AP News: పిఠాపురం మే సవాల్. పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలుస్తారా?

Pithapuram Can Challenge Will Pawan Kalyan Win In Pithapuram
x

AP News: పిఠాపురం మే సవాల్. పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలుస్తారా? 

Highlights

AP News: జనసేన నుంచి పవన్ కల్యాణ్ పోటీ

AP News: పవన్ కల్యాణ్‌కు గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున అభిమానులున్నారు. ఆయనకు కుల, మతాలకు అతీతంగా ఆయను ఆరాధించేవారు ఎందరో ఉన్నారు. అయితే జనసేన ఏర్పాటు చేసిన తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పవన్ కల్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ ప్రారంభించకముందు, ఆయన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం అధ్యక్షుడిగా వ్యవహరించారు. చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత, కొన్నాళ్లకు 2014 ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ జనసేన స్థాపిస్తున్నట్టు చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో బీజేపీ-టీడీపీ కూటమికి ఆయన మద్దతిచ్చి ఎన్నికల బరిలో నిలవలేదు. ఆ ఎన్నికల్లో ఏపీలో కూటమి గెలిచింది. తొలినాళ్లలో టీడీపీతో సఖ్యతగానే ఉన్న పవన్ కల్యాణ్ ఆ తర్వాత ఆ పార్టీతోనూ, బీజేపీతోనూ విభేదించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీఎస్పీ, ఉభయ కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఎన్నికలయ్యాక పవన్ తిరిగి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీతో సఖ్యతగా ఉంటూనే, ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారును కూలదోయాలంటే జనసేన-బీజేపీతో మాత్రమే కాదని, టీడీపీని కలుపుకువెళ్లాలని ఆయన ఆలోచించారు. ఆ తర్వాత బీజేపీ పెద్దలతో మాట్లాడి, టీడీపీతో పొత్తు కుదరడంలో కీలక భూమిక పోషించారు. పవన్ కల్యాణ్ పార్టీ కనీసం మూడో వంతు సీట్లలో పోటీ చేస్తుందని పార్టీ నేతలు, కార్యకర్తలు భావించినా.. మనకు అంత బలం, బలగం లేదని, సీఎం సీఎం అంటూ అరవొద్దంటూ కూడా ఆయన కార్యకర్తలకు సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. చివరకు పొత్తు ఖరారయ్యే సరికి కూటమిలో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు దక్కాయి. ఈ సీట్లలో కూడా జనసేన తరపున ఎవరు నిల్చుంటారన్నదానిపై క్లారిటీ రావడం లేదు. వాస్తవానికి పవన్ కల్యాణ్ భీమవరం నుంచి బరిలో నిలుస్తారని అందరూ అనుకున్నప్పటికీ ఆయన పిఠాపురం ఎంచుకున్నారు. అక్కడ్నుంచి గత ఎన్నికల్లో తనతో పోటీ చేసి ఓడిపోయిన పులవర్తి ఆంజినేయులు టీడీపీ నుంచి జనసేనలో చేరి.. భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ ఈసారి ఎక్కడ్నుంచి పోటీ చేస్తారన్న చర్చ మొదలైంది. అయితే తాజాగా ఆయన పిఠాపురం నుంచి బరిలో దిగబోతున్నట్టు స్పష్టం చేశారు.

వాస్తవానికి 2009లో ఇక్కడ నుంచి వంగా గీత ప్రజారాజ్యం నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ-వైసీపీ పోటీ చేసినప్పటికీ.. స్వతంత్ర అభ్యర్థిగా వర్మ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వర్మ టీడీపీ నుంచి పోటీ చేసి దొరబాబు చేతిలో ఓడారు. అయితే ఈసారి ఈ నియోజకవర్గం నుంచి మొన్నటి వరకు కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత బరిలో దిగుతున్నారు. ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి లోక్ సభ, ఒకసారి రాజ్యసభకు ఎన్నికైన గీతకు కాకినాడ చుట్టూ బలగం, బంధుత్వం ఉన్నాయి. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటంతో గీత, పవన్ కల్యాణ్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. వంగా గీత సైతం కాపు సామాజికవర్గానికి చెందిన మహిళ కావడం విశేషం. మరోవైపు వర్మ సైతం తాను పోటీ చేసి తీరతానంటున్నారు. ఆయన క్షత్రియ వర్గానికి చెందినవారు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు. 2019లో, ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన గీతకు అనూహ్యంగా ఎంపీ టికెట్ లభించింది. ఆ ఎన్నికల్లో ఆమె టీడీపీ నుంచి బరిలో నిలిచిన చలమలశెట్టి సునీల్ ను ఓడించారు. తాజా ఎన్నికల్లో ఆమె పిఠాపురం బరిలో నిలుచుండటంతో హోరాహోరీ తప్పదని చెబుతున్నారు.

పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో కాపు సామాజికవర్గం సుమారుగా 30 శాతం వరకు ఉండగా, మాలలు 12 శాతం, శెట్టి బలిజలు, చేనేతలు, బెస్తలు సుమారు 10 శాతం చొప్పున ఉన్నారు. ఆ తర్వాత స్థాయిలో రెడ్డి, యాదవ, తూర్పు కాపులు, మాదిగలు గణనీయ స్థాయిలో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. చిరంజీవి అటు పాలకొల్లు, ఇటు తిరుపతి నుంచి పోటీ చేయగా, ఆయన పాలకొల్లులో కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి చేతిలో ఓటమిపాలయ్యారు. పాలకొల్లులోనూ కాపు ఓటర్లు 30 శాతం వరకు ఉన్నారు. అయినా 5 వేల ఓట్లతో ఓడారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు మధ్య ఓట్ల చీలిక జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. గోదావరి జిల్లాల్లో కాపు ఓటర్లు గణనీయంగా ఉన్నప్పటికీ చిరంజీవి ఓటమిపాలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా పవన్ కల్యాణ్ అటు ఎంపీగానూ, ఇటు ఎమ్మెల్యేగానూ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన ఈసారి కేవలం అసెంబ్లీకి మాత్రమే వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా కన్పిస్తోంది. అటు, ఇటూ పోటీ చేస్తే అసలుకే ఎసరవుతుందని ఆయన వర్రీలో ఉన్నారు. అచ్చివచ్చిన గోదావరి జిల్లాలో ఈసారి గెలిచి.. పోయిన ప్రతిష్టను నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories