అందరి దృష్టి బాన్సువాడపైనే? బాద్‌షా ఎవరో మరి!!

అందరి దృష్టి బాన్సువాడపైనే? బాద్‌షా ఎవరో మరి!!
x
Highlights

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ వీఐపీ నియోజకవర్గం.. ఓటర్లు ప్రతి ఎన్నికల్లో విలక్షణతీర్పుతో నేతలకు చుక్కలు చూపిస్తారు.. వరుసగా రెండుసార్లు గెలిపించి...

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ వీఐపీ నియోజకవర్గం.. ఓటర్లు ప్రతి ఎన్నికల్లో విలక్షణతీర్పుతో నేతలకు చుక్కలు చూపిస్తారు.. వరుసగా రెండుసార్లు గెలిపించి మూడోసారి కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారు. ఈ నియోజవర్గం నుంచి గెలిస్తే మంత్రి పదవి ఖాయం అన్నట్లుగా.. నేతలకు అదృష్టం తలుపు తడుతుంటుంది.
ఈ నియోజకవర్గంపై రాష్ట్రస్ధాయిలో ఆసక్తి ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి గెలిస్తే మంచి పదవి వరిస్తుందనే నమ్మకంతో.. అభ్యర్ధులు దేనికైనా సై అంటున్నారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యం ఉంది.

బాన్సువాడ టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోచారం పేరు మరోసారి ఖరారైంది. ఆయన ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. నియోజకవర్గం చుట్టొస్తూ దూసుకెళ్తున్నారు. నియోజవర్గంలో పూర్దిస్ధాయిలో పట్టు ఉన్న పోచారం... ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వర్ని, కోటగిరి మండలాల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.. దాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు.

బాన్సువాడ నుంచి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న.. కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు తహతహలాడుతోంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాసుల బాలరాజు టికెట్టు రేసులో ఉన్నారు. ఓటమి చెందినా నియోజకవర్గాన్ని పట్టుకుని పార్టీ కార్యకలామాలు చేస్తు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక కోటగిరి మండలం కొత్తపల్లి క్యాంప్‌కు చెందిన మల్యాద్రిరెడ్డి కాంగ్రెస్ టికెట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తనకంటూ క్యాడర్ ఏర్పాటు చేసుకుని గ్రామాలను చుట్టొస్తున్నారు. బాన్సువాడలో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు బలమైన నాయకుడు లేకపోవడంతో.. కొత్త ముఖాన్ని తెరపైకి తెచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రతిపక్షాలకు టికెట్టు ఖరారు కాకపోవడంతో ఆయా అభ్యర్ధుల్లో స్తబ్దత నెలకొంది.

బాన్సువాడ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2004, 2011 ఉపఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో మినహా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. మంత్రి పోచారం టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో మారిన తరవాత పార్టీ బలహీనపడింది. ప్రస్తుతం నియోజకవర్గం ఇంచార్జీగా కొడాలి రాము పర్యటిస్తున్నారు. పొత్తులో భాగంగా ఎవరికి టికెట్టు వచ్చినా.. మహాకూటమి విజయానికి కృషి చేస్తామని నేతలు చెబుతున్నారు. వీఐపీ నియోజకవర్గంగా పేరున్న బాన్సువాడలో ఈ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు నిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అన్ని పార్టీలు బాన్సువాడలో పాగా వేసేందుకు తమదైన స్టైల్‌లో.. వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం బలమైన అభ్యర్దిని రంగంలోకి దింపి మంత్రి పోచారానికి షాక్ ఇవ్వాలని చూస్తుండగా... ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా పోచారం భారీ వ్యూహాంతో ముందుకెళ్తున్నారంటున్నారు ఆయన అనుచరులు. మంత్రి ఇలాఖాలో పాగా ఎవరు వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories