నాలుగేళ్ల బంధానికి తెర

Submitted by arun on Thu, 03/08/2018 - 10:02
tdpbjp

టీడీపీ, బీజేపీల నాలుగేళ్ల సంసారానికి తెరపడింది. కేంద్రం నుంచి బయటకు రావాలని సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించడంతో నాలుగేళ్లుగా కొనసాగిన బంధం బ్రేకప్ అయింది. ఈ నాలుగేళ్లలో టీడీపీ సాధించిన రాజకీయ, పరిపాలనాపరమైన ప్రయోజనాలు కూడా పెద్ద ఏమీ లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2014 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు
రాష్ట్ర విభజనతో, ఆర్థిక వనరుల కొరతతో తంటాలు పడుతున్న రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టాలంటే కేంద్రం మద్దతు తప్పనిసరి. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ కేంద్ర మంత్రివర్గంలో చేరమని ప్రధాని మోడీ అడిగిందే తడవుగా మారుమాట లేకుండా చేరింది. దీంతో రాష్ట్రానికి సంబంధించిన పనులు సానుకూలంగా చక్కబెట్టుకోవచ్చని భావించింది. 

7 ముంపు మండలాల విలీనం
 మొదట పోలవరం పనులు సజావుగా సాగేందుకు వీలుగా 7 ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్‌లో కలపటం, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు వంటి కొన్ని సానుకూల నిర్ణయాలు వచ్చాయి. కానీ రాష్ట్రంలో అభివృద్ధిని వేగవంతం చేసే ప్రత్యేక హోదా, 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు భర్తీ, ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్, కారిడార్లు, పెట్రో కెమికల్ కాంప్లెక్సుల వంటి కీలకమైన హామీల విషయంలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. 

ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించిన చంద్రబాబు 
 ఏ రాష్ట్రానికి కొత్తగా ప్రత్యేక హోదా ఇవ్వరాదన్న కేంద్ర విధానం మేరకు ప్రత్యేక ప్యాకేజీకి సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఏడాదిన్నర కిందట ఈఏపీ రూపంలో ప్రత్యేక సాయం ప్రకటన వచ్చింది. ప్రకటనైతే వచ్చింది తప్ప ఆ దిశగా నిధులిచ్చే నిర్ణయాలేవీ జరగలేదు. దీంతో బాబు ఆ సాయాన్ని నాబార్డు, హడ్కోల నుంచి ఇప్పించాలని కేంద్రాన్ని కోరారు. చివరికి అదీ కొలిక్కి రాకపోవడం, ఇతర ప్రాజెక్టుల విషయంలోనూ కదలిక లేకపోవడం అటు రాష్ట్ర ప్రజల్లో, ఇటు టీడీపీ ప్రభుత్వంలో అసంతృప్తి రాజేసింది. 

బీజేపీతో పొత్తు విషయంలో పునరాలోచన
దీనికి తోడు శాసనసభ స్థానాల పెంపు వంటి వాటిల్లోనూ కేంద్రం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో చంద్రబాబు కేంద్రం నుంచి వైదొలిగే ఆలోచనలో పడ్డారు. చివరికి బీజేపీతో పొత్తు విషయంలోనూ పునరాలోచనలో పడినట్టు సమాచారం. అందుకు అనుగుణంగా పార్టీ నేతలను, యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. గత రెండు మూడు రోజులుగా టీడీపీ శ్రేణులన్నిటిదీ ఇదే మాట. మరో రెండు మూడు నెలలు వేచి చూస్తే నిధులు, పోలవరం విషయంలో ఇబ్బంది ఉండదని చంద్రబాబు భావించారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన తక్షణమే తప్పుకోవాల్సిన పరిస్థితి తెచ్చి పెట్టింది. 

English Title
Andhra, Chandrababu Naidu pulls out TDP ministers from Modi cabinet

MORE FROM AUTHOR

RELATED ARTICLES