తెలంగాణలో అమిత్ షా టూర్....కీలక అంశాలపై రివ్యూ చేయనున్న అమిత్ షా

Submitted by arun on Wed, 07/11/2018 - 11:15
Amit Shah

చాలా రోజుల తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఇందుకు రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. షా పర్యటనను పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు. పార్లమెంటు స్థానాల రివ్యూతో పాటు పుల్ టైమర్ల మీటింగ్‌తో షా ఒక్కరోజు పర్యటనలో బిజీగా గడపనున్నారు.

తెలంగాణలో అప్పుడూ ఇప్పుడూ అంటూ వాయిదా పడుతున్న అమిత్ షా టూర్ మొత్తానికి ఫిక్స్ అయ్యింది. షెడ్యూల్ ఒకరోజే అయినా కీలక అంశాలపై షా రివ్యూ చేయనున్నారు. ఇందుకు తగ్గట్లు పార్టీ నాయకులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ నెల 13న అమిత్ షా ఒకరోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ వస్తున్నారు. జాతీయ అధ్యక్షుడి వన్ డే విజిట్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

అమిత్ షా ఒక్క రోజు పర్యటనలో 3 రకాల కార్యక్రమాలు ఉండేలా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారు. శంషాబాద్ దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో శక్తి కేంద్రాల ఇంచార్జిలతో సమావేశం ఉంటుంది. తర్వాత విస్తారక్‌లుగా పిలిచే అసెంబ్లీ, పార్లమెంట్ ఫుల్‌టైమర్లతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇది పూర్తైన తర్వాత పార్టీ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ వేసుకొని వారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

టూర్ షెడ్యూల్ ఇలా ఉంటే తెలంగాణలో పార్టీ బలోపేతంపై కూడా అమిత్ షా స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, వివిధ పార్టీల బలా బలాలపై కూడా షా కోర్ కమిటీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో పార్టీకి ఉన్న బలంపై రివ్యూ చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ రకమైన వ్యూహం అనుసరించాలన్న దానిపై రాష్ట్ర నాయకులతో చర్చించనున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్రంలో వాటి అమలు తీరుపై పార్టీ జాతీయాధ్యక్షునికి నివేదిక ఇవ్వనుంది రాష్ట్ర నాయకత్వం.

ఇదిలా ఉంటే తెలంగాణలో బీజేపీ చేపట్టిన జనచైతన్యయాత్ర విశేషాలు, ఇతర పార్టీల నుంచి చేరికలపైనా షా చర్చించే చాన్స్ ఉంది. ఇందుకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇప్పటికే రిపోర్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల మోడీ పాలనపై విశేష్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ప్రముఖులతో అమిత్ షా భేటీకానున్నారు. షా టూర్ తమలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుందని బీజేపీ శ్రేణులు చెప్తున్నారు.

English Title
Amit Shah to review poll preparations in Telangana on July 13

MORE FROM AUTHOR

RELATED ARTICLES