ఎన్నికల వేళ కలకలం రేపుతున్న అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు

ఎన్నికల వేళ కలకలం రేపుతున్న అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు
x
Highlights

తాను సీఎం ఎందుకు కాకూడదంటూ గతంలో వ్యాఖ్యానించి కలకలం రేపిన ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం దయ ఉంటేనే ఎవరైనా...

తాను సీఎం ఎందుకు కాకూడదంటూ గతంలో వ్యాఖ్యానించి కలకలం రేపిన ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం దయ ఉంటేనే ఎవరైనా సీఎంగా ఉండగలరని లేదంటే పక్కకు తప్పుకోవాల్సిందేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అక్బరుద్దీన్ ఎంఐఎం తలుచుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రి చేయగలదని అన్నారు. చంద్రబాబు మొదలు నేటి కేసీఆర్ వరకు అందరూ ఎంఐఎం దగ్గర తల వంచిన వారేనని అన్నారు. తాను బాద్షాని కాదనీ కానీ కింగ్ మేకర్‌ని మాత్రం తానే అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 11వ తేదీన ఎవరిని అధికార పీఠం మీద కూర్చోబెడతామో చూడండని కార్యకర్తలను ఉద్దేశించి అక్బరుద్దీన్ అన్నారు.

తాను కింగ్ మేకర్‌నని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వేళ కలకలం రేపుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎంఐఎంని కింగ్ మేకర్‌ని చేసేలా ఉంటాయా అనే చర్చ ప్రారంభమైంది. గతంలో కూడా అక్బరుద్దీన్ తెలంగాణ ముఖ్యమంత్రిని అవుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కుమార స్వామి సీఎం కాగా లేనిది అక్బరుద్దీన్ ముఖ్యమంత్రి కాలేడా అని ప్రశ్నించారు. ఆయన మాటలు అప్పట్లో సంచలనంగా మారాయి. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టించాయి. తాను సీఎం అవుతానంటూ అక్బరుద్దీన్‌ అనడంపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. ఏడు సీట్లు గెలుచుకున్న వారు ఎలా సీఎం అవుతారని ప్రశ్నలు సంధించారు.

నిన్న నిర్మల్ ఎన్నికల ప్రచార సభలో మజ్లిస్ పార్టీ తమ మిత్రపక్షమని తొలిసారి కేసీఆర్ బహిరంగంగా అంగీకరించారు. రెండు పార్టీల మధ్య స్నేహం ఉందని కలసి పని చేస్తున్నామని ప్రకటించారు. ఆంధ్రా రాజకీయాలను తట్టుకుని ఎంఐఎం మనుగడ సాగించిందని పొగడ్తలు కురిపించారు. అంతేకాదు ఎంఐఎం లౌకిక పార్టీ అని కూడా కేసీఆర్ కితాబునిచ్చారు.

ఎంఐఎం గురించి కేసీఆర్ ప్రశంసలు కురిపించిన కొద్దిసేపటికే అక్బరుద్దీన్ తానే కింగ్ మేకర్‌నని వ్యాఖ్యానించడం విశేషం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ , ప్రజాకూటమి మధ్య హోరా హోరీ పోటీ ఉందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి, అక్బరుద్దీన్ కింగ్ మేకర్ కావాలంటే తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడాలి. ఎంఐఎం మద్దతుతోనే ఎవరైనా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి రావాలి. మరి అక్బరుద్దీన్ జోస్యం ఎంతవరకు ఫలిస్తుందో ఆయన చెప్పినట్లుగానే డిసెంబర్ 11 న తేలుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories