జేసీ మాటలకు అర్థాలే వేరా.. జేసీ కామెంట్ల వెనక అసలు కథేంటి?

జేసీ మాటలకు అర్థాలే వేరా.. జేసీ కామెంట్ల వెనక అసలు కథేంటి?
x
Highlights

ఆయన మాటలకు అర్థాలే వేరు. ఆ‍యన చేష్టలకు పరమార్థాలే వేరు. ప్రశంసలు వెంటనే విమర్శలు. మాటల్లేకపోయినా పలకరింపులు. ఆహ్వానం రాకపోయినా మీటింగ్‌లు. ఇంతకీ ఆయన...

ఆయన మాటలకు అర్థాలే వేరు. ఆ‍యన చేష్టలకు పరమార్థాలే వేరు. ప్రశంసలు వెంటనే విమర్శలు. మాటల్లేకపోయినా పలకరింపులు. ఆహ్వానం రాకపోయినా మీటింగ్‌లు. ఇంతకీ ఆయన ఎవరో మీకిప్పటికే అర్థమై వుంటుంది. జేసీ దివాకర్‌ రెడ్డి. ఈమధ్య ఆయన బీజేపీ జపం చేస్తున్నారు. కానీ కండీషన్స్‌ అప్లై అంటున్నారు. గ్రేటర్‌ రాయలసీమ నినాదం ఎత్తుకున్నారు. అమరావతే రాజధానిగా వుండాలంటున్నారు. జేసీ మాటలకు అర్థాలేంటి? నిజంగా బీజేపీలోకి వెళతారా లేదంటే దాన్నొక బూచిగా చూపాలని ఆలోచిస్తున్నారా? జేసీ కామెంట్ల వెనక అసలు కథేంటి?

నిత్యం సంచలన వ్యాఖ్యలతో హెడ్‌లైన్స్‌లో నిలిచే, అనంతపురం మాజీ ఎంపీ, తెలుగుదేశం నేత జేసీ దివాకర్‌ రెడ్డి, కొన్నిరోజులుగా అంతకుమించిన సెన్సేషనల్‌ కామెంట్లు, చర్యలతో చెలరేగిపోతున్నారు. ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు టీడీపీలో ఉంటానంటునే బీజేపీలో చేరే అవకాశం కూడా ఉందని సిగ్నల్స్ ఇచ్చి, కలకలం రేపారు జేసీ. బీజేపీలో చేరే అవకాశం వుందంటూనే, కండీషన్స్ అప్లై అన్నారు.

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో జేసీ దివాకర్ రెడ్డి సమావేశమయ్యారు. ఓ హోటల్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సత్యకుమార్‌ దగ్గరకు, ఎలాంటి ఆహ్వానం లేకుండానే వెళ్లి జేసీ మీట్‌ అయ్యారు. అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్‌లో ఇష్యూ జరిగిన మరుసటి రోజే బీజేపీ నేతను జేసీ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే కేంద్రహోంమత్రి కిషన్‌ రెడ్డిని కూడా జేసీ కలిశారు. తన ట్రావెల్‌ బస్సులను సీజ్‌ చేయడం, అలాగే ఒక రోజంతా తనను పోలీస్‌ స్టేషన్‌లో వుంచడంతో పాటు అనేక కేసులు మోపుతున్నారని జేసీ అంటున్న నేపథ్యంలో, ఎలాంటి పనీ లేకపోయినా, బీజేపీ నేతలను జేసీ కలవడం ఆసక్తి కలిగిస్తోంది. కాషాయ నేతలను ఎందుకు కలిశారన్నదానిపై ఎవరికివారు అంచనాలు వేసుకుంటున్నారు.

బీజేపీ నేతలను కలవడం కాషాయ తీర్థం పుచ్చుకునే సంకేతమేనా? మరి పార్టీ మారాలనుకుంటే కండీషన్స్‌ అప్లై అని ఎందుకంటున్నారు? బీజేపీ నేతలను కలవడం ద్వారా జగన్‌కు జేసీ పంపాలనుకున్న సిగ్నల్స్ ఏంటి?

