ఉపఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన బీజేపీ

Submitted by lakshman on Wed, 03/14/2018 - 20:25
Yogi Adityanath

ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లోని మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పుర్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్‌ నిషాద్‌ భారీ ఆధిక్యతతో దూసుకెళ్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్య ప్రాతినిధ్యం వహించిన ఫుల్పూర్‌లో సమాజ్‌వాదీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్‌ సింగ్‌ పటేల్‌ తన సమీప బీజేపీ అభ్యర్థి కౌశలేంద్ర సింగ్‌ పటేల్‌పై 59,460 ఓట్ల భారీ తేడాతో విజయభేరి మోగించారు. బీజేపీ  ఘోర పరాభవాన్ని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అంగీకరించారు. 'ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నాం. ఈ ఫలితాలను అస్సలు ఊహించలేదు. లోపాలను సమక్షించుకుంటాం. విజేతలకు అభినందనలు' అని ఆయన అన్నారు. అటు బీహార్‌లోని ఆరారియాలోనూ బీజేపీ  ఆర్జేడి చేతిలో ఓటమిపాలైంది. ఆర్జేడి అభ్యర్థి సర్ఫరాజ్‌ అలాం తన సమీప ప్రత్యర్థి అయిన బిజెపి అభ్యర్థి ప్రదీప్‌ కుమార్‌ సింగ్‌ పై 57,358 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నెల 11న జరిగిన ఉప ఎన్నికల కౌటింగ్‌ బుధవారం ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమైంది. కౌటింగ్‌ ప్రారంభం నుంచీ ప్రతి రౌండ్‌లోనూ బీజేపీ  పరాభవం కొనసాగడం విశేషం. బీహార్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలు జెహనాబాద్‌, బహబువా స్థానాల్లో చెరో స్థానంలో ఆర్జేడి, బిజెపి విజయం సాధించాయి. జెహానాబాద్‌లో ఆర్జేడి గెలుపొందగా, బహబువా స్థానాన్ని బిజెపి దక్కించుకుంది. 
గోరఖ్‌పుర్‌లో వైద్య నిర్లక్ష్యం వల్ల వందలాది మంది చిన్నారులు ఆక్సిజన్‌ అందక చనిపోవడం, మత ఘర్షణలను రెచ్చగొట్టడం వంటి చర్యలతో యోగి సర్కార్‌ అప్రతిష్ట మూటగట్టుకుంది. మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బిఎస్పీ)తో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎన్నికల అవగాహన చేసుకోవడంతో సామాజిక సమీకరణలు కూడా ఎస్పీకి కలిసిసొచ్చాయి. 2019 సాధారణ ఎన్నికలకు రీహార్సల్స్‌గా భావించిన ఈ ఎన్నికల్లో బీజేపీ  ఓటమి పాలమవ్వడంతో జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీసింది. 
హిందుత్వ శక్తులకు, వ్యక్తిగతంగా యోగి ఆదిత్యానాథ్‌కు కంచుకోట అయిన గోరఖ్‌పుర్‌ లోక్‌సభ స్థానం చాలా ప్రతిష్టాత్మకమైనది. ఈ స్థానం నుంచి ఆదిత్యనాథ్‌ ఏకంగా ఐదు పర్యాయాలు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అంతకుముందు ఈ స్థానం నుంచి యోగి ఆదిత్యానాథ్‌ గురువు అయిన యోగి అవైద్యనాథ్‌ ప్రాతినిధ్యం వహించారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్‌ నెహ్రూ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన స్థానంగా విశేష గుర్తింపు ఉన్న ఫుల్ఫూర్‌లో 2014లో బీజేపీ  భారీ మెజార్టీతో విజయం సాధించింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ప్రాతినిధ్యం వహించారు. ఆదిత్యనాథ్‌, మౌర్య శాసనమండలికి ఎన్నిక కావడంతో ఈ రెండు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాల్సివచ్చింది. ఈ నెల 11న జరిగిన ఉప ఎన్నికల పోలింగ్‌లో 43 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

English Title
BJP Loses UP, Bihar Bypolls, Yogi Adityanath Blames 'Overconfidence'

MORE FROM AUTHOR

RELATED ARTICLES