టీడీపీ పై బీజేపీ దూకుడు‌.. బీజేపీ మంత్రుల రాజీనామా!

టీడీపీ పై బీజేపీ దూకుడు‌.. బీజేపీ మంత్రుల రాజీనామా!
x
Highlights

టీడీపీపై దూకుడు పెంచాల్సిందేనని బీజేపీ పదాధికారులు తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇస్తోన్న నిధులపై కొద్దిరోజులుగా రెండు పార్టీల మధ్య...

టీడీపీపై దూకుడు పెంచాల్సిందేనని బీజేపీ పదాధికారులు తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇస్తోన్న నిధులపై కొద్దిరోజులుగా రెండు పార్టీల మధ్య నడుస్తున్న వార్‌‌. టీడీపీపై దూకుడు పెంచాల్సిందేనని బీజేపీ పదాధికారులు తేల్చి చెప్పారు.

టీడీపీ, బీజేపీ మాటల యుద్ధం చివరి అంకానికి చేరుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇకపై టీడీపీపై దూకుడుగా వెళ్లాలని తీర్మానించారు. అవసరమైతే రాష్ట్ర కేబినెట్‌ నుంచి తప్పుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. పార్టీ ఆదేశిస్తే మంత్రి పదవులకు ఐదే ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తామన్నారు మాణిక్యాలరావు.

ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ ప్రకటిస్తే ఒప్పుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు నిధులు ఇవ్వడం లేదంటూ తప్పుని బీజేపీపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇకపై టీడీపీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని నిర్ణయం తీసుకున్న బీజేపీ నేతలు బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో పోలవరంలో అవినీతి, ఉపాధి హామీ నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని తీర్మానించారు. అలాగే టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, టీడీపీ మేనిఫెస్టో ఏ మేరకు అమలు చేసిందో అధ్యయనం చేసేందుకు ఏబీవీపీ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటుచేశారు.

అయితే ఏపీ కేబినెట్ నుంచి బీజేపీ మంత్రులు తప్పుకోవాల్సిందేనని కొందరు పదాధికారులు డిమాండ్ చేశారు. టీడీపీ, బీజేపీ మధ్య ఇన్ని విభేదాలు, అనుమానాలు నెలకొన్న తర్వాత మంత్రివర్గంలో కొనసాగడమెందుకని వాదించారు. అయితే తమకు మంత్రి పదవులు ఎక్కువ కాదని మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంత్రి పదవులను ఎప్పుడైనా వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇక ఏపీ అధ్యక్షుడు హరిబాబుకు, మరో నాయకుడు లక్ష్మీపతిరాజుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన లక్ష్మీరాజును మాణిక్యాలరావు, విష్ణుకుమార్రాజు‌, సోము వీర్రాజు, పురంధేశ్వరిలు సముదాయించారు.

మొత్తానికి బీజేపీ పదాధికారుల సమావేశం హాట్‌హాట్‌గా జరిగింది. టీడీపీతో తాడోపేడో తేల్చుకునేదిశగా సంకేతాలు పంపారు. అంతేకాదు ఏపీ బీజేపీ నేతలు తీసుకున్న నిర్ణయాల ఆమోదానికి అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తామని ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories