ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఏపీ బ‌డ్జెట్ నివేదిక

Submitted by lakshman on Sun, 02/18/2018 - 16:02
Jana Sena chief Pawan Kalyan

సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన జాయింట్‌ ఫ్యాక్ట్స్‌ ఫైండింగ్‌ కమిటీ కోరిన విధంగానే ఏపీ ప్రభుత్వం తాజాగా ఆ కమిటీకి నివేదిక అందజేసింది. విభజనచట్టంలో పేర్కొన్న అంశాలు, ప్రత్యేక ప్యాకేజీ హామీల వివరాలు, భవిష్యత్‌లో కేంద్రం నుంచి ఏపీ పొందాల్సి వున్న లబ్ధి, ఇప్పటి వరకు కేంద్రం అందించిన ఆర్థిక సహాయం, ఇంకా అందాల్సి వున్న సాయం, ఏపీలో కేంద్రం ఏర్పాటు చేయాల్సి వున్న సంస్థలు, రాష్ట్రానికి రావాల్సి వున్న ప్రాజెక్టులు, కేంద్ర బడ్జెట్ కోసం ఏపీ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలు, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి దక్కిన ఫలాలు.... లాంటి ఎన్నో వివరాలు ఈ నివేదికలో పొందుపర్చినట్టు తెలుస్తోంది. 118 పేజీల నివేదికను ప్రభుత్వం కమిటీకి పంపించినప్పుడు అక్కడ పవన్ కల్యాణ్ అందుబాటులో లేకపోవడంతో పవన్‌ వ్యక్తిగత సిబ్బంది అయిన శ్రీకాంత్‌కు ఆ నివేదికను అందజేసినట్టు సమాచారం.

ఒకవైపు ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహాయం చేసిందని, వాటికి ఆ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చూపించడం లేదని కేంద్రం చెబుతోంటే.. కేంద్రం నుంచి తమకు ఏమీ అందలేదని ఏపీ సర్కార్ ఆరోపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో పవన్ ఏర్పాటు చేసిన కమిటీనే ఈ జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ. ఏపీ విభజన హామీలపై నిజానిజాలను తేల్చేందుకు ముగ్గురు సభ్యుల ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా జేఎఫ్‌సీ ప్రకటించింది.

హోం శాఖ మాజీ కార్యదర్శి పధ్మనాభయ్య, ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఐఏఎస్ చంద్రశేఖర్‌ ఈ ఉప సంఘంలో సభ్యులుగా వుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ ఉప సంఘం సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు.

English Title
andhra-pradesh-govt-submits-its-report-to-joint-fact-finding-committee-jfc

MORE FROM AUTHOR

RELATED ARTICLES