జేసీ దివాకర్‌ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కుండబద్దలు కొట్టినట్టే కనిపించినా, దాని వెనక అర్థాలు వేరే వుంటాయన్నది ఆయన గురించి బాగా తెలిసిన నేతల మాట. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో జేసీ కుటుంబం దారుణంగా ఓడిపోయింది. అన్నదమ్ములు ఇద్దరూ పోటీ చేయకపోయినా, తమ కుమారులను నిలబెట్టారు. కానీ కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో వారసులకు ఓటమే ఎదురైంది. ఎన్నికలకు ముందు జగన్‌ను ప్రతి వేదికపైనా తిట్టిపోసిన జేసీ, టీడీపీకి కూడా అధికారం చేజారడంతో అల్లాడిపోతున్నారు. తాను అన్న మాటలను మనసులో పెట్టుకుని, జగన్‌ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపోతున్నారు. ఎందుకైనా మంచిదని సీఎం జగన్‌పై అప్పుడప్పుడు ప్రశంసలూ కురిపించారు.

ఆరోగ్యశ్రీతో పాటు ఆరు నెలల పాలన కూడా బాగుందని కితాబిచ్చారు. కానీ జేసీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను సీజ్‌ చేయడంతో మళ్లీ రగిలిపోయారు. చంద్రబాబు అనంతపురంకు వచ్చిన టైంలో, జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. అలాగే పోలీసులపై అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో అనంత పోలీసులు జేసీపై కేసు నమోదు చేశారు. ఒకరోజంతా స్టేషన్‌లోనే వుంచారు. బెయిల్‌ ఇచ్చినా వదల్లేదట. మధ్యాహ్నం భోజనమే కాదు, కనీసం టీ నీళ్లు కూడా ఇవ్వలేదని ఉడికిపోయారు జేసీ. పోలీసులు ఎప్పుడేం చేస్తారోనని టెన్షన్‌ పడుతున్న జేసీ, ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను కలిశారని, తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, దీనిపై కేంద్రం ద్వారా జగన్‌తో మాట్లాడాలని విన్నవించారట.

ఎన్నికలు ముగిసిన నాటి నుంచి జేసీ బీజేపీలోకి వెళతారన్న ప్రచారం జరిగింది. ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీ, జేసీ లాంటి స్ట్రాంగ్‌ లీడర్‌ వుంటే, సీమలో ఖాతా తెరవచ్చని లెక్కలేస్తోంది. ఈ నేపథ్యంలోనే జేసీకి ఆహ్వానం పంపిందని తెలుస్తోంది. అయితే, సీమలో బీజేపీకి కష్టమని భావిస్తున్న జేసీ, అందుకు తిరస్కరిస్తూ వచ్చారట. అయితే, తన అనుచరులు చాలామంది వైసీపీలో చేరుతుండటం, తనపై కేసులు, తన ట్రావెల్స్‌ బస్సుల సీజ్‌తో తీవ్ర ఒత్తిడిలో వున్నారట. అందుకే బీజేపీతోనైనా టచ్‌లోకి వెళ్తే, జగన్‌ను కాస్తయినా నిలువరించవచ్చని, కేంద్రం ద్వారా చక్రంతిప్పి, తాను ప్రశాంతంగా వుండొచ్చని లెక్కలేస్తున్నారట. జేసీ దివాకర్‌ బీజేపీతో స్నేహం కోరుకుంటున్నారు కానీ, ఆ పార్టీలోకి వెళ్లే ఉద్దేశం మాత్రం లేదని, ఆయన మాటలను బట్టే అర్థమవుతోంది. ఎందుకంటే, బీజేపీలోకి వెళతాను కానీ అంటూ ఆ‍యన కొన్ని అలవికాని కండీషన్స్‌ను ప్రతిపాదించడమే అందుకు నిదర్శనం.

