వాజపేయి పరిస్థితి విషమం

Submitted by arun on Wed, 06/13/2018 - 10:28
atal

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉంది. శ్వాసకోశ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న ఆయనను సోమవారం ఎయిమ్స్‌లో చేరగా, ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనేతలూ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎయిమ్స్‌కు తరలి వస్తున్నారు. వాజ్‌పేయి చికిత్సకు స్పందిస్తున్నారని.. యాంటీబయాటిక్స్‌ ఇస్తున్నామని.. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని మంగళవారం ఉదయం ఎయిమ్స్‌ మీడియా అధికారి ఆరతీ విజ్‌ బులెటిన్‌ విడుదల చేశారు. వాజపేయి ఆరోగ్యపరిస్థితిని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరా పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని పేర్కొన్నారు. అయితే, సాయంత్రం ఆస్పత్రి వర్గాలు ఎలాంటి బులెటిన్‌ విడుదల చేయకపోవడం గమనార్హం. వాజపేయికి ఉన్న ఏకైక కిడ్నీ, ఊపిరితిత్తులు అంతంత మాత్రంగా పనిచేస్తున్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, దేవెగౌడ, ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అశ్విన్‌ కుమార్‌ చౌబే, సాధ్వీ నిరంజన్‌ జోషి, అనంత్‌ గీతే, మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషి మంగళవారం ఎయిమ్స్‌కు వచ్చి వాజపేయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వాజపేయి ఆరోగ్యం మెరుగుపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు గాయని లతా మంగేష్కర్‌ ట్వీట్‌ చేశారు.

English Title
Atal Bihari Vajpayee’s condition remains critical

MORE FROM AUTHOR

RELATED ARTICLES