ఆయన సేవలు అనంతం... అనంతకుమార్‌ కు ప్రముఖుల నివాళి

ఆయన సేవలు అనంతం... అనంతకుమార్‌ కు ప్రముఖుల నివాళి
x
Highlights

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌...

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. అనంతకుమార్ మృతిపట్ల రాష్ట్రపతి, ప్రధాని తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంత్ కుమార్ ను ఊపిరితిత్తుల కేన్సర్ కబళించింది. వ్యాధికి చికిత్స నిమిత్తం ఆయన అమెరికాకు వెళ్లి వచ్చినా ఫలితం దక్కలేదు. న్యూయార్క్ లోని కేన్సర్ ఇనిస్టిట్యూట్ లో చికిత్సపొంది, గత నెల ఇండియాకు వచ్చిన ఆయన పరిస్థితి మరింతగా విషమించింది. ఆయన్ను బెంగళూరులోని శ్రీ శంకర ఆసుపత్రికి తరలించారు. అక్కడాయనకు వెంటిలేటర్ ను అమర్చిన వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు శ్రమించారు. కేన్సర్ విషమించి ఈ తెల్లవారుజామున 2 గంటలకు ఆయన చనిపోయారు.

కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంత్‌కుమార్ మృతికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ తన సంతాపం తెలిపారు. అనంత్ కుమార్‌ మృతిపట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

1959 జులై 22న జన్మించిన అనంతకుమార్ అంచెలంచెలుగా ఎదిగారు. ఆర్.ఎస్.ఎస్, ఏబీవీపీలో పని చేసి బిజెపి ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1996 నుంచి బెంగళూరు దక్షిణ నియోజవకర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆరుసార్లు ఎంపీ అయిన ఆయన 2014 మే కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా పని చేశారు. 2016 జులై నుంచి పార్లమెంటరీ వ్యవహారాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాజ్ పేయి హయాంలో పౌర విమానయాన మంత్రిగా అనంతకుమార్ పని చేశారు. ఎన్.డి.ఏలో పర్యాటక , క్రీడా యువజన వ్యవహారాల శాఖ , పట్టణాభివృద్ధి శాఖల మంత్రి గా పని చేశారు.

ఎమర్జెన్సీ సమయంలో ఏబీవీపీ సభ్యుడిగా ఉన్న అనంతకుమార్ జైలుకు కూడా వెళ్లారు. ఏబీవీపీలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన జాతీయ స్థాయి పదవులు నిర్వహించారు. 2003లో కర్ణాటక బిజెపి శాఖ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఆయన నేతృత్వంలో బిజెపి 2004 ఎన్నికల్లో కర్ణాటక అసెంబ్లీ లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అత్యధికంగా ఎంపీ స్థానాలు కూడా కైవసం చేసుకుంది. బిజెపి జాతీయ కార్యదర్శిగా మధ్యప్రదేశ్ , బీహార్, చత్తీస్ గఢ్ లో పార్టీ నిర్మాణానికి అనంతకుమార్ విశేష కృషి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories