మొబైల్ నెంబర్లలో సంచలనాత్మక మార్పులు

మొబైల్ నెంబర్లలో సంచలనాత్మక మార్పులు
x
Highlights

ఇన్నేళ్లూ మొబైల్ నెంబర్ ఎంతంటే.. 10 అంకెలు చెబుతూ వచ్చాం. ఇక నుంచి 13 అంకెల నెంబర్ చెప్పాలి. అవును.. 2018, జూలై 1 నుంచి కొత్త సిరీస్ రాబోతోంది. కేంద్ర...

ఇన్నేళ్లూ మొబైల్ నెంబర్ ఎంతంటే.. 10 అంకెలు చెబుతూ వచ్చాం. ఇక నుంచి 13 అంకెల నెంబర్ చెప్పాలి. అవును.. 2018, జూలై 1 నుంచి కొత్త సిరీస్ రాబోతోంది. కేంద్ర టెలికాం శాఖ సంచలన నిర్ణయం మేరకు జూలై 1 నుంచి కొత్తగా సిమ్ కార్డ్ తీసుకునే వారికి ఈ నెంబర్లు ఇస్తారు. మొబైల్ టూ మొబైల్ కస్టమర్లకు 13 అంకెల కొత్త సిరీస్ నెంబర్ ఇవ్వనున్నారు. అన్ని టెలికాం కంపెనీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

కొత్తగా 13 అంకెల మొబైల్ నెంబర్లు రానున్నాయి. ఈ వార్త దావానలం కన్నా దారుణంగా వ్యాపించింది. 10 అంకెల నెంబర్ గుర్తుంచుకోవడమే కష్టంగా మారిన రోజుల్లో మరో 3 అంకెలు గుర్తుంచుకోవాలా అని అంతా కంగారు పడిపోయారు. హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఒకటే చర్చలు.

కేంద్ర టెలికాం శాఖ ఇకపై వినియోగదారులకు13 అంకెల నెంబర్లను కేటాయించాలని టెలికాం ఆపరేటర్లను కోరింది. త్వరలోనే కొత్త నెంబర్లు చలామణిలోకి రానున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రస్తుతం మనుగడలో ఉన్న 10 అంకెల నెంబర్లన్నిటినీ 13 అంకెలలోకి మారుస్తారు. ఈ ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని కేంద్ర టెలికాం మంత్రిత్వశాఖ ప్లాన్ చేస్తోంది. ఈ వార్త తెలియగానే దేశంలోని దాదాపు 100 కోట్ల సెల్‌ఫోన్ వినియోగదారులు చర్చల్లో మునిగితేలారు. 100 కోట్ల అంకెలు అయిపోయాయా అని ఆశ్చర్యపోయారు.

అయితే టెలికాం శాఖ మాత్రం సంచలన నిర్ణయానికి వివరణ ఇచ్చింది. వినియోగదారులకు మరింత మెరుగైన రక్షణ ఇచ్చేందుకే 13 అంకెల నెంబర్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 13 అంకెల నంబరుకు పోర్టబులిటీ చేసుకోవాలి. డిసెంబర్ 31 నాటికల్లా పోర్టబులిటీ గడువు ముగుస్తుంది. 2018 జూలై నుండే టెలికాం శాఖ కొత్తగా మొబైల్ ఫోన్ వినియోగదారులకు 13 అంకెల నెంబర్లను కేటాయించనుంది. ఈ ఏడాది జూలై నుంచి కొత్త కనెక్షన్ తీసుకొనే వారికి 13 అంకెల నెంబర్లు మాత్రమే కేటాయించనున్నారు.

13 అంకెల మొబైల్ నెంబర్ల జారీకి ట్రాయ్ ఆమోద ముద్ర వేసిందని టెలికాం వర్గాలు తెలిపాయి. ఆ వెంటనే టెలికాం శాఖ 13 అంకెల నెంబర్లను జారీ చేసేందుకు కసరత్తును ప్రారంభించింది. దీంతో ఇప్పటివరకు 11 అంకెల చైనా మొబైల్ నెంబర్ల రికార్డు తుడిచి పెట్టుకుపోనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ నెంబర్ ఉన్న దేశంగా భారత్ రికార్డులకెక్కనుంది. ఇలా సాగాయి చర్చలు.

