కడప జిల్లా నాయకులకు క్లాస్ పీకిన చంద్రబాబు

Submitted by arun on Tue, 06/12/2018 - 11:52
babu

ఎంపీ సీఎం రమేష్-వరదరాజులు రెడ్డి వివాదంపై కడప జిల్లా టీడీపీ నాయకులకు చంద్రబాబు క్లాస్ పీకారు. కలిసి పనిచేసుకోకుండా కలహాలేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల మధ్య ఈ తరహా విభేదాలు కరెక్ట్ కాదన్న బాబు... రాజకీయాల్లో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే.. బీజేపీకి పట్టిన దుర్గతే పడుతుందని సూచించారు.

కడప జిల్లా టీడీపీ నాయకులు ఎంపీ సీఎం రమేష్-ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్ వరదరాజులు రెడ్డి వివాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరిద్దరి వ్యవహారంపై జిల్లా నేతలతో.. అమరావతిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. నాయకుల మధ్య ఈ తరహా విభేదాలు సరికాదన్న చంద్రబాబు.. కలిసి పనిచేసుకోకుండా కలహాలేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రమేశ్‌పై.. వరదరాజులు రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుపట్టారు. పార్టీలో సీనియర్‌ నేత గురించి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని.. వరదరాజులు రెడ్డిని బాబుప్రశ్నించారు.

ప్రతి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఐక్యత ఉండాలని బాబు సూచించారు. నాయకులు అహం తొలగించుకొని.. సమైక్యంగా పార్టీ అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో పార్టీలో ఉన్న సీనియర్లంతా.. తన మనసుకు తగ్గట్లుగా నడచుకునేవారని బాబు గుర్తుచేశారు. ఏది ఏమైనా.. టీడీపీ నాయకుల్లో క్రమశిక్షణే ముఖ్యమని గట్టిగా చెప్పారు.

టీడీపీలో ఉన్నవాళ్లంతా.. ఒకే కుటుంబంగా మెలగాలని.. పార్టీగా పద్ధతి ప్రకారం నడచుకోవాలని బాబు టీడీపీ నాయకులకు సూచించారు. రాజకీయాల్లో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే.. బీజేపీకి పట్టిన దుర్గతే పడుతుందని చెప్పారు. అంతా కలిసికట్టుగా పనిచేసి.. కడపలో 10 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో టీడీపీ గెలిచే విధంగా నాయకులంతా కృషి చేయాలని బాబు ఆదేశించారు. విభేదాలు పక్కన పెట్టి అంతా ఒక్కతాటిపై నిలిచి గెలుపునకు కృషిచేస్తామన్నారు. విభేదాల వల్ల కడప జిల్లా అభివృద్ధికి ఇబ్బంది రాకూడదనేదే తమ అభిమతమని నేతలు స్పష్టంచేశారు.

English Title
AP CM Chandrababu Naidu Fires on Kadapa TDP Leaders

MORE FROM AUTHOR

RELATED ARTICLES