హైదరాబాద్‌ చింతల్‌లో దారుణం...టీచర్‌పై యాసిడ్ దాడి

Submitted by arun on Fri, 08/03/2018 - 13:00

హైదరాబాద్‌ చింతల్‌లో దారుణం జరిగింది. ఓ టీచర్‌పై దుండగుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని  చింతల్‌లో  జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.  తీవ్ర గాయాలపాలైన  ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

చింతల్ కాకతీయ నగర్‌లో నివసిస్తున్న సూర్యకుమారి  స్థానిక ‘సంస్కార్’ పాఠశాలలో గత పదేళ్లుగా  టీచర్‌గా పనిచేయడంతో పాటు అక్కడే విద్యార్థులకు ట్యూషన్స్‌ కూడా చెబుతున్నారు. ట్యూషన్‌ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై ఒక్కసారిగా యాసిడ్‌తో దాడి చేశాడు. నిందితుడు  ముఖానికి మాస్కు ధరించి ఈ అఘాయిత్యానికి పాల్పడటంతో అతణ్ని గుర్తుపట్టలేకపోయారు. దాడి అనంతరం నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. 

యాసిడ్ దాడిలో సూర్యకుమారి కళ్లకు గాయాలయ్యాయి. తప్పించుకోవడానికి పక్కకు తిరగడంతో వీపు భాగంలోనూ యాసిడ్‌ పడింది. బాధితురాలిని వెంటనే కూకట్‌పల్లిలోని రెమెడీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో దాడి జరగడంపై తెలిసిన వారే పథకం ప్రకారం ఈ దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. సూర్యకుమారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? కుటుంబంలో ఏవైనా తగాదాలు ఉన్నాయా? పాఠశాలలో ఇటీవల ఏదైనా సంఘటన చోటుచేసుకుందా తదితర కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

English Title
acid-attack-on-teacher-in-hyderabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES