వాట్సాప్‌లో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారా....బీకేర్‌ఫుల్

x
Highlights

మంచి ఇంట్లోకి రాకముందే, చెడు ఊరంతా తిరిగేసి వస్తుందని ఒక సామెత. వాట్సాప్‌లో వచ్చిపడే మెసేజ్‌లు ఫేకా, రియలా అని తెలియకముందే, ఫార్వర్డ్‌లు అవుతూ,...

మంచి ఇంట్లోకి రాకముందే, చెడు ఊరంతా తిరిగేసి వస్తుందని ఒక సామెత. వాట్సాప్‌లో వచ్చిపడే మెసేజ్‌లు ఫేకా, రియలా అని తెలియకముందే, ఫార్వర్డ్‌లు అవుతూ, సమాజంలో కల్లోలం రేపుతున్నాయి. హింసను ప్రేరేపిస్తున్నాయి. కానీ ఇక నుంచి ప్రతి మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేయడం కుదరదు. ఒకవేళ చేసినా, ఫార్వర్డ్ చేసినవారికి చిక్కులు తప్పవు. కేంద్ర ప్రభుత్వం ఆదేశంతో, వాట్సాప్‌లో ఫీచర్స్‌ను మార్చేస్తోంది దాని యాజమాన్యం. ఇంతకీ ఆ ఫీచర్స్‌ ఏంటి...ఇక్కడితోనైనా ఫేక్‌న్యూస్‌కు చెక్ పడుతుందా?

అదిగో పులి, ఇదిగో తోక ఇదిగో మెసేజ్ అదిగో ఫార్వర్డ్. అది నిజమో, అబద్దమో, కుట్రనో పుట్రనో ఏమాత్రం బుర్రకు పని చెప్పకుండా వాట్సాప్‌లో ఫార్వర్డ్. ఇదే పని అన్నట్టుగా ఫేక్‌న్యూస్‌లు క్షణాల్లో వైరల్‌ అవుతున్నాయి. కానీ సమాజంలో అలజడి సృష్టిస్తాయని మాత్రం, స్మార్ట్‌గా అర్థం చేసుకోలేకపోతున్నాడు నేటి స్మార్ట్‌‌ఫోన్‌ మ్యాన్. ఇప్పటి నుంచి అంత సీనుండదు.

వాట్సాప్ మెసేజింగ్ సేవల దుర్వినియోగంపై, కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. పార్థిగ్యాంగ్ తిరుగుతోందని, పిల్లల కిడ్నాప్‌ ముఠాలు చక్కర్లు కొడుతున్నాయని, మతకల్లోలాలు చెలరేగాయంటూ ఫార్వర్డ్ అవుతున్న వాట్సాప్‌ మెసేజ్‌లు, చివరికి హత్యలకు దారి తీస్తున్నాయని వాట్సాప్‌‌కు స్పష్టం చేసింది. బాధ్యతారహితమైన మెసేజ్‌ల వ్యాప్తిని అడ్డుకొనేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చింది వాట్సాప్‌ యాజమాన్యం. ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్‌తో తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టేందుకు తాను తీసుకుంటున్న చర్యలను కేంద్రానికి వివరించింది. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారం, వదంతులను ప్రభుత్వాలు, పౌర సమాజం, ఐటీ సంస్థలు కలిసికట్టుగా పని చేయడం ద్వారా ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. వదంతుల వ్యాప్తిని అరికట్టడానికి ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపింది.

సమాచారంపై నియంత్రణలో ప్రజల బాధ్యులను చేయడం ఒక పద్ధతయితే, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం మరో పద్ధతి. మెసేజ్ వచ్చినప్పుడు అది సరైందో కాదో గ్రూప్ అడ్మిన్ నిర్దారించుకున్న తర్వాతే మిగిలిన గ్రూప్ మెంబర్స్‌కు వెళ్లేలా నియంత్రించే వ్యవస్థను త్వరలో ప్రవేశపెడతామని తెలిపింది. కేవలం గ్రూప్‌ అడ్మిన్‌కు మాత్రమే మెసేజ్‌లు పోస్ట్‌ చేసే అధికారం ఇప్పటికే అమల్లోకి తెచ్చింది. ఈ ఆప్షన్ సాయంతో తప్పుడు వార్తల వ్యాప్తిని నిరోధిస్తామని వాట్సాప్‌ తెలిపింది.

అంతేకాదు ఓ మెసేజ్ వచ్చినప్పుడు అది మరొకరి నుంచి వచ్చిన సమాచారాన్ని ఫార్వార్డ్ చేశారా లేదంటే స్వయంగా టైప్ చేసి పంపారా కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పించనుంది. దీని వల్ల అది తప్పుడు సమాచారం అని తెలిస్తే మిగిలిన సభ్యులకు ఫార్వార్డ్ చేయకుండా నియంత్రించ వచ్చని తెలిపింది. నకిలీ వార్తలు, వదంతుల్ని అరికట్టేందుకు ప్రొడక్ట్‌ కంట్రోల్, డిజిటల్‌ లిటరసీ, వార్తల్లోని నిజాలను తనిఖీ చేయడం వంటి పద్ధతుల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది వాట్సాప్‌. పోలీసులు చట్టబద్ధమైన కారణాలతో అడిగినపుడు దర్యాప్తులో సహకరిస్తున్నామని చెప్పింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులు ఎలా ఉన్నాయంటే, జనాలు వాటి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. రాత్రి పక్కూళ్లో ఎవరో పసిపిల్లోడిని చంపేసి మెదడు తినేశాడంటా నిన్న రాత్రి టౌన్‌లో పార్ధీ గ్యాంగ్‌ దిగిందంటా పిల్లల్ని చంపి కిడ్నీలు, మెదడు తినేయాలని తిరుగుతున్నారంటా అంటూ మావోడొకడు ఫోను చేశాడని కొందరు, అంతేకాదు నిన్న పక్క జిల్లాలో పార్ధీ గ్యాంగ్‌ని పట్టుకోబోతుంటే పోలీసు పీక కోసేసి పారిపోయారంటా అంటూ మరికొందరు, కొన్ని రోజులు, వారాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవర్నీ కదిపినా ఇవే అనుమానాలు, చర్చలు. జనాలను గజగజలాడించిన వదంతులివి.

పార్ధి గ్యాంగ్‌ అనే పిల్లల కిడ్నాప్ ముఠా, వచ్చినట్లు, పసి పిల్లల్ని ఆ గ్యాంగ్‌ అతి క్రూరంగా చంపి, వారి అవయవాలను పీక్కు తింటున్నట్లు, అందుకోసం అర్ధరాత్రి తలుపుల వద్దకు వచ్చి పిల్లుల్లా అరవటం కుక్కల్లా మొరగటం పసి పిల్లల్లా ఏడ్వటం వంటి ఫొటోలు, వీడియోలను కొంత మంది వాట్సాప్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం సాగింది. అవి చూసిన అనేక మంది వాటిని ఇతరులకు షేర్‌ చేస్తుండటంతో ఏపీ, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఆ వీడియోలు, ఫొటోలు చూసిన తల్లిదండ్రులు వణికిపోయారు. పిల్లలను బయటకు పంపాలంటేనే భ‍యపడిపోయారు. అంతేకాదు, కాస్త పిచ్చిపిచ్చి చూపులు చూసినా, హిందీలో మాట్లాడినా, పార్థి గ్యాంగ్‌ అన్న అనుమానంతో, చితక్కొట్టేశారు. కానీ పార్ధి గ్యాంగ్‌ సంచరిస్తుందనడానికి, ఇంత వరకు ఎలాంటి దాఖలాలు లేనే లేవు. కేవలం వదంతులు మాత్రమేని పోలీసులు నిర్ధారించారు.

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం చేంగల్ గ్రామం. బీహార్ దొంగలు అనే అనుమానంతో ఇద్దరు గిరిజనులకు దేహశుద్ధి చేశారు గ్రామస్థులు. వీరిలో ఒకరు చనిపోయారు. కానీ బాధితులు పక్కనే ఉన్న ఎంజీ తండాకు చెందిన గిరిజనులని తర్వాత తెలిసింది. అయితే అంతలోనే ప్రాణాలను గాల్లోకలిపేశారు గ్రామస్థులు. వదంతుల వైపరిత్యమిది. ఇక నల్గొండలో మరో దారుణమిది. వాట్సాప్‌లో పిల్లల కిడ్నాప్, దొంగల ముఠా అని వస్తున్న పుకార్లను నమ్మిన జనం, బాలకృష్ణ అనే వ్యక్తిని భయానకంగా కొట్టి చంపేశారు.
గుంటూరు జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో అమానుషమిది. మంచి చెడ్డా ఆలోచించలేదు. ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో, తెలుసుకోలేదు. పిల్లలను అపహరించే ముఠాగా అనుమానముంటే, కనీసం పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు. ఏమాత్రం ఇంగిత జ్ణానం లేకుండా, తోటి ప్రయాణికురాలిని, పాశవికంగా కొట్టారు. ప్రయాణికులు. ఇక భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బూర్గంపహాడ్ మతిస్థిమితం లేని వ్యక్తిని దొంగగా భావించి, కొట్టారు జనం.

ఇలాంటి పుకార్లు ఎక్కడ మొదలయ్యాయో తెలీదు. ఎలా ముగుస్తాయో అర్థం కాదు. ఎవరు చేశారో తెలీదు. ఎవడో పైశాచికానందం కోసం వాట్సాప్‌లో షేర్ చేస్తూ షేక్ చేశాడు. కేవలం ఇలాంటి మెసేజ్‌లే కాదు, కులంమతం ప్రాంతం వంటి సున్నితమైన అంశాల్లో రెచ్చగొట్టే మెసేజ్‌లు వాట్సాప్‌లలో ఫార్వర్డ్‌ అవుతున్నాయి. సమాజంలో అలజడి రేపుతున్నాయి.

ఫేక్‌న్యూస్‌ కట్టడికి కేంద్రం ఆదేశించడంతో, ఆలస్యంగానైనా మేల్కొంది వాట్సాప్‌ యాజమాన్యం. రకరకాల మార్పులు చేస్తూ, చర్యలు తీసుకుంటామని కేంద్రానికి హామినిచ్చింది. సో, చేతిలో స్మార్ట్‌‌ఫోన్‌ ఉంది కదాని ఏవంటే అవి మెసేజ్‌లు ఫార్వర్డ్ చేయడం కుదరదు. ఒకవేళ చేసినా, కటకటాలు లెక్కించాల్సిందే. బీకేర్‌ఫుల్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories