వైసీపీలో భారీగా మార్పులు, చేర్పులు

Submitted by arun on Sat, 10/06/2018 - 12:15
jagan

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో అసంతృప్తులు తీవ్రమయ్యాయి. రోజూ ఏదో ఒక ప్రాంతంలో నేతల అసంతృప్తి, కార్యకర్తల ఆందోళనలు దద్దరిల్లుతున్నాయి. వరుసగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు నేతలను బెంబేలెత్తిస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు సమన్వయకర్తలు ఉండటంతో ఎక్కడ తమ సీటుకు ఎసరు వస్తుందోనని నియోజకవర్గం ఇన్‌చార్జిలు హడలిపోతున్నారు. 

వైసీపీలో ఇటీవల వరుస మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ టీమ్‌తో పాటు పార్టీ అధిష్టానం చేసిన సర్వేల ఆధారంగా నియోజకవర్గ ఇన్‌చార్జిలను మర్చాలని పార్టీ అధినేత జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే చాలా వరకూ మార్పులు జరిగిపోవడంతో మిగిలిన నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఆందోళన చెందుతున్నారు. 

నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో కొంతమంది నియోజకవర్గ ఇన్‌చార్జిలను మార్చనుంది వైసీపీ అధిష్టానం. ఇన్‌చార్జిల మార్పు ప్రక్రియను కృష్ణాజిల్లా నుంచే ప్రారంభించిన జగన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి రాధాకృష్ణను తప్పించి మల్లాది విష్ణుకి సీటు అప్పగించారు. ఇక తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న యలమంచిలి రవిని కూడా తప్పించాలని భావిస్తున్నారు. 

గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట నియోజకవర్గం ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌ను మార్చి విడతల రజినికి బాధ్యలు అప్పగించారు. అలాగే, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డిని తప్పించి ఏసురత్నంకు ఆ సీటు అప్పగించిన అధిష్టానం వీటితోపాటు జిల్లాలోని వేమూరు, తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలను మార్చే యోచనలో ఉంది అధిష్టానం. 

ప్రకాశం జిల్లాలోనూ భారీ మార్పులకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమయ్యారు. దర్శి నియోజకవర్గం బాధ్యతలను ప్రస్తుతం ఇన్‌చార్జి బాదం మాధవరెడ్డి నుంచి తప్పించి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి అప్పగించనున్నారు. పర్చూరు ఇన్‌చార్జి రాంబాబును తప్పించి ఆ సీటును గొట్టిపాటి భరత్‌కు ఇవ్వనున్నారు. అద్దంకి ఇన్‌చార్జి బాచిన చెంచు గరటయ్యను కాదని ఆ సీటును గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన వ్యాపావేత్తకు అప్పగించాలని చూస్తున్నారు. 

మరోవైపు ఉత్తరాంధ్రలోనూ ఇన్‌చార్జిలను మార్చారు జగన్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఇన్‌చార్జి సర్దు రామారావును తప్పించి పిరియా సాయిరాజ్‌కు అప్పగించారు. పలాసలో వజ్జ బాబురావును తప్పించి సిదిరి అప్పలరాజుకు అప్పగించడంతో ప్రస్తుత ఇన్‌చార్జి బాబురావు అసంతృప్తితో టీడీపీలో చేరారు. అలాగే, తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం ఇన్‌చార్జిగా ఉన్న తోట సుబ్బారావు స్థానంలో దవులూరి దొరబాబును తెరపైకి తేవడంతో తోట వర్గం రగిలిపోతుంది. ఇక జగ్గంపేటలో ముత్యాల శ్రీనును తప్పించి జ్యోతుల చంటిబాబుకు ఇచ్చారు. దీంతో పార్టీ నేతల్లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. 

అయితే, పార్టీలో జరుగుతున్న మార్పులు, చేర్పులను సీనియర్ నేతలు సమర్ధిస్తున్నారు. గెలుపు గుర్రాలకే ఎన్నికల్లో టికెట్లు ఉంటాయంటున్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాలు కొందరికి నచ్చినా, నచ్చకపోయినా పార్టీ ప్రయోజనాల కోసం స్వాగతించాలని చెబుతున్నారు. మొత్తంమీద వైసీపీ అధిష్టానం వ్యవహారంతో నియోజకవర్గ ఇన్‌చార్జిల్లో ఆందోళన మొదలైంది. మరి ఎన్నికల నాటికి ఆ స్థానాల్లో ఉండేదెవరో? పోయేదెవరో చూడాలి. 

English Title
big changes in ysr congress party

MORE FROM AUTHOR

RELATED ARTICLES