ఏపీకి ప్రత్యేక హోదాపై సంచలన ప్రకటన

Submitted by arun on Wed, 07/04/2018 - 13:16
Arun Jaitley

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదనే విషయం స్పష్టమైంది. విభజన చట్టంలో ఉన్నవన్నీ ఏపీకి ఇచ్చేశామని, ఇక ఇచ్చేదేమీ లేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ప్రత్యేక హోదాను ఇవ్వలేమంటూ అధికారికంగా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని తెలిపింది. ఈ అఫిడవిట్ లో విశాఖ రైల్వే జోన్ ఊసే లేకపోవడం గమనించాల్సిన విషయం. ఏపీ విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయడంలేదంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ లో ఈ మేరకు స్పష్టతను ఇచ్చింది.

దుగ్గరాజపట్నం పోర్టుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం అంటూనే.. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం అంటూ కేంద్రం మెలిక పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీ ఎంత వరకు అమలు చేశారన్న విషయాన్ని కేంద్రం వెల్లడించలేదు. ఈఏపీలపై స్పష్టంగా ప్రస్తావించలేదు. విభజన జరిగిన ఏడాది ఏపీ రెవెన్యూలోటు రూ. 4116 కోట్లు మాత్రమేనని, ఇప్పటి వరకూ 3979 కోట్లు ఇచ్చామని కేంద్రం లెక్కలు చెప్పుకొచ్చింది. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చామని, యూసీలు ఇచ్చిన తరువాత మరో మూడేళ్లలో ఏడాదికి రూ. 330 కోట్ల చొప్పున వెయ్యి కోట్లు ఇస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. విభజన హామీల అమలుపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని.. పోలవరం ముంపుపై అధ్యయనం, బయ్యారం స్టీల్ ప్లాంట్, విభజిత ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో పొంగులేటి సుధాకర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకొచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం స్పష్టతనివ్వాలంటూ ధర్మాసనం ఆదేశించింది. దీంతో కేంద్రం సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

English Title
AP special status

MORE FROM AUTHOR

RELATED ARTICLES