13 అంకెల మొబైల్ నెంబర్లపై ఎవరి ఇష్టం వచ్చిన వ్యాఖ్యానం వాళ్లు చెబుతుండటంతో వినియోగదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎన్నో ఏళ్లుగా వాడుతున్న నెంబర్ మారితే పరిస్థితేంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. కొన్ని కోట్ల మంది కమ్యూనికేషన్ వ్యవస్థను ఉన్నట్టుండి ఇలా ఒక్క కలంపోటుతో మార్చేస్తారా అని ఆవేశం, ఆక్రోశం, ఆగ్రహం వ్యక్తమయ్యాయి.

13 అంకెల మొబైల్ నెంబర్ సిరీస్ ను టెలికాం శాఖ ఆమోదించినట్లు టెలికాం కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఉన్న 10 అంకెల నెంబర్ కూడా పని చేసే విధంగానే కొత్త నంబరింగ్ విదానం ఉంటుందని.. కస్టమర్లు ఎలాంటి ఆందోళన పడొద్దని ఎయిర్ టెల్ ప్రకటించింది. ప్రస్తుత నెంబర్ కి మరో మూడు అంకెలు అదనంగా చేరతాయని.. కస్టమర్లు ఆందోళన చెందనక్కర్లేదని టెలికాం శాఖ ప్రకటించింది.

కొత్త మొబైల్ నెంబర్ల మార్పుపై జాతీయ వార్త సంస్థలతో పాటు స్థానిక మీడియాలోనూ వచ్చిన వార్తలపై ప్రతి ఒకరిదీ తలో మాట. భద్రత పెంచేందుకని కొందరంటే అలా హఠాత్తుగా మార్చేస్తే పరిస్థితేంటనేది మరికొందరి ప్రశ్న. తన ప్రకటన కారణంగా ఏర్పడిన గందరగోళంతో టెలికాం శాఖ మరింత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.

13 అంకెల విధానం కేవలం 'మెషిన్ టు మెషిన్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని టెలికాం శాఖ తెలిపింది. ఇంటర్నెట్‌తో నడిచే 'ఎం-టు-ఎం' పరికరాలు... క్రెడిట్ కార్డు స్వైపింగ్ యంత్రాల్లాగా పని చేస్తాయి. వీటిల్లో... సిమ్ కార్డు వినియోగించడం వల్ల మొబైల్ నంబర్ మాదిరిగా వాటికి 10 అంకెల నెంబరు ఉంటుంది. ఏదైనా లావాదేవీలు జరిగినప్పుడు ఈ సిమ్‌ నంబరు నుంచి బ్యాంకు సర్వర్‌కు ఇంటర్నెట్‌ ద్వారా ఈ నెంబరు నమోదు అవుతుంది. అయితే జులై 1 నుంచి కొత్తగా చేరే 'ఎం-టు-ఎం' వినియోగదారులకు 10 నెంబర్లకు బదులుగా 13 అంకెల నంబర్లను జారీ చేయనున్నారు. ఇప్పటికే 'ఎం-టు-ఎం' వాడుతున్న వినియోగదారులకు మాత్రం అక్టోబర్ 1 నుంచి 13 అంకెల నంబరును కేటాయిస్తామని టెలికాం శాఖ స్పష్టం చేసింది.

మొబైల్‌ నంబర్లు యథావిధిగా 10 నెంబర్లుగానే ఉంటాయని టెలికాం శాఖ ప్రకటించింది. ఈ తాజా వివరణతో మొబైల్ నెంబర్లన్నీ 13 అంకెల్లోకి మారతాయన్న ప్రచారం అసత్యమేనని తెలిసింది.
మొబైల్ వినియోగదారుల భద్రతను మరింత పెంచే ప్రయత్నంలో, కేంద్రం ప్రవేశపెట్టదలచిన 13 అంకెల మొబైల్ నంబర్‌ వార్త మొత్తానికి కోట్లాదిమంది దేశీయ మొబైల్‌ వినియోగదారులకు కలవర పెట్టింది. సోషల్‌ మీడియాలో నెంబర్‌ పోర్టింగ్‌ అంశంపై వార్తలు చక్కర్లు కొట్టి కొద్దిగంటలపాటు గందరగోళానికి గురిచేసి చివరికి టీ కప్పులో తుపానులా చల్లారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories