కర్నాటక ఎన్నికలు రికార్డు బ్రేక్ చేయనున్నాయా.?

Submitted by santosh on Tue, 05/08/2018 - 17:17
ASSEMBLY ELECTIONS IN KARNATAKA

కర్నాటకలో రెండు ప్రధాన పార్టీలకు గెలుపే ముఖ్యమవ్వటంతో అభ్యర్ధులు ఖర్చుకు ఏమాత్రం వెనకాడటం లేదు. దాంతో నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ఏరులై పారుతోంది. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులు.. ఎన్నికల సంఘం సూచించిన మొత్తానికి వంద రెట్లు ఎక్కువ ఖర్చుచేస్తున్నారు. దీంతో కన్నడ అసెంబ్లీ ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలవనున్నాయి. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుతున్న సమయంలో ఏయే పార్టీలు.. ఎక్కడెక్కడ, ఎంతెంత ఖర్చుచేయబోతున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల ఖర్చు ఎంత? అంశాలపై ఓటర్లతోపాటు పరిశీలకుల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
 
కర్ణాటక ఎన్నికలు జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలిచి 2019 సార్వత్రిక ఎన్నిలకు శక్తిని కూడగట్టుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుండగా దక్షిణభారతంలో పార్టీ మనుగడ కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దాంతో ఇరుపార్టీలు ముఖ్యనేతలను రంగంలోకి దించి విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నాయ్. కాంగ్రెస్‌ తరపున అధ్యక్షుడు రాహుల్, సీనియర్‌ నేతలు శశిథరూర్, అశోక్‌ చవాన్, ఉమెన్‌ చాందీ, సుశీల్‌ కుమార్‌ షిండేతో పాటు పలువురు కేంద్ర మాజీమంత్రులు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా సహా కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలను బీజేపీ రంగంలోకి దించింది.

కర్నాటకలో 224 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు నియోజకవర్గంలో ఒక్కో పార్టీ అభ్యర్థి రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి. కానీ బీజేపీ, కాంగ్రెస్‌లు సగటున రూ.20 కోట్ల మేర ఖర్చు చేస్తున్నాయన్నది అంచనా. రూ.30-50కోట్లు ఖర్చు చేసేవి, రూ.50-70 కోట్లు, వందకోట్లకుపైగా ఖర్చు చేసే నియోజకవర్గాలు కూడా ఉన్నట్లు సమాచారం. సగటున రూ.20 కోట్లుగా లెక్కేసినా ఒక్కోపార్టీకి రూ. 4,480 కోట్లు ఖర్చ తేలుతోంది. కొన్ని కీలక నియోజకవర్గాల ఖర్చు పరిగణనలోకి తీసుకుంటే మొత్తం రూ.5 వేల కోట్ల పైమాటే. ఇక జేడీఎస్ తో పాటు స్వతంత్ర అభ్యర్ధుల ఖర్చులను కూడా కలుపుకుంటే రూ.13 వేలకోట్లుపైనే ఉంటుందని అంచనా.

English Title
ASSEMBLY ELECTIONS IN KARNATAKA

MORE FROM AUTHOR

RELATED ARTICLES