మంత్రివర్గ విస్తరణా..ఆ రెండు బెర్తులు ఎవరికి దక్కబోతున్నాయి...?

Submitted by arun on Thu, 04/12/2018 - 16:23
babu

ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతోందా..? మంత్రి వర్గ విస్తరణ జరిగితే భారీగా మార్పులు చేర్పులు ఉంటాయా..? లేదంటే బీజేపీ వదులుకున్న రెండు మంత్రి పదవులకే పరిమితమవుతారా..? ఆ రెండు బెర్తులు ఎవరికి దక్కబోతున్నాయి. ప్రస్తుతం టీడీపీలో ఇదే అంశంపై విపరీతమైన చర్చ నడుస్తోంది.
                
కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు రాజీనామా తర్వాత ఖాళీ అయిన వైద్యఆరోగ్య శాఖతో పాటు దేవాదాయ శాఖను కొత్త వారికి అప్పగించాలనే యోచనలో సీఎం ఉన్నారని తెలియడంతో మంత్రివర్గంలో చోటు కోసం పెద్ద తలకాయలే ఎదురు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్పీకర్ పదవి అప్పగించి తన చేతులు కట్టేశారని అసంతృప్తిగా ఉన్న కోడెల డాక్టర్ అయిన తనకే వైద్యఆరోగ్య శాఖను కేటాయించాలని గట్టిగా అడుగుతున్నట్టు సమాచారం. ఇక వరుసగా ఐదుసార్లు గెలిచినా మంత్రిపదవి దక్కలేదనే అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర..ఈసారైనా..మంత్రి పదవి దక్కకపోతుందా అని లెక్కలు వేసుకొంటున్నారు. అదే సామాజిక వర్గం నుంచి చింతమనేని ప్రభాకర్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు కూడా ముమ్మర యత్నాలు చేస్తున్నారు. గతంలో బాబు తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కూడా మంత్రి పదవి అడుగుతున్నారు.        

ఇక ఎస్టీ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి గొల్లపల్లి సూర్యారావు, బీసీ సామాజికవర్గం నుంచి కాగిత వెంకట్రావు కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ప్రస్తుతం కేబినెట్లో ముస్లింలెవరూ లేరు. గత విస్తరణలో చివరి నిమిషంలో భంగపాటుకు గురైన వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే చాంద్ బాషా ఈ సారైనా మైనారిటీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని చాంద్ బాషా కోరుతున్నట్టు సమాచారం. అలాగే ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ షరీఫ్‌లు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే బోండా ఉమ కూడా ఈసారి చంద్రబాబు కరుణిస్తారేమోనని ఎదురు చూపులు చూస్తున్నారు. 

అలాగే ఉత్తరాంధ్ర నుంచి గౌతు శ్యాం సుందర్ శివాజీ కూడా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఆరుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలచిన నెల్లిమర ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి కూడా మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు. ఎన్నికల ముందు చివరి ఏడాది కావడంతో నేతల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించడానికి ఇప్పటికే నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన సిఎం..2 మంత్రి పదవుల్ని కూడా భర్తీ చేస్తారని తెలుగు తమ్ముళ్ళు  ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ గత మంత్రివర్గ విస్తరణ సమయంలో పార్టీలో వచ్చిన తిరుగుబాట్లు, అసంతృప్తుల నేపధ్యంలో మళ్లీ అలాంటి తలనొప్పులు తెచ్చుకోవడానికి సీఎం సిద్దంగా లేరన్న ప్రచారం జరుగుతోంది. 

Tags
English Title
ap cabinet may expansion

MORE FROM AUTHOR

RELATED ARTICLES