భూమికి చేరువగా వస్తున్న భారీ గ్రహశకలం

Submitted by arun on Fri, 02/09/2018 - 16:00
Asteroid 2018 CB

ఈ ఏడాది అంతరిక్షంలో వింతలు ఆసక్తి రేపుతున్నాయి. గత నెలలో బ్లూ మూన్ ఖగోళ శాస్త్రవేత్తలతోపాటు సామాన్య జనాన్ని కూడా ఆకర్షిస్తే ఇప్పుడో గ్రహశకలం మళ్లీ అంతా ఓసారి ఆకాశం వైపు చూసేలా చేస్తోంది. అవును ఓ భారీ గ్రహశకలం భూమి వైపుగా దూసుకొస్తోంది. భూ కక్ష్యకు దూరంగా ప్రయాణిస్తున్న ఈ గ్రహశకలం గతంలో ఎప్పుడు లేనంత దగ్గరగా భూమి వైపు వస్తుండటంతో ఖగోళ శాస్త్రవేత్తలు టెలిస్కోప్ లతో దానిపై పరిశోధనలకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఈ గ్రహశకలం భూమికి దగ్గరగా ఎప్పుడు రాబోతోంది.

భూమికి అత్యంత సమీపంగా ఓ గ్రహశకలం రాబోతోంది. వేలకిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ గ్రహశకలం  చాలా దగ్గరగా వచ్చేస్తోంది. నాలుగు రోజుల క్రితమే ఓ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చి వెళ్లింది. అయితే పరిమాణంలో గాని దూరంలో కానీ దానికంటే చాలా పెద్దది ఇప్పుడు భూమివైపునకు శరవేగంగా వస్తోంది.

భూమి నుంచి 64 వేల కిలోమీటర్ల దూరంలో దీని ప్రయాణం సాగుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. 15-40 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఖగోళవస్తువును 2018సీబీ అని పిలుస్తున్నారు. ఇది.. ఈ వారంలో భూమికి చేరువగా వస్తున్న రెండో గ్రహశకలం. మొదటి దాన్ని ఈ నెల 4న కనుగొన్నారు. దాన్ని 2018 సిసిగా పిలుస్తున్నారు. 15-30 మీటర్ల పరిమాణం కలిగిన ఈ ఖగోళవస్తువు ఈ నెల 6న భూమికి 1.84 లక్షల కిలోమీటర్ల దూరంలో నుంచి వెళ్లింది. దానితో పోలిస్తే 2018సీబీ.. మరింత చేరువగా వస్తుంది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4.00 గంటలకు ఇది భూమికి గరిష్ఠస్థాయిలో దగ్గరవుతుంది.

ఆ దూరం.. భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరంలో ఐదో వంతు. ఈ గ్రహశకలం చిన్నగా ఉన్నప్పటికీ, 2013లో రష్యాలోని చెల్యాబిన్స్క్‌లో విధ్వంసం సృష్టించిన ఖగోళవస్తువు కన్నా చాలా పెద్దదని నాసా శాస్త్రవేత్త పాల్‌ చోడాస్‌ పేర్కొన్నారు. ఇంత పెద్ద గ్రహశకలాలు ఏడాదికి ఒకటి, రెండు సార్లు మాత్రమే భూమికి చేరువవుతాయని తెలిపారు. అయితే ఇప్పుడు భూమికి దగ్గరగా వస్తున్న గ్రహశకలంతో ఎలాంటి ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

English Title
Asteroid passing close to Earth today – no need to worry

MORE FROM AUTHOR

RELATED ARTICLES