పలు కీలక అంశాలపై చర్చించిన ఏపీ మంత్రివర్గం

Submitted by arun on Sat, 10/06/2018 - 10:17

ఐటీ దాడులు, కేసీఆర్‌ విమర్శల నుంచి బాబ్లీ కేసు వరకు పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినేట్‌ సమావేశంలో చర్చించారు. సుమారు రెండున్నర గంటలపాటు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రంపై అన్ని స్థాయిల్లో పోరాటం చేయాలని నిర్ణయించారు. 

ఏపీలో తీవ్ర సంచలనం సృస్టిస్తున్న ఆదాయపు పన్ను శాఖ దాడులపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరిగింది. సుమారు అరగంటకు పైగా ఐటీ దాడుల గురించి చర్చించిన కేబినేట్‌ కేంద్ర కక్షపూరితంగా వ్యవహరిస్తుందని నిర్ణయానికి వచ్చారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఐటీ దాడులు జరుగుతున్నాయని అలాంటి దాడులకు భద్రత కల్పించకూడదని ఈ సందర్భంగా కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది. సోదాలకు వచ్చే అధికారులకు భద్రత తప్పకుండా కల్పించాల్సిన నిబంధనేదీ లేదని లా సెక్రటరీ ఇచ్చిన వివరణను మీటింగ్‌లో ప్రస్తావించారు. అంతేకాకుండా ఐటీ దాడులు ఒకే సామాజికవర్గానికి చెందిన వారిపైనే జరుగుతున్నాయని మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. 

అలాగే కేసీఆర్‌ చేస్తున్న విమర్శలపైన కూడా కేబినేట్‌లో వాడీవేడి చర్చ జరిగింది. కేసీఆర్‌ తీరును తెలుగు ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఆ విమర్శలు ఇరు రాష్ట్రాల్లో అనుకూలంగా మారే అవకాశంపై చర్చ జరిగింది. అలాగే ధర్మాబాద్‌ కోర్టుకు వెళ్లాలా వద్దా అనే అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావన వచ్చింది. అయితే దీనిపై శనివారం నాడు అడ్వకేట్ జనరల్, సీనియర్ మంత్రులతో భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించారు. 

ఇక వివిధ సంస్థలు రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఆర్డీఏకు 10 వేల కోట్లు, ఆర్టీసీకి 500 కోట్ల మేర రుణ సమీకరణకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనుంది. గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితుల పునరావాసానికి 146 కోట్లు, 371 ఎంపీఈవో పోస్టుల భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా చక్కెర పరిశ్రమల పనితీరును ప్రతి నెలా సమీక్షించాలని ఆయా జిల్లా మంత్రులకు చంద్రబాబు సూచించారు. పనితీరు బాగుంటేనే చక్కెర పరిశ్రమలకు సాయం అందించాలని నిర్ణయించారు. 

English Title
AP Cabinet Take key Decisions

MORE FROM AUTHOR

RELATED ARTICLES