చిట్టితల్లికి అంతులేని వేదన

x
Highlights

100 రోజులు. తన్విత తల్లికి దూరమై ఇవాళ్టికి సరిగ్గా 100 రోజులు. కన్న ప్రేమ..పెంచిన ప్రేమ మధ్య పోరాటంలో నలిగిపోతున్న చిన్నారి... అమ్మ ఒడికి దూరమై...

100 రోజులు. తన్విత తల్లికి దూరమై ఇవాళ్టికి సరిగ్గా 100 రోజులు. కన్న ప్రేమ..పెంచిన ప్రేమ మధ్య పోరాటంలో నలిగిపోతున్న చిన్నారి... అమ్మ ఒడికి దూరమై అప్పుడే మూడు నెలలు దాటి పోయింది. అమ్మ ప్రేమకు దూరమైన ఇల్లందు చిన్నారి తన్విత ఇంకా ఖమ్మం బాలసదనంలోనే గడుపుతోంది. ఎవరూ లేని అనాథలా..ఏకాకిలా.. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. ఇప్పుడు అందరిలోనూ ఒకటే ప్రశ్న...తన్వితకు విముక్తి ఎప్పుడు..? తల్లి ఒడికి చేరేదెన్నడు.

పెద్దవాళ్లు తప్పు చేస్తే... ఊహ కూడా తెలియని పాపకు ఎందుకింత కష్టం..? కాసేపు అమ్మ కనిపించకపోతే...గుక్కపట్టి ఏడ్చే వయసు. అమ్మ తినిపిస్తే కానీ తినబోనని మారాం చేసేంత చిన్నతనం. కానీ చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తోంది. ఇద్దరు తల్లులకు న్యాయం సంగతి సరే. చిన్నారికి మాత్రం ప్రస్తుతం అన్యాయం జరుగుతోంది. ఈ విషయాన్ని ఎవరూ ఆలోచించడంలేదు. 100 రోజులుగా తన్విత అమ్మ కోసం కలవరిస్తోంది. అమ్మ కావాలంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ అడుగుతోంది. కానీ అమ్మను తెచ్చిచ్చేవారే లేరు. అమ్మ ఏదంటే సరైన సమాధానం చెప్పే వారు లేరు. అమ్మ లేకుండా ఎన్నడూ గడపని తన్విత.. ప్రస్తుతం 100 రోజులుగా ఆమెకు దూరంగా ఉంటోంది.

100 రోజులుగా ఇంటికి దూరమైన తన్విత మళ్లీ అక్కడికి చేరేదెప్పుడు.? అందరిలాగా మళ్లీ తల్లి చేతి గోరు ముద్దలు తినేదెప్పుడు..? అందరు పిల్లల్లా స్వేచ్చగా తిరిగేది ఎప్పుడు? బుడిబుడి నడకలతో బొమ్మలతో ఆడుకునేదెప్పుడు. తల్లి ఒడిలో వెచ్చగా నిద్రపోయే రోజు ఎప్పుడు...? కొద్ది రోజుల్లో కేసు తేల్చేస్తామన్న అధికారులు..ఇప్పుడు నోరు మెదపడం లేదు. తల్లుల గొడవ సంగతి వదిలేద్దాం. కనీసం చిన్నారి ఆరోగ్యం గురించైనా ఆలోచించాలి కదా..? తల్లి లేకుండా ఓ పాప ఇన్ని రోజులు ఎలా ఉండగలదు..? అధికారులు, న్యాయస్థానాలు కనీసం పాప ఆరోగ్యం గురించి ఎందుకు ఆలోచించడం లేదు. అధికారులు కనీస మానవత్వంతో ఎందుకు చూడడంలేదు.

తన్విత కథనం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి hmtv చిన్నారి వేదనను ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తోంది. తన్విత కన్నీటి గాథను తెలియజేస్తూ..ఆమెకు మద్దతు కూడగడుతోంది. తల్లుల ఆవేదనను ప్రేక్షకులకు చూపిస్తోంది. ఇప్పుడు అందరూ కోరుకునేది ఒకటే తన్వితను ఇద్దరు తల్లుల్లో ఎవరో ఒకరి త్వరగా అప్పగించమని. చిన్నారి తన్వితపై hmtvలో వస్తున్న వరుస కథనాలకు విశేష స్పందన లభిస్తోంది. చిన్నారి విషయంలో అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తన్విత వివాదంపై ఆమె పెంపుడు తల్లి స్వరూప హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన్వితను చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఉంచడం చట్ట విరుద్ధమని ఫిర్యాదు చేశారు. తన్వితను వెంటనే న్యాయస్థానంలో హాజరుపరచాలని కోరారు. స్వరూప వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు అప్పట్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి, తన్విత కన్నతల్లి ఉమకి, పోలీసులకు నోటీసులు ఇచ్చింది.

తన్విత వివాదంపై ఖమ్మం ICDS అధికారులు ఇప్పటికే స్థానిక కోర్టుకు నివేదిక సమర్పించారు. కానీ నిర్ణయం ప్రకటించడంతో మాత్రం ఆలస్యం అవుతోంది. అసాధారణమైన కేసును కూడా ఇతర కేసుల్లానే భావిస్తూ తీర్పు ఇవ్వకుండా సాగదీస్తున్నారు. ఈ ఆలస్యానికి కారణం ఏంటి..? ఆటపాటలతో ఆడుకునే చిన్నారిని భయానక స్థితిలోకి ఎందుకు తీసుకెళుతున్నారు..? తుది నిర్ణయం కోసం ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి.

ఒంటరి దానిగా మారిపోయిన తన్విత కథ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎందరో తల్లుల మాట ఇప్పుడు ఒకటే. విచారణ త్వరగా ముగించి పాపను అమ్మ ఒడికి చేర్చాలని. పాప ఆరోగ్యంతో చెలగాటమడొద్దని. ఇప్పటికైనా అధికారులు న్యాయస్థానాలు మానవతా ధృక్పధంతో ఆలోచించాలి. అమ్మ ప్రేమకు దూరమైన చిన్నారి కేసును త్వరగా తేల్చాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories