మీడియా ముందే వెక్కివెక్కి ఏడ్చిన బీజేపీ నేత

Submitted by arun on Tue, 04/17/2018 - 17:12
Gulbarga

తానొకటి తలిస్తే పార్టీ అధిష్ఠానం మరొకటి తలిచింది. చివరి నిమిషం వరకూ ఊరించిన టిక్కెట్ చివరి నిమిషంలో ముఖం చాటేసింది. దీంతో మీడియా కెమెరాల ముందే ఆ బీజేపీ నేత వెక్కివెక్కి ఏడ్చారు. చేతులతో ముఖాన్ని కప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యాడు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ, కాంగ్రెస్ ప్రకటించగా, ఇరు పార్టీల నుంచి టిక్కెట్లు రాని ఆశావహులు పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. గుల్బర్బాకు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ శశిల్ జి.నమోషి అయితే తనకు టిక్కెట్ రాకపోవడంతో మీడియా ముందే వలవలా ఏడ్చేశారు.

12 ఏళ్లపాటు ఎమ్మెల్సీగా, గుల్బార్గా నగర డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన బీజేపీ నేత శశీల్‌ జీ నామోషీ  తొలుత ‘గుల్బార్గా దక్షిణ్‌’  అసెంబ్లీ టికెట్‌ ఆశించారు. అయితే  బీజేపీ ఆ సీటుని దత్తాత్రేయ పాటిల్‌ రేవూర్‌కు కేటాయించింది. పార్టీ ప్రకటించే రెండో జాబితాలోనైనా తనకు టికెట్‌ లభిస్తుందని ధీమాగా ఉన్న శశీల్‌ తన అనుచరగణంతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. ‘గుల్బార్గా ఉత్తర్‌’  టికెట్‌ను ఇస్తారని అనుకున్నారు. కానీ, ఆయనకు రెండో జాబితాలోనూ నిరాశే మిగిలింది. సోమవారం విడుదలైన రెండో జాబితాలో బీజేపీ ఆ స్థానాన్ని సీబీ పాటిల్‌కు కేటాయించింది.

దాంతో శశీల్‌ తీవ్ర మనస్థాపం చెందారు. తన ఆవేదనను వెళ్లగక్కేందుకు పత్రికా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతుండగానే.. దుఃఖం పొంగుకురావడంతో కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడే ఉన్న తన సహచరులు, పాత్రికేయులు ఆయనను సముదాయించి అర్థాంతరంగా సమావేశాన్ని ముగించారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

English Title
after candidate list announcement bjp leader gulbarga breaks down camera

MORE FROM AUTHOR

RELATED ARTICLES