రాహుల్‌తో కలయిక వెనుక బాబు నడిపిన మంత్రాంగం

Submitted by santosh on Thu, 11/29/2018 - 14:44
babu rahul bheti

తెలంగాణ ఎన్నికలు విభజన నాటి రోజులను గుర్తుకు తెస్తున్నాయి. ఏపీ ప్రజలు విభజనను ఒక గాయంగా భావించే సంఘటనను మరోసారి ప్రస్తావించి సెటిలర్ల ఓట్లను పూర్తి స్థాయిలో కొల్ల గొట్టే ప్రయత్నం మహా కూటమి చేస్తోందా అంటే అవుననే అనాలి. ఖమ్మం సభలో పాల్గొన్న కూటమి నేతలు విభజన నాటి ప్రమాణాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రజా కూటమి తరపున ప్రచారం చేసిన నేతల్లో చంద్రబాబు,రాహుల్ ఇద్దరి ప్రసంగాల్లోనూ విభజన హామీలను గుర్తు చేశారు. సమైక్య ఏపీలో ఎవరికీ దక్కని గౌరవం తనకు దక్కిందన్న చంద్రబాబు విభజన అనివార్యమయితే తాను సమన్యాయం చేయమని కోరానంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఇదే  వేదికను పంచుకున్న రాహుల్  కూడా కేంద్ర విధానాలను విమర్శిస్తూనే విభజన నాటి హామీలను గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పామని.. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన బిజెపి మోసగించిందనీ చెప్పారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హోదాపై తొలి సంతకం అంటోంది. ఆ హామీని నమ్మే చేతులు కలిపానంటున్నారు చంద్రబాబు.. రాహుల్ వాగ్దానాన్ని చూపించి ఏపీలో కాంగ్రెస్ మళ్లీ బతికి బట్ట కట్టడానికి ప్రయత్నిస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్, టిడిపి ఇదే నినాదంతో జనంలోకి వెళ్ల బోతున్నాయి. కానీ ఇక్కడో మెలికుంది.. ఏపీకి హోదా రావాలంటే  కేంద్రంలో రాహుల్ ఒక్కడే అధికారం లోకి వస్తేనే సరిపోదు. ఇప్పడు చంద్రబాబు, రాహుల్ కలసి మోడీని గద్దె దింపడానికి జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేస్తున్నారు.. 

ఆ కూటమిలో తృణమూల్, డీఎంకే, జేడీఎస్, సమాజ్ వాదీ పార్టీ లాంటి పార్టీలుంటాయి. రాహుల్ ఒకవేళ గెలిస్తే ఏర్పరచేది సంకీర్ణ సర్కార్ కాబట్టి కూటమిలో పార్టీలు, ఆయా రాష్ట్రాల  అనుమతి ఉండి తీరాలి.అలాగే స్పెషల్ హోదా కోసం ఏపీలాగే ఎప్పటినుంచో చకోర పక్షుల్లా ఎదురు చూస్తూ ఫైట్ చేస్తున్న బీహార్ లాంటి రాష్ట్రాలుండనే ఉన్నాయి.. ఏపీకి హోదా ఇస్తే.. ఆ రాష్ట్రాలూ డిమాండ్ చేస్తాయి.. పైగా హోదా ఇచ్చేందుకు ఉండాల్సిన అర్హతలు ఏపీకి లేవన్నది మరో టాక్... ఇన్ని అనుమానాల మధ్య ఏపీకి అసలు హోదా వస్తుందా? హోదాపై పార్టీలు చెప్పేవి మళ్లీ ఉత్తుత్తి మాటలేనా? ఓట్ల వేట రాజకీయాల్లో భాగమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి.

English Title
babu rahul bheti

MORE FROM AUTHOR

RELATED ARTICLES