అమరావతి టార్గెట్‌గా అమిత్‌షా ఎందుకు మాట్లాడారు?

అమరావతి టార్గెట్‌గా అమిత్‌షా ఎందుకు మాట్లాడారు?
x
Highlights

కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయిన విభజన హామీల రచ్చ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. అమరావతి నిర్మాణం అంగుళమైనా కదలలేదనీ, పనులు చేయకుండా, యూసీలు...

కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయిన విభజన హామీల రచ్చ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. అమరావతి నిర్మాణం అంగుళమైనా కదలలేదనీ, పనులు చేయకుండా, యూసీలు చూపించకుండా నిధులెలా అడుగుతారనీ అమిత్ షా చేసిన కామెంట్లు టిడిపిలో కాక రాజేశాయి. మహానాడు వేదికగా ఈ కామెంట్లపై స్పందించిన చంద్రబాబు.. యూసీల వివాదాన్ని మళ్లీ కెలికారు.. అన్నింటికీ యూసీలిచ్చినా ఇవ్వలేదని బొంకుతున్న బిజెపిని ప్రజలే మట్టి కరిపిస్తారన్నారు. అసలు యూసీలడగడానికి అమిత్ షా ఎవరంటూ రివర్స్ అటాక్ చేశారు..

అమరావతి వేదికగా మరోసారి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్టీఆర్ జన్మదినం రోజున మహానాడు వేదికగా టిడిపి తన స్వరానికి పదును పెట్టింది.. మహానాడు సభకు తరలి వచ్చిన అశేష టిడిపి అభిమానుల సాక్షిగా చంద్రబాబు తన మాటల దూకుడు పెంచారు.. అవడానికి అది పార్టీ పండగే అయినా.. దానిని తమ భవిష్య రాజకీయ ఎజెండాను నిర్దేశించుకునే వేదికగా మలిచారు. బిజెపి సహాయ నిరాకరణను మరోసారి సభాముఖంగా ప్రస్తావించి అమిత్ షా ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.. దాంతో కేంద్రం, రాష్ట్రం మధ్య మరోసారి యూటిలైజేషన్ సర్టిఫికెట్ల పంచాయితీ మళ్లీ తెరపైకి వచ్చింది.వివరాల్లోకి వెడితే అమరావతి కోసం చంద్రబాబు ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని అమిత్ షా నిన్న ఢిల్లీలో ఆరోపించారు. ఇప్పటి వరకూ రాజధానికి 2,100 కోట్లు ఇచ్చామని, ఇచ్చిన వాటికే లెక్కలు లేనప్పుడు కొత్తగా నిధులెలా ఇస్తామని ప్రశ్నించారు.అమరావతి మ్యాపులు ఇంకా ఇప్పటికీ సింగపూర్ లోనే ఉన్నాయని, ఇంతవరకూ ఒక్క భవనానికీ టెండర్ పిలవలేదని విమర్శించారు.. చేసిన పనులకు యూసీలిమ్మంటే వాటినీ ఇవ్వకుండానే ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారన్నారు.

చంద్రబాబు చేసుకుంటున్న సెల్ఫ్ సర్టిఫికేషన్ చెల్లుతుందా అనీ ఎద్దేవా చేశారు. గుజరాత్ లో కేంద్ర నిధులతో ఏం నిర్మించడం లేదని , అంతా ఆ రాష్ట్రం సొంత ఖర్చులతోనే నిర్మించుకుంటోందనీ అమిత్ షా వివరించారు. ఈ వాస్తవాలను చంద్రబాబు వక్రీకరిస్తున్నారన్నారు.బిజెపి అధికారం చేపట్టి నాలుగేళ్లయిన సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అమిత్ షా వ్యాఖ్యలను మహానాడు వేదికగా చంద్రబాబు తిప్పి కొట్టారు.రాష్ట్రాలు కేంద్రానికి బానిసలు కాదన్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బిజెపికి తగిన గుణపాఠం చెబుతామన్నారు.. కేంద్రం ఇప్పటి వరకూ విదిల్చినవి కేవలం1700 కోట్లు మాత్రమేనని.. ప్రతీ పనికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపించామనీ వివరించారు. జాతీయ స్థాయి నేతలు కాస్త హుందాగా ఉండాలని సూచించారు.నిధులివ్వకుండానే ఇచ్చినట్లు చెప్పడం, యూసీలిచ్చినా ఇవ్వలేదని చెప్పడం అమిత్ షా సంకుచిత వైఖరికి నిదర్శనమన్నారు. అసలు రాష్ట్రాల నిధుల విషయంపై అమిత్ షా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న వివాదంపై అమిత్ షా ఇష్టాను సారం వ్యాఖ్యానిస్తున్నారన్నారు. మొత్తం మీద బిజెపిపై యుద్ధానికి మహానాడు వేదికగా టిడిపి కత్తులు నూరుతోంది. విభజనతో గాయపడిన రాష్ట్రానికి హోదా ఇస్తామని ఆశ పెట్టి.. ఆ తర్వాత లేదని, కాదనీ చెప్పడం దారుణమన్న చంద్రబాబు.. ఏపిలో విపక్షాల ఓటమే ధ్యేయంగా తమ ప్రచారం సాగుతుందని చెప్పారు. మరోవైపు అటు అమిత్ షా కూడా ఏపిలో బిజెపి ఒంటరి పోరాటమే చేస్తుందని.. కచ్చితంగా గెలిచి తీరుతుందని చెప్పారు.. పార్టీల మధ్య వాతావరణం చూస్తుంటే.. ఈ సారి ఎన్నికల్లో ఏపి హోదా, విభజన హామీలే ప్రధాన ఎజెండాగా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒకరు నిధులిచ్చామంటారు.. మరొకరు ఇవ్వలేదంటారు.. కేంద్రం, రాష్ట్రం మధ్య ఈ పంచాయతీ తెగేదెక్కడ?

Show Full Article
Print Article
Next Story
More Stories