కమలం వాడిపోయే రోజులొస్తున్నాయా? ఉప ఫలితం ఉపదేశమేంటి?

కమలం వాడిపోయే రోజులొస్తున్నాయా? ఉప ఫలితం ఉపదేశమేంటి?
x
Highlights

కమలానికి గడ్డు రోజులు ఎదురవుతున్నాయా? కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో దేశం మొత్తాన్ని కాషాయీకరణ చేయాలన్న బిజెపి కల కలగానే మిగిలిపోనుందా? మోడీ గ్రాఫ్...

కమలానికి గడ్డు రోజులు ఎదురవుతున్నాయా? కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో దేశం మొత్తాన్ని కాషాయీకరణ చేయాలన్న బిజెపి కల కలగానే మిగిలిపోనుందా? మోడీ గ్రాఫ్ రాను రాను కరిగిపోతోందా? ఇవాల్టి ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. అన్ని చోట్లా విపక్ష కూటమే విజయం సాధించడంతో కమలనాథులు కలవరపడాల్సి వస్తోంది. దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని నాలుగు లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి అతి కష్టం మీద రెండు లోక్ సభ స్థానాలను నిలబెట్టుకోగలిగింది. అందులోనూ ఒక స్థానం మిత్రపక్షానిది. అంటే మూడు సిట్టింగ్ స్థానాలకు ఒక్క స్థానం మాత్రమే నిలుపు కోగలిగింది. మిగిలిన రెండు స్థానాలూ కాంగ్రెస్ మిత్ర పక్షాలు చేజిక్కించుకున్నాయి.. మహారాష్ట్రలోని పాల్ఘడ్ లో శివసేన అభ్యర్ధిపై బిజెపి విజయం సాధించింది. ఇక యూపీలోని కైరానా లోక్ సభ నియోజక వర్గంలో ఆర్ ఎల్డీ అభ్యర్ధి గెలిచారు.. ఇక్కడ విపక్షాలన్నీ కలసి బిజెపికి పోటీగా ఒకే అభ్యర్ధిని రంగంలోకి దించడంతో విజయం సాధ్యపడింది. అటు బీహార్ లోనూ బిజెపి మిత్రపక్షమైన జేడియూకి ఎదురుదెబ్బ తగిలింది. జోకీహాట్ నియోజక వర్గంలో లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడి అభ్యర్ధి ఘన విజయం సాధించారు.కర్ణాటకలో ఆర్ ఆర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడంతో కర్ణాటకలో కాంగ్రెస్ బలం పెరిగినట్లయ్యింది. ఇక పశ్చిమ బెంగాల్ లోని మహేస్తల నియోజక వర్గం నుంచి తృణమూల్ అభ్యర్ధి విజయం సాధించి ప్రాంతీయ పార్టీల హవా నిలబెట్టుకున్నారు.. జార్ఖండ్ లోని గోమియాలో బిజెపి, సిలీ స్థానంలో జేఎంఎం అభ్యర్ధులు గెలుపొందారు..

ఇక మేఘాలయలో అంపటి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపొందారు.. దాంతో ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈగెలుపుతో మేఘాలయలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. తాజా గెలుపుతో 60 స్థానాలున్న మేఘాలయలో కాంగ్రెస్ బలం 21కి చేరింది. మరోవైపు కేవలం రెండు సీట్లున్న బిజెపి ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు కర్ణాటక తరహాలో మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నించనుందని తెలుస్తోంది.మొత్తం మీద ఏతా వాతా బిజెపికి ఈ ఎన్నికలు ఒక వార్నింగ్ లాంటివి..

బిజెపిని ఎదిరించే విపక్షాలన్నీ ఇకపై ఒక్క తాటిపైకి వస్తే.. ఏ జరుగనుందనడానికి సూచిక ఈ ఎన్నికలు.. చిన్న పార్టీలు, తాము ప్రభావం చూపగలిగిన ప్రాంతాల్లో అత్యాశకు పోయి పోటీ కోసం అభ్యర్ధులు నిలపకుండా అక్కడ ఉమ్మడి అభ్యర్ధులను రంగంలోకి దించడం మెరుగైన ఆలోచన అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పే పరిస్థితిలో ఉండాలంటే తక్షణం బిజెపితో నేరుగా తలపడే స్థానాల్లో తన సీట్లు, ఓట్ల శాతాన్ని పెంచుకోవాలసి ఉంటుంది.

మొత్తం మీద దేశవ్యాప్తంగా బిజెపికి ఎదురు గాలి వీస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. కొన్ని స్థానాల్లో విపక్షాల ఐక్యత కూడా బిజెపి బలహీన పడటానికి కారణంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ముక్త భారత్ సాధన పేరుతో గత కొంత కాలంగా అమిత్ షా, మోడీ ద్వయం దేశ వ్యాప్తంగా ముమ్మరంగా తిరుగుతోంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ను మట్టి కరిపించడమే ధ్యేయంగా ప్రచారం సాగించింది.. కానీ ఈ ప్రయత్నం అంతా వృథా ప్రయాసేననే సంకేతాలు వెలువడుతున్నాయి.. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కమల నాథుల్లో ఈ ఫలితాలు టెన్షన్ పెంచుతున్నాయి...

దేశ రాజకీయాల్లో ఈ మార్పులు దేనికి సూచిక.. జాతీయ పార్టీలు ప్రాభవం కోల్పోతున్నాయా? ప్రాంతీయ పార్టీలు బలమైనశక్తులుగా ఎదుగుతున్నాయా? చిన్న పార్టీలు కూటమిగా ఏర్పడితే 2019లో జాతీయ పార్టీలను ఓడించగలవా? రాజకీయ శక్తుల పునరేకీకరణ బిజెపిని మట్టి కరిపిస్తుందా? ఫెడరల్ ఫ్రంట్ రూపు దిద్దుకుంటే.. కమలం ఇక పూర్తిగా వాడిపోవాల్సిందేనా?

Show Full Article
Print Article
Next Story
More Stories