తెలంగాణలో ముందస్తు ప్రచార వేడి ...మజ్లిస్ కంచుకోట నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

Submitted by arun on Sat, 09/15/2018 - 10:01

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి కాషాయదళం సిద్ధమయ్యింది. మజ్లిస్‌ కంచుకోట హైదరాబాద్‌ పాతబస్తీ నుంచే కమల దళపతి అమిత్‌షా శంఖారావం పూరించబోతున్నారు. లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని పాలమూరు నుంచి ఎన్నికల ప్రచారం షురూ చేయనున్నారు. ముందస్తు ఎన్నికలకు రంగంసిద్ధమయ్యాక తొలిసారి తెలంగాణకు వస్తుండటంతో అమిత్‌షా టూర్‌‌పై భారీ ఆశలే పెట్టుకున్నారు కమలనాథులు. 

ముందస్తు ఎన్నికలతో తెలంగాణపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రత్యేక దృష్టిపెట్టారు. 20 రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేసినట్లుగానే తెలంగాణలోనూ బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ బలోపేతం, అధికారమే లక్ష్యంగా కనీసం 50 భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.

ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి రానున్న అమిత్‌షా అక్కడ్నుంచి నేరుగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. ముఖ్యనేతలతో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారు. అనంతరం లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని రోడ్డుమార్గంలో మహబూబ్‌నగర్ బయల్దేరి వెళ్తారు. సాయంత్రం జరిగే మహబూబ్‌నగర్‌ సభావేదికగా బీజేపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. తెలంగాణలో బీజేపీ వైఖరి ఏంటి? అధికారంలోకి వస్తే ఏం చేస్తారో? క్లారిటీ ఇవ్వనున్నారు.

మహబూబ్‌నగర్‌ సభ తర్వాత శంషాబాద్‌ సమీపంలోని కొత్తూరులో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా ఇన్‌ఛార్జులు, జిల్లా అధ్యక్షులతో సమావేశమై మరోసారి ఎన్నికల వ్యూహాలపై అమిత్‌షా దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు మరింత మేలు జరుగుతుందనే నినాదంతో ముందుకెళ్లనున్నారు. ఇక పాలమూరు సభ తర్వాత మరో 15రోజుల్లో కరీంనగర్‌లో అమిత్‌షాతో భారీ బహిరంగ సభకు ప్లాన్‌ చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.

English Title
All Arrangements Set For BJP Shankaravam Sabha

MORE FROM AUTHOR

RELATED ARTICLES