అయితే ప్రాంతీయ పార్టీలు ఉన్నంతవరకు తాను టీడీపీలోనే ఉంటానని జేసీ చెప్పడం ద్వారా, కమలంలోకి వెళ్లడం ఆ‍యనకిష్టంలేదని అర్థమవుతోంది. అయితే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాత్రం జాతీయ పార్టీలే కీలకమనడం ద్వారా, బీజేపీ నేతలను దువ్వే ప్రయత్నం చేశారన్న మాటలు వినపడుతున్నాయి. దీనికి మరికొంత లాజిక్‌ యాడ్ చేశారు జేసీ. తాను పార్టీ మారబోనని ఒకవేళ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ స్వాధీనం చేసుకుంటే బీజేపీలో చేరతానని ప్రకటించారు. 70 ఏళ్లలో కానీ కశ్మీర్ విభజన చేసిన మోడీ-అమిత్ షా ద్వయం పీవోకే కూడా తీసుకొస్తే బీజేపీలో చేరే తొలి వ్యక్తిని తానేనని చెప్పారు. అప్పుడు జాతీయ పార్టీల ప్రాధాన్యం పెరిగిపోతుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలకు ఆశించినస్థాయిలో ఆదరణ ఉండదని అభిప్రాయపడ్డారు.

ఇప్పట్లో పీఓకేను ఆక్రమించడం అంత సులువుకాదని అందరికీ తెలుసు. అదే జరిగితే మరో కార్గిల్‌వార్‌ తప్పదు. ప్రత్యక్ష యుద్ధానికి రెండు దేశాలు సిద్దంగా లేవు. అంటే పీఓకే ఆక్రమణ ఇప్పట్లో జరిగేది కాదు, ప్రాంతీయ పార్టీలు అంతరించే అవకాశం అంతకన్నా లేదు. అంటే జేసీ కమలం గూటికి చేరడం అయ్యేపని కాదు. కానీ బీజేపీ ప్రభుత్వం మీద ప్రేమ కురిపించడానికి, ఆ పార్టీ కీలక నేతలను కలవడానికి కారణం, ప్రస్తుతం అనంతలో తనకు విపరీతమైన కష్టాలు. బస్సుల సీజ్, కేసుల ఒత్తిడితో సతమతమవుతున్న జేసీ, బీజేపీ నేతలను కలవడం, కేంద్రం బూచి చూపి జగన్‌కు కొంతలో కొంతైనా కంట్రోల్‌లో పెట్టాలనుకోవడమేనని అనలిస్టులంటున్నారు. ఆ విధంగా తన జోలికి రాకుండా కాచుకోవడమేనని, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

దీనికి తోడు గ్రేటర్‌ రాయలసీమ డిమాండ్‌ను కూడా మళ్లీ తెరపైకి తెస్తున్నారు జేసీ. త్వరలోనే గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని మొదలు పెడతామని అన్నారు. గ్రేటర్ రాయలసీమ కోసం త్వరలోనే సమావేశం అవుతామని, తమ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం మార్చాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు.

గ్రేటర్‌ డిమాండ్‌ను తెరపైకి తేవడం కూడా, జేసీ వ్యూహంలో భాగమేనని కొందరంటున్నారు. విశాఖ రాజధాని అంటే, తాను గ్రేటర్‌ రాయలసీమ అంటానని వైసీపీ ప్రభుత్వానికి సంకేతాలు పంపారు. అలా వీలైనంతగా తన జోలికి ప్రభుత్వం రాకుండా, అటు బీజేపీ అస్త్రం, ఇటు గ్రేటర్ రాయలసీమ ఆయుధం బయటకు తీస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి కొన్నిసార్లు ప్రశంసలు, వెంటనే విమర్శలు, ఆహ్వానంలేకపోయినా బీజేపీ నేతలను కలవడం, ఇలా జేసీ మాటలు, చేతలకు అర్థాలేవేరని విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండితులు. ఆయన అడుగులు ఎటువైపో కాలమే చెప్పాలి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories