బాసర అమ్మవారి ఉత్సవ విగ్రహం ఎక్కడుంది.?

Highlights

బాసర అమ్మవారి ఉత్సవ విగ్రహం ఎక్కడుంది.? పరారీలో ఉన్న పూజారుల ఆచూకీ తెలిసేదెప్పుడు.? ఉత్సవ విగ్రహం ఒక్కటే మాయమైందా.? మిస్సింగ్ లిస్ట్‌లో ఇంకా ఏమైనా...

బాసర అమ్మవారి ఉత్సవ విగ్రహం ఎక్కడుంది.? పరారీలో ఉన్న పూజారుల ఆచూకీ తెలిసేదెప్పుడు.? ఉత్సవ విగ్రహం ఒక్కటే మాయమైందా.? మిస్సింగ్ లిస్ట్‌లో ఇంకా ఏమైనా ఉన్నాయా.? అమ్మవారి విగ్రహాలు, ఆభరణాల లిస్ట్ ఇచ్చేందుకు.. ఈవో ఎందుకు వెనకాడుతున్నారు.?

నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి ఉత్సవ విగ్రహం అదృశ్యమై రోజులు గడుస్తున్నా ఇంకా ఆచూకీ దొరకలేదు. విగ్రహం మిస్సింగ్‌పై ఆలయ అధికారులు బాసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్, అర్చకుడు ప్రణయ్‌పై కేసులు నమోదు చేశారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సంజీవ్ శర్మ, ప్రణయ్ ఇద్దరూ హైదరాబాద్‌లో ఉన్నట్లు సెల్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. ఈ ఇద్దరు పూజారులు తమ బంధువులతో ఫోన్‌లో టచ్‌లో ఉన్నారని గుర్తించిన పోలీసులు వారు మాట్లాడే కాల్స్ రికార్డ్ చేస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్తున్నారు.

ప్రధాన అర్చకుడు సంజీవ్ శర్మ ఇంట్లోనే అమ్మవారి ఉత్సవ విగ్రహం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆయనింట్లో తనిఖీల కోసం పోలీసులు కోర్టు అనుమతి తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. పర్మిషన్ రాగానే పూజారుల ఇళ్లలో సోదాలు చేపడతామని పోలీసులు చెప్తున్నారు.

ఇదిలా ఉంటే అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఒక గదిలోనే విగ్రహాలు, రోజూ అలంకరించే నగలు ఉంటాయి. వీటిని ఆలయంలో ఒక్కో పూజారికి ఒక్కో బీరువా ఇచ్చి అమ్మవారి విగ్రహాలు, ఆభరణాల సంరక్షణ బాధ్యత అప్పగించారు. బాసరలో 15 అమ్మవారి విగ్రహాలున్నాయని అధికారులు చెప్తున్నారు. కానీ ఉత్సవ విగ్రహం మాయమైన తర్వాత ఎన్ని విగ్రహాలున్నాయనే దానిపై ఈఓ సుధాకర్ క్లారిటీ ఇవ్వడం లేదు.

ప్రధాన అర్చకుడు సంజీవ్ అమ్మవారి ఉత్సవ విగ్రహంతో పాటు మిగతా ఆభరణాలేమైనా తీసుకెళ్లాడా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాలు, ఆభరణాల లిస్ట్ ఇవ్వాలని పోలీసులు అధికారులను కోరారు. కానీ వాళ్లు మాత్రం ఇంకా సమాచారం ఇవ్వడం లేదు. దీంతో అమ్మవారి ఉత్సవ విగ్రహంతో పాటు మరిన్ని విగ్రహాలు, ఆభరణాలు కూడా మిస్ అయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

అంతేకాదు 15 మంది పూజారుల్లో ఎవరెవరికి విగ్రహాలు, ఆభరణాల బాధ్యత అప్పగించారనే దానిపై రికార్డుల్లో స్పష్టత లేదు. దీంతో అధికారులు తమ వైఫల్యం బయటపడుతుందని ఆందోళన చెందుతున్నారు. విగ్రహాలు, ఆభరణాల లిస్ట్ ఇస్తే 24 గంటల్లో కేసును కొలిక్కి తెచ్చేందుకు రెడీగా ఉన్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories