అమరావతిలో ఆళ్లగడ్డ పంచాయతీ

అమరావతిలో ఆళ్లగడ్డ పంచాయతీ
x
Highlights

ఆళ్లగడ్డ పంచాయితీ అమరావతికి చేరింది. మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డిల వ్యక్తిగత కక్షలను టీడీపీ అధినాయకత్వం సీరియస్‌గా...

ఆళ్లగడ్డ పంచాయితీ అమరావతికి చేరింది. మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డిల వ్యక్తిగత కక్షలను టీడీపీ అధినాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. పార్టీ పిలుపు మేరకు సైకిల్ యాత్రలో ఉన్న తనపై జరిగిన రాళ్ల దాడి వెనుక అఖిలప్రియ వర్గీయులు ఉన్నారన్న సుబ్బారెడ్డి ఆరోపణలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎంత నచ్చజెప్పినా ఇద్దరూ వినడం లేదని ఆగ్రహించిన బాబు ఈ మధ్యాహ్నం ఇద్దరికీ క్లాస్ తీసుకోనున్నారు.

ఆళ్లగడ్డ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్తరంగా మారాయి. మంత్రి అఖిల‌ప్రియ, ఏపీఆర్‌ఐసీ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య విభేదాలు రాళ్ల దాడి చేసుకొనే స్థాయికి వెళ్లాయి. సైకిల్ యాత్ర చేస్తున్న సుబ్బారెడ్డిపై కొందరు రాళ్లు విస‌ర‌డంతో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అఖిల‌ప్రియ వ‌ర్గీయులే దాడి చేశార‌ని అందుకు ఆధారాలు ఉన్నాయని ఏవీ ఆరోపించారు. సుబ్బారెడ్డిపై దాడులు చేయాల్సిన అవసరం తనకులేదని, తన తల్లిదండ్రుల ఆశయసాధనే ధ్యేయంగా పనిస్తున్నానని మంత్రి అఖిలప్రియ చెప్తున్నారు. ఏవీపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని అన్నారు.

భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఒకప్పుడు ఏవీ సుబ్బారెడ్డి అత్యంత సన్నిహితుడు. భూమా మరణానంతరం అఖిలప్రియ, సుబ్బారెడ్డి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఇద్దరి మధ్య సయోధ్యకి పార్టీపరంగా చాలా ప్రయత్నాలు జరిగాయి.
సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీ కుదిర్చినా ఇద్దరూ తమ పట్టుదల వీడటం లేదు.

తాజాగా సుబ్బారెడ్డిపై జరిగిన దాడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. రాళ్లదాడి ఘటన పై పార్టీ ముఖ్యుల వద్ద ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీఎం, ఇలాంటి ఘటనలు పార్టీకి నష్టం చేస్తాయని పార్టీ నేతలతో అన్నట్లు సమాచారం. ఎన్నిసార్లు చెప్పినా ఇరువురు నేతలూ సమన్వయంతో పని చేయడం లేదని అన్నట్టు తెలిసింది.

ఆళ్లగ‌డ్డ అసెంబ్లీ సీటు కోసం ఏవీ సుబ్బారెడ్డి వ‌ర్సెస్ అఖిల ప్రియగా జ‌రుగుతున్న పోరుకు ఫుల్ స్టాప్ పెట్టాల‌ని బాబు నిర్ణయించుకున్నార‌ని అందుకే వారికి అమరావతికి రమ్మని పిలుపులు అందాయ‌ని అంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశంపైనే అందరి దృష్టి నెలకొనిఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories