ఏపీ బీజేపీలో చిచ్చు రాజేసిన అధ్యక్ష పదవి

ఏపీ బీజేపీలో చిచ్చు రాజేసిన అధ్యక్ష పదవి
x
Highlights

ఏపీ బీజేపీలో అధ్యక్ష పదవి చిచ్చురేపింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మి నారాయణను అధ్యక్షుడిగా ఎంపిక చేయడంపై సోము వీర్రాజు వర్గం అలక వహించింది. అధిష్టానం...

ఏపీ బీజేపీలో అధ్యక్ష పదవి చిచ్చురేపింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మి నారాయణను అధ్యక్షుడిగా ఎంపిక చేయడంపై సోము వీర్రాజు వర్గం అలక వహించింది. అధిష్టానం నిర్ణయాన్ని నిరసిస్తూ ద్వితియ శ్రేణి నేతలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. దశాబ్దాల తరబడి పార్టీలో ఉన్న తమను కాదని సమీకరణాల పేరుతో ఇతరులకు పదవులు ఎలా కట్టబెడుతారంటూ ఢిల్లీనేతలను ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మి నారాయణకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. పదవి ఆశించి భంగపడిన సోము వీర్రాజుతో పాటు ఆయన అనుచరులు, వివిధ జిల్లాల నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమంటూనే రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. వాస్తవానికి అధ్యక్ష పదవి తమకే దక్కుతుందని సోము వీర్రాజు వర్గం ఎంతో భరోసాగా ఉండేది. గడచిన నాలుగేళ్లలో టీడీపీపై దూకుడు ప్రదర్శించడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్త్రతంగా ప్రచారం చేయడంలో ముందు ఉండటం, ప్రధాని మోదీపై ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ఉండటంతో అధ్యక్ష పదవి తమకే దక్కుతుందని ఆయన వర్గం భావించింది. ఇదే సమయంలో కన్నా పార్టీ మారేందుకు సిద్ధం కావడంతో తమకు తిరుగులేదని నిర్ణయించుకున్న సమయంలో .. తమను కాదని కన్నాకే అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో అసంతృప్తి కట్టలు తెంచుకుంది. దశాబ్ధాల తరబడి పార్టీలో ఉన్న తమను కాదని ... ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఎలా కట్టబెడుతారంటూ బహిరంగ విమర్శలకు దిగారు. కన్నాను ఎంపిక చేయడంపై సోము వీర్రాజు కూడా అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తనను కావాలనే పక్కకు తప్పించారని భావించిన వీర్రాజు ఆదివారం మధ్యాహ్నాం నుంచి ఎవరికి అందుబాటులోకి రాలేదు. అధినాయకత్వం బుజ్జగించేందుకు ప్రయత్నించినా అందుబాటులో లేకపోవడంతో సాధ్యం కాలేదు. ద్వితియ శ్రేణి నాయకత్వం బహిరంగ విమర్శలకు దిగుతున్నా .. రాష్ట్రంలోని ప్రధానమైన నేతలు జోక్యం చేసుకోకపోవడం పలు ఊహగానాలకు తావిస్తోంది. అధిష్టాన నిర్ణయంపై అసంతృప్తితోనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ముహూర్తాలు, కులాల లెక్కలు, ఎన్నికల ఈక్వెషన్స్ చూసుకుని అధ్యక్ష పదవి ఎంపిక చేసినా ... అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడటంతో బీజేపీ నేతలు తలలుపట్టుకుంటున్నారు. ఆగ్రహంగా ఉన్న వారికి చల్లబడేలా చేసేందుకు తెరవెనక ప్రయత్నాలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories