కేసీఆర్ ఫ్రెండ్లీ షాక్ ...డిసెంబర్‌లో ఎవరి అవసరం ఎవరికి వస్తుందో...

Submitted by arun on Sat, 09/08/2018 - 09:04

ఎంఐఎం తమ మిత్రపక్షమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజా మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. కర్ణాటకలో జేడీఎస్‌కు కింగ్‌మేకర్‌ స్థాయి నుంచి కింగ్‌గా మారే అవకాశం వచ్చిందని, తెలంగాణలో తమకు కూడా అలాంటి అవకాశం రావొచ్చునని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కుమారస్వామి సీఎం అయినప్పుడు.. తెలంగాణలో ఎంఐఎం అభ్యర్థి ఎందుకు సీఎం కాలేడని ప్రశ్నించారు.  డిసెంబర్‌లో ఎవరి అవసరం ఎవరికొస్తుందో చూద్దామని అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. 

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. మాటల యుద్ధం మొదలైంది. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి మీడియా సమావేశంలోనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని బిగ్గెస్ట్ బఫూన్ అంటూ సంచలనానికి తెరతీశారు. హుస్నాబాద్ సభా వేదికగా కాంగ్రెస్‌పై కేసీఆర్ మాటల దాడి పెంచారు. ఇదే సమయంలో ఇతర పార్టీలు కూడా కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీపై మాటల దాడిని ప్రారంభించాయి.

బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకొని కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తెరతీశారని ఏపీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేయగా తాజాగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కుమారస్వామి సీఎంగా కాగాలేనిది తామెందుకు సీఎం కాలేమని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. ఎవరి అవసరం ఎవరికి వస్తుందో చూద్దామంటూ ఒకరకంగా కేసీఆర్‌కు సవాల్ విసిరారు. 

ఓవైపు ఎంఐఎం తమకు మిత్రపక్షమని కేసీఆర్ చెబుతుండగా.. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముందస్తుకు వెళ్లి కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని అక్బరుద్దీన్ సోదరుడు, ఎంపీ అసదుద్దీన్ ప్రశంసలు కురిపించగా.. అక్బరుద్దీన్ అందుకు పూర్తి విరుద్ధంగా వెళ్లడం టీఆర్‌ఎస్ శ్రేణులను షాక్‌కు గురిచేస్తోంది. 

అయితే.. ఇదంతా ఎన్నికల స్టంట్‌లో భాగమేనని, ప్రచారంలో దిగిన తర్వాత ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడి తిరిగి సీట్ల సర్దుబాటు చేసుకోవడం పరిపాటేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరి కేసీఆర్ సీటుకు ఎసరు పెట్టేలా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో ఈసారి టీఆర్‌ఎస్,ఎంఐఎం పొత్తు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. 

Tags
English Title
Akbaruddin Owaisi Sensational Comments On CM KCR

MORE FROM AUTHOR

RELATED ARTICLES