తెలంగాణలో సత్తా చాటేందుకు భారతీయ జనతాపార్టీ సమాయత్తం అవుతోంది. అభ్యర్థుల ఎంపికపై నియోజకవర్గాల వారీగా అభిప్రాయ సేకరణ పూర్తిచేసిన బిజెపి దశల వారీగా...

తెలంగాణలో సత్తా చాటేందుకు భారతీయ జనతాపార్టీ సమాయత్తం అవుతోంది. అభ్యర్థుల ఎంపికపై నియోజకవర్గాల వారీగా అభిప్రాయ సేకరణ పూర్తిచేసిన బిజెపి దశల వారీగా బరిలో నిలిచే వారి జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. తొలి విడతగా 30 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. త్వరలో సమావేశం కానున్న రాష్ట్ర ఎన్నికల కమిటీ ఆశావహుల పేర్ల గురించి చర్చించి, జాబితాను కుదించి, భాజపా కేంద్ర పార్లమెంటరీ బోర్డుకు పంపిస్తుంది. వారి ఆమోదం అనంతరం అభ్యర్థుల్ని భాజపా అధికారికంగా ప్రకటించనుంది.

ఈ నెల 10న కరీంనగర్‌ సభకు అమిత్‌షా వస్తున్న నేపథ్యంలో ఆయనతోనూ చర్చించాలని ముఖ్యనేతలు భావిస్తున్నారు. నోటిఫికేషన్‌లోపు తొలివిడత ప్రకటిస్తామంది. గరిష్ఠంగా 30 మందితో జాబితా ప్రకటించే అవకాశముందని పార్టీనేత ఒకరు తెలిపారు. లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచీ కిందిస్థాయి నేతలు కొందరు టికెట్‌ కోసం దరఖాస్తు చేశారు. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు వస్తే సిట్టింగ్‌లు, ముఖ్యమైన కొందరు నేతల నియోజకవర్గాల్లో మినహా మిగిలినచోట్ల వీరిని మార్చాలని నిర్ణయించింది.

లోక్‌సభకు పోటీచేయాలనుకునే నేతలూ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాల్సిందేనని అమిత్‌షా స్పష్టం చేశారు. యెండల లక్ష్మీనారాయణను నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి ధర్మపురి అర్వింద్‌ను నిజామాబాద్‌ రూరల్‌ లేదా బోధన్‌ నుంచి బరిలోకి దింపాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కోసం పనిచేసేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి దాదాపు 200 మంది వచ్చారని, ఎన్నికలు పూర్తయ్యేంతవరకు వీరంతా ఇక్కడే పనిచేస్తారని బిజెపి వర్గాలు తెలిపాయి. వారితో, పార్టీ సానుభూతిపరులతో నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో బిజెపి తెలంగాణ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి సంతోష్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కృష్ణదాస్‌, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు.

కొందరు ముస్లిం అభ్యర్థుల్ని ఎన్నికల బరిలోకి దించేందుకు బిజెపి సిద్ధమవుతోంది. తొలుత మజ్లిస్‌ ప్రాబల్యమున్న నియోజకవర్గాలపై దృష్టిపెట్టింది. మజ్లిస్‌ శాసనసభాపక్ష తాజా మాజీ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న చాంద్రాయణగుట్ట నుంచి ముస్లిం మహిళను బరిలోకి దించాలని దాదాపుగా నిర్ణయించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తిచేసి పీహెచ్‌డీ చేస్తున్న సయ్యద్‌ సహజాద్‌ లక్ష్మణ్‌ సమక్షంలో బిజెపిలో చేరారు. ఆమె చాంద్రాయణగుట్ట నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారని, మైనార్టీలు ముందుకొస్తే అవకాశాన్ని బట్టి టికెట్లు ఇస్తామని లక్ష్మణ్‌ చెప్పారు.

శాసనసభ ఎన్నికలకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని, టిఆర్‌ఎస్ వైఫల్యాల్ని, కాంగ్రెస్‌ అవకాశవాద రాజకీయాల్ని ప్రచారాస్త్రాలుగా చేసుకుంటామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ చెప్పారు. మార్పుకోసం భాజపాకు పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో శాసనసభాపక్ష మాజీ నేత కిషన్‌రెడ్డి, ఇతర నేతలతో కలిసి లక్ష్మణ్‌ మాట్లాడారు. అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయసేకరణ పూర్తయ్యిందని చెప్పారు. 10న కరీంనగర్‌ సభకు వస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో దీనిపై చర్చిస్తామని, ఎన్నికల నోటిఫికేషన్‌లోపే తొలి జాబితా ప్రకటిస్తామన్నారు.

వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికే ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ వ్యక్తిగత దూషణలు, పరుష పదజాలం వాడుతూ తెలంగాణకు తలవంపులు తెస్తున్నారని విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భాషనూ ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు అడుగడుగునా టిడిపి అడ్డుపడిందన్నారు. అలాంటి పార్టీ ఉన్న మహాకూటమిలో చేరడాన్ని ఎలా సమర్థిస్తారో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం చెప్పాలని డిమాండ్‌చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories