తెలంగాణ ప్రభుత్వానికి అనుకోని చిక్కు

తెలంగాణ ప్రభుత్వానికి అనుకోని చిక్కు
x
Highlights

తెలంగాణ ప్రభుత్వానికి అనుకోని చిక్కు వచ్చిపడింది. జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్‌పై అమెరికా కోర్టు తీర్పుతో వైద్యారోగ్యశాఖ అధికారులు ఆలోచనలో పడ్డారు....

తెలంగాణ ప్రభుత్వానికి అనుకోని చిక్కు వచ్చిపడింది. జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్‌పై అమెరికా కోర్టు తీర్పుతో వైద్యారోగ్యశాఖ అధికారులు ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న కేసీఆర్‌ కిట్‌లో ఈ పౌడర్‌ కూడా ఉండటంతో ఇరకాటంలో పడ్డారు. అయితే అమెరికా కోర్టు తీర్పును అమలు చేయాలా? వద్దా? అనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వివాదం పెద్దదికాకముందే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులను ప్రయివేటు ఆసుపత్రులకు ధీటుగా మార్చాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ పలు సంచలనాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల శాతం పెరిగేలా పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే గవర్నమెంట్ ఆసుపత్రిలో డెలివరీ అయి డిశ్చార్జి అవుతున్న సమయంలో కేసీఆర్ కిట్ పేరుతో 2వేల రూపాయల విలువ చేసే16 రకాల వస్తువులను అందిస్తున్నారు. ఇందులో నవజాత శిశువు కోసం సబ్బు, బాడి ఆయిల్, శరీరానికి రుద్దే పౌడర్ లు ఉన్నాయి. ఇవన్నీ కూడా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కి చెందినవే. ప్రస్తుతం ఈ జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్‌‌పై భారీ జరిమానా విధిస్తూ అమెరికాలో తీర్పు వెలువరింది. ఈ పౌడర్ వినియోగం వల్ల ఆస్బెస్టాస్ తో కూడిన అండాశయ కాన్సర్ సోకినట్టు కోర్టు నిర్ధారించింది. దీంతో కిట్ లో ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్ వస్తువులను కొనసాగించాలా వద్దా అని అధికారులు మీమాంస లో పడ్డారు.

ప్రస్తుతం నెలకు 20 వేల కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. TSMDC ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ జరుగుతోంది. ఇప్పటికే మూడు నెలలకు సంబందించి అవసరమైన కిట్లను ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకుంది. అయితే అమెరికాలో వచ్చిన తీర్పు ను ఇక్కడ అమలుపరచాలా వద్దా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం న్యాయ సలహా కూడా తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయం రాష్ట్ర పరిధిలో లేనందున ఒక వేళ నిషేధించినా చెల్లుబాట కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కిట్‌ల వరకు నిషేధం విధిస్తే బహిరంగ మార్కెట్‌లో విక్రయించే విషయంపై విమర్శలు వచ్చే అవకాశముంది. దీంతో ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అటు అధికారులు, ఇటు ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు రాలేదని దీనిపై ప్రజల్లో చర్చ రాకముందే చర్య తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు,.

ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ చేతికి మట్టి అంటకుండా కేంద్రం ద్వారా నిషేధం విధించేలా ఒత్తిడి తేవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం. గతంలో మ్యాగి, నెస్లీ ప్రొడక్ట్స్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో ఇది త్వరగా తేల్చే అవకాశాలు లేకపోవడంతో మూడు నెలల వరకు ఇవే కిట్లు పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నట్టు పలువురు అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories